కోర్టు ఉత్తర్వులున్నా ఆగని తవ్వకాలు
► పెదపులిపాక క్వారీ వద్ద ఉద్రిక్తత
► పచ్చనేతకు అండగా పోలీసులు
► గ్రామస్తులు, టీడీపీ నేతల ఆందోళన
పెనమలూరు : పెదపులిపాక క్వారీలో ఇసుక తవ్వకాలు నిలుపుదల చేయాలని హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు అమలుకు నోచుకోలేదు. కోర్టు ఉత్తర్వులు గ్రామస్తులు శనివారం అధికారులకు,పోలీసులకు అందజేసినా తమకు కోర్టు నుంచి ఉత్తర్వులు నేరుగా రానందున తవ్వకాలు ఆపేదిలేదని పోలీసులు దగ్గర ఉండి ఇసుక తవ్వకాలు చేశారు. పచ్చనేతకు పోలీసులు అండగా ఉండడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో క్వారీ వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది.
పెదపులిపాక ఇసుక క్వారీలో పెనమలూరు నియోజకవర ్గ ముఖ్యనేత దాదాపు ఆరు యంత్రాలను కృష్ణానదిలో దించి అడ్డగోలుగా లోడింగ్ చేయిస్తున్నారు. దీనిపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయగా పీడీ యాక్టు పెట్టిస్తామని పోలీసులతో బెదిరించారు. దీంతో గ్రామస్తుల సహకారంతో వల్లూరు శ్రీమన్నారాయణ(బీజేపీ), ముసునూరు శ్రీనివాసరావు(టీడీపీ) న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించడంతో ఈనెల 28న తవ్వకాలు నిలిపివేయాలని కోర్టు స్టే మంజూరు చేసింది.
ఆగని ఇసుక తవ్వకాలు
కోర్టు స్టే ఉత్తర్వులను గ్రామస్తులు శనివారం అన్ని శాఖల అధికారులకు అందజేశారు. అయితే లారీలు క్వారీ వద్దకు రావడంతో కోర్టు స్టే ఇచ్చిందని తిరిగి వెళ్లిపోవాలని వాహనదారులను గ్రామస్తులు కోరడంతో చాలా వాహనాలు తిరిగి వెళ్లిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న పచ్చనేత పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇసుక లోడింగ్ ఆగిందన్న సమాచారంతో తూర్పు డివిజన్ ఏసీపీ విజయభాస్కర్, సెంట్రల్ ఏసీపీ సత్యానందం క్వారీ వద్దకు వచ్చి స్టే ఉత్తర్వులు తమకు అందలేదని వాహనాలు నిలపవద్దని గ్రామస్తులకు సూచించారు.
తాము టీడీపీకి చెందిన వారమేనని నియోజకవర్గ నేత ఆగడాల వల్లఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. యంత్రాలతో తవ్వడంతో ఇసుకతోపాటు మట్టి కూడా వస్తుందని, భూగర్బ జలాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పీడీ యాక్టు పెడతామని బెదిరింపులకు పాల్పడటం న్యాయం కాదని,తాము ఉగ్రవాదులం కాదని గ్రామస్తులు పోలీసులకు వివరించారు. అయినా పోలీసులు తమకు నేరుగా ఉత్తర్వులు అందలేదని సాకు చూపి ఇసుక వాహనాలను దగ్గరుండి పంపించారు.
చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తాం
పెదపులిపాక గ్రామస్తులను ఇబ్బందులు పెడుతున్న టీడీపీ నియోజకవర్గ ముఖ్యనేతపై సీఎం చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేస్తామని పెదపులిపాక టీడీపీ నేతలు, గ్రామస్తులు విలేకరులకు తెలిపారు. తమ గ్రామాన్ని సర్వనాశనం చేసేందుకు టీడీపీ ముఖ్యనేత కంకణం కట్టుకున్నాడని ఆరోపించారు. టీడీపీ నేతకు అండగా ఉన్న పోలీసులపై కోర్టు ధిక్కార కేసు కూడా వేస్తామన్నారు.