శంషాబాద్, న్యూస్‌లైన్ : శంషాబాద్‌కు కృష్ణా జలాలు తెచ్చింది తామంటూ... లేదు ఇచ్చింది మేమంటూ కాంగ్రెస్, టీడీపీల నేతలు పోటీపడి ప్రచారం చేసుకున్నారు. ఇవిగో నీళ్లంటూ ప్రారంభోత్సవాలు జరిపి గొప్పలు పోయారు. ఇక ఈ ప్రాంతంలో తాగునీటికి కొరత ఉండదని గప్పాలు కొట్టారు.
శంషాబాద్‌కు కృష్ణా నీటి సరఫరా ఘనత తమదేనంటూ ఇరు పార్టీల నాయకులు ఇంకా ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. క్షేత్రస్థాయికి వస్తే... ప్రారంభోత్సవాలప్పుడు రెండు మూడు రోజులు సక్రమంగా, తర్వాత అరకొరగా... నెలరోజుల నుంచి పూర్తిగా నీటిసరఫరా నిల్చిపోయింది. ప్రస్తుతం పంచాయతీ ద్వారా బోరుబావుల నీటిని సరఫరా చేస్తున్నారు.
కాగా, తెచ్చింది మేము... ఇచ్చింది మేమేనంటూ ఇరు పార్టీల నాయకులు ఇంకా ప్రచారం చేసుకుంటుండటాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. ఏడాదిన్నర క్రితం పథకాన్ని ప్రారంభించగా... శంషాబాద్‌కు కృష్ణా జలాలు చుక్కనీరు కూడా సరఫరా కావడం లేదు. రూ.11 కోట్లు ఖర్చు చేసి పైప్‌లైన్ పనులు పూర్తి చేసినా జలమండలితో ఉన్న సాంకేతిక సమస్యలను అధిగమించడంలో ప్రభుత్వ పెద్దలు, ప్రతిపక్ష నేతలు వందశాతం విఫలమయ్యారు. ఒక్కసారి కాదు ఏకంగా రెండు, మూడు సార్లు ఇక్కడ కృష్ణా నీటి సరఫరాను ప్రారంభించిన ఘనత కాంగ్రెస్, టీడీపీలకే దక్కుతుంది. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేత కూడా ప్రారంభం చేయించారు.
ఆ తర్వాత మాజీ హోంమంత్రి సబితారెడ్డి 2013 జనవరి 10న మరోసారి ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కృష్ణా జలాల సరఫరాలో తన కృషి కూడా ఎంతో ఉందని గొప్పలు చెప్పుకున్నారు. ఇరు పార్టీల నాయకులు కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. కొద్దిరోజుల పాటు సరఫరా అయిన నీరు మళ్లీ నిల్చిపోయింది.
జలమండలికి పట్టదు..
శంషాబాద్ గ్రామ పంచాయతీ నుంచి జలమండలికి చెల్లించాల్సిన రూ.13కోట్ల గ్రాంటు గతేడాది జూలైలోనే విడుదలైనా చెల్లింపు ప్రక్రియలో సాంకేతిక సమస్యలతో నాలుగు నెలలు ఆలస్యమైంది. మొత్తం మీద ఈ చెల్లింపు ప్రక్రియపై సర్కారు జీవో విడుదల చేసినా సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది.
శంషాబాద్‌కు కొంతకాలం అరకొరగా నీటిని సరఫరా చేసిన జలమండలి.. నెల రోజులుగా నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మరోసారి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, టీడీపీల నేతలపై శంషాబాద్‌వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.