తాకట్టు.. కనికట్టు | Inalienable gold loans | Sakshi
Sakshi News home page

తాకట్టు.. కనికట్టు

Published Mon, Sep 7 2015 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 8:52 AM

తాకట్టు.. కనికట్టు

తాకట్టు.. కనికట్టు

రుణమాఫీ మాయ
రద్దుకాని బంగారం రుణాలు
అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు
వేలం ప్రకటనతో రుణాలు రెన్యువల్ చేయించుకున్న రైతులు
 

బందరు మండలం మేకవాని పాలేనికి చెందిన నండూరి మురళీధర్‌కు రెండున్నర ఎకరాల పొలం ఉంది. రెండేళ్ల క్రితం బందరు ఇండియన్ బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రూ.82 వేల రుణం తీసుకున్నారు. అదే సంవత్సరం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొదటి విడతగా బంగారం కుదవ పెట్టి రూ.33వేలు, రెండో విడతగా రూ.43 వేలు అప్పు తీసుకున్నారు. రుణమాఫీ మొదటి, రెండు, మూడోవిడత జాబితాల్లో మురళీధర్ పేరు లేదు. రుణమాఫీ జరగలేదని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది.
 
బందరు మండలం సీతారామపురానికి చెందిన బెజవాడ రవికుమార్ తన భార్య నగలను కుదువపెట్టి మచిలీపట్నం ఇండియన్ బ్యాంకు లో రూ.లక్ష రుణం తీసుకున్నారు. టీడీపీ నాయకుల హామీతో రుణమాఫీ జరుగుతుందనే ఆశతో బకాయి చెల్లించలేదు. రుణమాఫీ జాబితాలో పేరు ఉన్నప్పటికీ పొలానికి సంబంధించిన సర్వే నంబరు తప్పుగా నమోదు చేశారు. ఈ కారణంతో రవికుమార్ బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణం మాఫీ కాలేదు. సర్వే నంబరు సరి చేయాలని బ్యాంకు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితంలేదు.  
 
మచిలీపట్నం : ముఖ్యమంత్రి చంద్రబాబు అమలుచేస్తున్న రుణమాఫీలో న్యాయం జరగక రైతులు ఆందోళన చెందుతున్నారు. రుణాల మాఫీకోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ఫలితంలేకుండా పోయింది. జిల్లాలో 2,60,737 మంది రైతులుబంగారం తాకట్టు పెట్టి రూ.3,276 కోట్ల పంట రుణాలు తీసుకున్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. ప్రభుత్వం మూడు విడతల్లో రుణమాఫీ జాబితాలను ప్రకటించింది. మొదటి విడతలో 2.84 లక్షల మంది రైతులకు రూ.997 కోట్లు రుణమాఫీ జరిగినట్లు చూపి రూ.324.95 కోట్లను విడుదల చేశారు. రెండో విడతలో 1.84 లక్షల మంది రైతులకు రూ.531.96 కోట్లు రుణమాఫీ జరిగినట్లు చూపి రూ. 227.13 కోట్లు విడుదల చేశారు. మూడో విడతలో రూ.78.25 కోట్లు జరిగినట్లు చూపి రూ.36.33 కోట్లను విడుదల చేసినట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. బంగారం తాకట్టుపెట్టి రూ.50వేలు లోపు పంట రుణం తీసుకుంటే ఆ తరహా రైతులకు రుణమాఫీ జరిగిందని బ్యాంకు అధికారులు వివరిస్తున్నారు. వ్యవసాయ అవసరాల కోసం ఇంట్లోని భార్య, పిల్లల గాజులు, పుస్తెల తాళ్లు తదితరాలను తాకట్టుపెట్టి పంట రుణాలు తీసుకున్నారు. ఎన్నికల ముందు టీడీపీ నాయకులు ఇచ్చిన హామీ మేరకు బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న రుణాలు చెల్లించకపోవటంతో వడ్డీ పెరిగిపోయింది.

గడువు మీరిన రుణాలను వసూలు చేసుకునేందుకు బ్యాంకు అధికారులు బంగారు నగలు వేలం వేస్తామని ప్రకటనలు ఇచ్చారు. దీంతో రైతుల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. ఇంత వ్యవసాయం చేసి భార్య, పిల్లల నగలు విడిపించుకోలేకపోయామని ఆవేదన చెందుతున్నారు. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారు నగలు వేలానికి వెళ్లకుండా బయట అప్పులు చేసి వడ్డీ, బకాయిలు చెల్లించారు. బందరు మండలం చిన్నాపురం కెడీసీసీ బ్యాంకులో బంగారం తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్న వారి జాబితాలను సకాలంలో పంపకపోవటంతో ఆ బ్యాంకు పరిధిలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ అమలు కాలేదు. ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యాన పంటలపై తీసుకున్న రుణాలను రద్దు చేసేది లేదని వాటిని పక్కన పెట్టించారు. ప్రస్తుతం ఉద్యాన పంటల కోసం రైతులు తీసుకున్న రుణాల జాబితాను తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఈ జాబితాలను ఎప్పటికి తయారు చేస్తారు. ఎప్పటికి అమలు చేస్తారనే అంశం ప్రశ్నార్థకంగా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement