సీఎం రమేశ్ ఇంట్లో ఐటీ సోదాలు | Income Tax Raids On CM Ramesh | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 12 2018 9:18 AM | Last Updated on Fri, Oct 12 2018 1:32 PM

Income Tax Raids On CM Ramesh - Sakshi

సాక్షి, హైదరాబాద్: టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ నివాసాలు, వ్యాపార కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌, విజయవాడలో ఏకకాలం‍లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన స్వగ్రామం వైఎస్సార్‌ జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని నివాసంలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఆయన చూపించిన ఆదాయానికి, లెక్కలకు పొంతన లేకపోవడంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా  ప్రొద్దుటూరులో సీఎం రమేశ్‌ బంధువు గోవర్ధన్ నాయుడు ఇంట్లోనూ ఐటీ సోదాలు సాగుతున్నాయి. సీఎం రమేశ్‌కి దగ్గర బంధువైన గోవర్ధన్ నాయుడు కాంట్రాక్టర్‌గా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చాక సీఎం రమేశ్‌ పలు కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఆయనకే అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారని టీడీపీ నాయకులే పలు సందర్భాల్లో బహిరంగంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం సీఎం రమేశ్‌ ఢిల్లీలో ఉన్నారు.


పోట్లదుర్తిలోని సీఎం రమేశ్‌ నివాసం


భారీగా అక్రమాలు..
సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు చంద్రబాబు సర్కారు అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులను నామినేషన్‌ పద్ధతిలో ఇచ్చేసినట్టు వెల్లడించాయి. హంద్రీనీవా 2వ ప్యాకేజీలో రూ.42 కోట్లకుగాను మిగిలిపోయిన పనులు రూ.9 కోట్లు అయితే, దాన్ని మళ్లీ  రూ.52 కోట్లకు రీ టెండర్‌ వేసి సీఎం రమేష్‌కు అప్పగించారన్న ఆరోపణలున్నాయి. దాన్నికూడా భారీగా పెంచి సీఎం రమేష్‌ దాదాపు రూ.90 కోట్ల బిల్లులు తీసుకున్నట్టు తెలుస్తోంది. హంద్రీ నీవాలో 36వ ప్యాకేజీలో మిగిలిపోయిన రూ.55 కోట్లకుగాను దీన్ని రూ.265 కోట్లకు పెంచి చేజిక్కించుకున్నారని సమాచారం. హంద్రీనీవాలో 3వ ప్యాకేజీలో కూ.50 కోట్ల రూపాయలకు మిగిలిపోయిన పనులను రూ.110 కోట్లకు సీఎం రమేష్‌కు అప్పగించి, ఆ మేరకు బిల్లులు చేసుకున్నారు. పై మూడు పనులకు సంబంధించి పాత ధరలకే చేస్తామని కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్లినా, ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు.

కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌కు సంబంధించి రూ.150 కోట్లకయ్యే పనులకు ఇవ్వాళ్టికి సుమారు రూ.550 కోట్లు బిల్లులు చేసుకున్నారు. ఇంకా రూ.150 కోట్లకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎస్సార్బీసీలో బనగానపల్లి వద్ద మిగిలిపోయిన రూ. 12 కోట్ల పనులకు గానూ రూ. 127 కోట్లకు చేసుకున్నారు. కాంట్రాక్టర్లు ఎవ్వరూ రాకుండా బెదిరింపులకు పాల్పడ్డం, తమ సంస్థలకే కాంట్రాక్టు వచ్చేలా మార్గదర్శకాలు రూపొందించుకోవడం తదితర పద్ధతుల్లో ఏపీ ప్రభుత్వం నుంచి భారీగా లబ్ధి పొందారని విపక్షాలు ఆరోపించారు.

టీడీపీ నాయకులకు టెన్షన్‌
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సోదరుడు బీద మస్తాన్‌రావు ఇల్లు, వ్యాపార సంస్థలపై కూడా ఆదాయ పన్నుల శాఖ అధికారులు గతవారం దాడులు నిర్వహించారు. ‘బీఎంఆర్‌’ గ్రూప్‌ పేరుతో వ్యాపారాలు చేస్తున్న ఆయన ఆదాయపన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. వరుస దాడులు అధికార టీడీపీ నాయకుల్లో గుబులు రేపుతున్నాయి. తాము చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయోమోనని సైకిల్‌ పార్టీ నేతలు వణికిపోతున్నారు. (చదవండి: టీడీపీ నేత ‘బీద’ సంస్థలపై ఐటీ దాడులు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement