
పాఠాలు నేర్వని టీటీడీ
వైకుంఠ ఏకాదశినాడు లోపించిన సమన్వయం
ఆగని భక్తుల ఆందోళనలు
1.63 లక్షల మందికి రికార్డు దర్శనం
ఈవో, జేఈవో స్వీయ పర్యవేక్షణతో
రేయింబవళ్లు పనిచేసిన కొన్ని విభాగాలు
తిరుమల: పందొమ్మిదేళ్ల తర్వాత ఒకే రోజు వచ్చిన వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరంలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంలో టీటీడీ, పోలీసు, విజిలెన్స్ విభాగాల మధ్య సమన్వయం కొరవడింది. దీని ద్వారా గ తం నుంచి కూడా టీటీడీ యంత్రాంగం పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించలేదు. అందుకు నిదర్శనం నిరసనలు మిన్నంటగా, క్యూలు విరిగాయి. కాగా ఆ రెండు రోజుల్లో రికా ర్డు స్థాయిలో 1.63 లక్షల మందికి దర్శన భాగ్యం లభించింది. భక్తులను క్రమబద్ధీకరించడానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్, వెలుపల మొత్తం 40 వేల మందికి టీటీడీ క్యూలు సిద్ధం చేసింది. 5500 గదులు అందుబాటులో ఉంచారు. అదనంగా 11 తాత్కాలిక షెడ్లు, మరుగుదొడ్లు నిర్మించారు. ఊహించిన దానికం టే రెట్టింపు స్థాయిలో భక్తులు తరలివచ్చిన భక్తులు గదుల కోసం తిప్పలు పడ్డారు. ఇంజినీరింగ్ విభాగం పటిష్ట క్యూలు నిర్మించడానికి దృష్టి సారించకుండా ఉన్నవాటినే తాత్కాలిక మరమ్మతులు చేసి మమ అనిపించారు. ఆ క్యూలు భక్తులకు ఏమాత్రం సరిపోలేదు. ఏర్పాట్ల పర్యవేక్షణలో టీటీడీ, పోలీసు విభాగాలు ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరించాయి. భక్తులను నియంత్రించడం, అదుపు చేయడం, కంపార్ట్‌మెంట్లలోకి అనుమతించడంలోనూ ఆ రెండు విభాగాల మధ్య సఖ్యత కనిపించలేదు. నిరంతరం సేవలు చేసే టీటీడీ ఉద్యోగులు, పోలీసులు, ఇతర ప్రభుత్వ విభాగాలకు దర్శనం కల్పించే విషయంలో టీటీడీ ఉన్నతాధికారులు ఏమాత్రం చొరవ చూపలేదు. రిటైర్డ్ ఉద్యోగులకూ అవకాశం కల్పించలేదు. సామాన్య భక్తుల కోసం కేటాయించమని చెప్పిన 5500 గదుల్లో చాలా వరకు దొడ్డి దారిన కేటాయించినట్లు ఆరోపణలు వినిపించాయి.
ఈవో, జేఈవో పర్యవేక్షణ
బాధ్యతలు చేపట్టిన పది రోజులకే ఈవో దొండపాటి సాంబశివరావు ఏకాదశి ఏర్పాట్లపై జేఈవో కేఎస్ శ్రీనివాసరాజుతో కలిసి రేయింబవళ్లు నిర్విరామంగా పర్యవేక్షించారు. ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, అన్నదానం డెప్యూటీ ఈవో వేణుగోపాల్, అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డితో సమన్వయం చేసుకుంటూ క్యూలు క్రమబద్ధీకరించారు. నిరంతరం అన్నప్రసాదాలు అందించారు. ఫల, పుష్ప అలంకరణలతో గార్డెన్‌సూపరిండెంట్ శ్రీనివాసులు అభినందనలు అందుకున్నారు. రికార్డులో స్థాయిలో 4.58 లక్షల మందికి నిత్యాన్నవిభాగం భక్తులకు అన్నప్రసాదాలు, వేడి పాలు, కాఫీ, టీ అందించింది.