శంషాబాద్‌కు కృష్ణా నీటిని అరకొరగా సరఫరా | Inadequate krishna water supply to shamshabad | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌కు కృష్ణా నీటిని అరకొరగా సరఫరా

Published Sat, Oct 12 2013 1:15 AM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM

Inadequate krishna water supply to shamshabad

శంషాబాద్‌, న్యూస్‌లైన్‌: శంషాబాద్‌కు కృష్ణా నీటి సరఫరా తూచ్‌ అన్నట్లుగానే మారింది. కృష్ణా నీటిని తాము తెచ్చామంటే తామేతెచ్చామంటూ గొప్పలు చెప్పుకొనే నేతలు.. అస్తవ్యస్తంగా మారిన సరఫరా పరిస్థితిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా శంషాబాద్‌కు కృష్ణా నీటి సరఫరా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పట్టణానికి కృష్ణా నీటి సరఫరాను ఈ ఏడాది జనవరి 10న మాజీ హోంమంత్రి సబితారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌లు అట్టహాసంగా ప్రారంభించారు. ప్రారంభం రోజు మాత్రమే నీటి సరఫరా చేపట్టిన జలమండలి ఆ తర్వాత నిలిపివేసింది. జలమండలికి చెల్లించాల్సిన రూ.13 కోట్ల బకాయిల కారణంగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ఎట్టకేలకు నెలరోజుల క్రితం దీనికి సంబంధించిన గ్రాంట్‌ను ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు జలమండలికి హామీ ఇవ్వడంతో నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో పట్టణవాసులు తమ కష్టాలు తీరాయని సంబరపడ్డారు.

కానీ ఈ సంతోషం మూన్నాళ్ల ముచ్చటగానే మారింది. శంషాబాద్‌ పట్టణ జనాభాకు అనుగుణంగా ప్రతిరోజూ పదిలక్షల లీటర్ల నీటిని విడుదల చేయాల్సిందిగా గ్రామీణ నీటిసరఫరా విభాగం ప్రతిపాదించగా జలమండలి అందుకు ససేమిరా అంటోంది. కేవలం వారానికి 35 లక్షల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేయడానికి జలమండలి ముందుకొచ్చింది. దీంతో నెల రోజులుగా జలమండలి నుంచి అరకొరగా విడుదలవుతున్న నీటిని సరఫరా చేయడం స్థానికంగా ఇబ్బందికరంగా మారింది. రూ.13 కోట్ల డిపాజిట్‌ ప్రక్రియ పూర్తికాకపోవడంతో జలమండలి నీటి సరఫరా చేయడానికి వెనుకా ముందూ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జలమండలి నుంచి నీటి సరఫరా మరింత తగ్గిపోవడంతో పదిరోజులుగా శంషాబాద్‌లో తాగునీటి మాటే లేకుండాపోయింది. నీటి సరఫరా చేపట్టగానే అట్టహాసంగా సంబరాలు చేపట్టే ఆయా పార్టీల నేతలు మాత్రం అసలుకే నీటి సరఫరా నిలిచిపోయినా పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

మూడు బస్తీలకు మాత్రమే
ప్రస్తుతం కేవలం మూడు బస్తీలకు మాత్రమే శంషాబాద్‌లో కృష్ణా నీటిని సరఫరా చేస్తున్నారు. మొయిన్‌ మహల్లా, అహ్మద్‌నగర్‌, బ్రాహ్మణ్‌వాడీ బస్తీలకు మాత్రమే సరఫరా జరుగుతోంది. కాపుగడ్డ, యాదవ్‌బస్తీ, వీకర్‌సెక్షన్‌ కాలనీ, రుద్రాకాలనీ బస్తీలకు ఇంతవరకూ నీటి సరఫరా చేపట్టనే లేదు. మెహిదీ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సంప్‌లోకి ఇంతవరకూ కృష్ణా జలాలు చేరకపోవడంతో ఈ బస్తీలకు నీటి సరఫరా చేపట్టలేదు. ఇక రైల్వేట్రాక్‌కు కుడివైపు ఉన్న సిద్దంతి, మధురానగర్‌, ఆర్బీనగర్‌ రాళ్లగూడ తదితర ప్రాంతాలకు ప్రస్తుతానికి నీటి సరఫరా చేసే యోచన కూడా కనిపించడం లేదు. దీని కోసం, నేషనల్‌ హైవే అథారిటీ, కేంద్ర రైల్వే శాఖల నుంచి అనుమతి పొందిన తర్వాతే పైప్‌లైన్‌ వేయడానికి మార్గం సుగమమవుతుంది. శంషాబాద్‌ పట్టణంతో పాటు గతంలో ప్రతిపాదించిన మరో ఏడు గ్రామాలను కలుపుకుని ఏడేళ్ల క్రితం వేసిన అంచనా ప్రకారం ప్రతిరోజూ 35 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది.

అవసరానికి సరిపడా విడుదల కావడం లేదు

శంషాబాద్‌కు ప్రస్తుతమున్న అవసరం మేరకు జలమండలి నుంచి నీటి సరఫరా కావడం లేదు. వారానికి 35 లక్షల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తుండడంతో బస్తీలకు నీటి సరఫరా చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జలమండలికి చెల్లించాల్సిన రూ. 13 కోట్ల డిపాజిట్‌కు సంబంధించిన గ్రాంట్‌ రెడీగా ఉన్నప్పటికి ప్రస్తుత సమ్మె కారణంగా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
- వెంకటరమణ, గ్రామీణ నీటి సరఫరా ఈఈ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement