► రోజురోజుకూ పెరుగుతున్న వడదెబ్బ బాధితులు
► ఇప్పటిదాకా దాదాపు వంద మంది మృతి
► 14 మందేనంటున్న అధికారులు
► ఎక్స్‌గ్రేషియాపై కొరవడిన స్పష్టత
అనంతపురం అర్బన్ : ఎండలు మండిపోతున్నాయి. ‘అనంత’ అగ్నిగోళంగా మారింది. వడదెబ్బకు జనం మృత్యువాత పడుతున్నారు. ఎండలు తీవ్రమయ్యే కొద్దీ మృతుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు వంద మంది చనిపోయారు. అధికారులు మాత్రం ‘అంత’ లేదంటున్నారు. 14 మంది మాత్రమే చనిపోయారని బుకాయిస్తున్నారు. వారు చెబుతున్న సంఖ్య వాస్తవ విరుద్ధంగా ఉందని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. ఎండల తీవ్రత పెరిగిన మార్చి నుంచి ప్రతి రోజు సగటున ఇద్దరు చొప్పున మృతి చెందుతూనే ఉన్నారు. ఈ నెల 17, 19 తేదీల్లోనే 10 మంది మృతి చెందారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వడదెబ్బకు మృతి చెందిన వారిలో ఎక్కువ మంది కూలి పనులు చేసుకునే వారు, పేదలే కావడం గమనార్హం.
అన్నీ కాదంటున్న అధికారులు
వైద్యులు, కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మరణాలన్నీ వడదెబ్బ కారణంగా సంభవించినవి కాదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. వారి దృష్టికి 40 వరకు కేసులొస్తే అందులో 14 మాత్రమే వడదెబ్బతో చనిపోయినవిగా నిర్ధారించారు. మిగతా వారు అనారోగ్యంతో చనిపోయినట్లుగా తేల్చారు. ఇందుకు సంబంధించి రెవెన్యూ అధికారుల వాదన ఇలా ఉంది. ‘గుండె జబ్బులు, బీపీ, ఇతర వ్యాధులు ఉన్నవారు ఎందుకు ఎండలో తిరగాలి? ఉపాధి పనులు కూడా ఉదయం 6 నుంచి 10లోపు ముగించాలని చెబుతున్నాం కాదా! ప్రతి చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయించాం. ఓఆర్‌ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్) ప్యాకెట్లు అందుబాటులో ఉంచాం. కనీస జాగ్రత్తలు పాటించకుండా ఎండలోకి వచ్చి తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోతే అది వడదెబ్బ మృతి ఎలా అవుతుంది?’అని లాజిక్‌లు మాట్లాడుతున్నారు.
ఎక్స్‌గ్రేషియా ఎంతిస్తారో...
వడదెబ్బ మృతులకు ఎక్స్‌గ్రేషియా ఎంత ఇస్తారనేది ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారని, అయితే అది ఎంత మొత్తం నిర్ధారణ కాలేదని అంటున్నారు. జీవో విడుదల చేస్తేకానీ చెప్పలేమంటున్నారు.
ప్రజాశ్రేయస్సుపై చిత్తశుద్ధి లేదు - వి.రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి
ప్రభుత్వానికి ప్రజా శ్రేయస్సుపై చిత్తశుద్ధి లేదు. అందుకే వడదెబ్బ మరణాలను తక్కువ చేసి చూపిస్తోంది. చనిపోయిన వారంతా పేదలే. పౌష్టికాహారం లేక రోగనిరోధక శక్తి తగ్గి.. ఎండవేడిమి తట్టుకోలేక చనిపోతున్నారంటే వడదెబ్బ మృతి కిందకే వస్తుంది. వడదెబ్బతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
మృత్యు శతకం
Published Thu, Apr 21 2016 3:33 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM
Advertisement
Advertisement