ఎంపీ సీఎం రమేష్ వ్యక్తిగత ప్రవర్తనతోనే టార్గెట్‌కు గురయ్యారా... ఇంటా బయట తలనొప్పులు తీవ్రతరమయ్యాయా...అంటే ఔనని విశ్లేషకులు అంటున్నారు. ఆర్థిక పరపతి అమాంతం పెరగడంతో లెక్కలేనితనం తెరపైకి వచ్చింది. వెరసి అటు రాజకీయంగా ఇటు ఆర్థిక వ్యవహారాల్లో ఇష్టానుసారంగా వ్యవహరించినట్లు సమాచారం. దీంతో వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతోందని పలువురు భావిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి కడప: సీఎం రమేష్‌ను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా టీడీపీ అధిష్టానం రాజ్యసభకు పంపింది. పార్లమెంటులో మెంబర్ అయినా పోట్లదుర్తి సుబ్బానాయుడు మనవడుగా జిల్లావాసులకు ఎరుక. పోట్లదుర్తి నాయుళ్లు అంటే జిల్లాలో టక్కున గుర్తుకు వచ్చేది, సారాయి వ్యాపారం. జిల్లాలో సారాయి కాంట్రాక్టర్లుగా వారికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈక్రమంలో రాజకీయనాయకులకు అణకువగా ఉంటూ పలువురిని మెప్పించి, ఒప్పించి కార్యక్రమాలను చక్కబెట్టుకునే వారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అలాంటి పరిస్థితి నుంచి అండగా నిలిచిన రాజకీయ నాయకులే ఎదురుచూడాల్సిన పరిస్థితికి సీఎం రమేష్ చేరుకున్నారు. అనూహ్యంగా ఆర్థిక, రాజకీయ పరపతి పెరగడమే అందుకు కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు. మునపటి పాతవాసనతో నిమిత్తం లేకుండా తాను మాత్రమే జిల్లా రాజకీయాలను శాసించగలను అనేస్థాయికి వెళ్లడంతో ఇక్కట్లు ఎదురవుతున్నట్లు పలువురు వివరిస్తున్నారు.
బెడిసికొట్టిన ప్రొద్దుటూరు వ్యవహారం..
సీఎం రమేష్‌కు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్న చరిత్ర లేదు. గతంలో మాజీ మంత్రి మైసూరారెడ్డి సాన్నిహిత్యం కారణంగా కాంగ్రెస్ పార్టీ నుంచి రమేష్ కుటుంబ సభ్యులు ఎర్రగుంట్ల మండలానికి ప్రాతినిథ్యం వహించారు. జిల్లాలో అంతకు మించిన రాజకీయ చరిత్ర లేదు. ఈనేపథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంపై కన్ను పడింది. అక్కడి రాజకీయాలను తనకు అనువుగా మల్చుకోవాలనే దిశగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పావులు కదుపుతూ వచ్చారు. ఈక్రమంలో ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తూ వచ్చారు. ఆ వివాదం మరింత ముదరడంతో ‘సీఎం రమేష్ స్థాయి పంచాయతీకి ఎక్కువ, మండలానికి తక్కువ’అలాంటి వ్యక్తిని చంద్రబాబు ప్రోత్సహించి రాజ్యసభ సీటు ఇస్తే కాంట్రాక్టు పనుల్లో కమీషన్లు తీసుకుంటూ దోపిడీ చేయడమే కాకుండా వర్గరాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ధ్వజమెత్తారు.
మాజీ ఎమ్మెల్యే వరద వ్యాఖ్యలు వాస్తవమే అయినప్పటికీ రమేష్ వ్యక్తిగత స్థాయి బహిర్గతం చేయడంతో ప్రొద్దుటూరు రాజకీయాల్లో వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. 22మంది కౌన్సిలర్లు ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జి వరదరాజులరెడ్డికి వ్యతిరేకంగా రాజీనామా చేయించారు. అదే విషయాన్ని మాజీ ఎమ్మెల్యే వరద సైతం బాహాటంగా ఆరోపించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సీఎం రమేష్‌ను ప్రొద్దుటూరు రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటానని ప్రకటించారు. ఈమొత్తం వ్యవహారం టీడీపీ అధిష్టానం చెంతకు చేరింది.
ముఖ్యమంత్రి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు స్వయంగా నాయకుల మధ్య పంచాయితీ చేయాల్సి వచ్చింది. కౌన్సిలర్లతో రాజీనామా చేయించి పార్టీని రోడ్డుమీదకు చేర్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకు పరోక్ష కారకుడు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేషేనని మంత్రి ఆది, జిల్లా అధ్యక్షుడు అంతర్గతంగా సంకేతాలిచ్చినట్లు సమాచారం. దీంతో అధిష్టానం అనవసర రాజకీయాలు చేయవద్దని ఇటీవలే పెద్ద ఎత్తున హెచ్చరికలు చేసినట్లు టీడీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. టీడీపీ అధిష్టానం అగ్రహం వెలిబుచ్చిన ఘటన అలా ఉండగానే ఐటీ దాడులు తెరపైకి వచ్చాయి.
కాంట్రాక్టు దిగ్గజంగా మారిన వైనం....
ఎన్నికలకు ముందు సాదాసీదా కాంట్రాక్టు సంస్థగా ఉన్న రిత్విక్ కన్‌స్ట్రక్షన్స్ కాంట్రాక్టు దిగ్గజంగా మారింది. అందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యమేనని విశ్లేషకుల భావన. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పనులల్లో రిత్విక్ ప్రధానపాత్ర పోషిస్తోంది. అనేక పనులు నామినేటెడ్‌గా దక్కించుకున్న చరిత్ర కూడా ఉండిపోయింది. ఈతరణంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.3,658 కోట్లు పనులు ఆ సంస్థ చేస్తోంది. ప్రభుత్వ అండ ప్రధానంగా ఉండడంతో పనుల్లో పురోగతి లేకపోయినా, మొబిలైజేషన్ అడ్వాన్సులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా పోయిందని తెలుస్తోంది. బ్యాంకు లావాదేవీలు కూడా ఇష్టారాజ్యంగా రిత్విక్ కన్‌స్ట్రక్షన్‌కు ఉన్నట్లు సమాచారం.
ఇవన్నీ పసిగట్టిన ఆదాయపు పన్నుశాఖ సమగ్ర నివేధికతో ఐటీ సోదాలు చేసినట్లు సమాచారం. పోట్లదుర్తిలో శుక్రవారం సాయంత్రం వరకు, సోదాలు జరిగాయి. హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం వరకూ కొనసాగాయి. ఈసందర్భంగా అనేక డాక్యుమెంట్లు, విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఓ బ్యాంకు నుంచి డ్రాచేసిన రూ.50లక్షలు ఇంకో చోట అక్రమ కార్యకలాపానికి మొత్తంగా గుర్తించినట్లు రూఢీ అయినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. కాగా కేవలం ఎంపీ రమేష్ వ్యక్తిగత ప్రవర్తన కారణంగానే వరసగా ఎదురుదెబ్బలు తగులుతున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment