ఆకాశమే హద్దు
- గన్నవరం ఎయిర్‌పోర్టుకు గణనీయంగా పెరిగిన ప్రయాణికులు
- రోజూ 1,500-1,800 మంది ప్రయాణం
- రాజధాని రాకతో మరింత రద్దీ
- త్వరలో మరిన్ని దేశాలకు ప్రైవేట్ సర్వీసులు
విమానాశ్రయం (గన్నవరం) : అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చెందుతున్న గన్నవరం ఎయిర్‌పోర్టుకు ప్రయాణికుల ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ఏడాది కిందట ఇక్కడి నుంచి నెలకు 9వేల నుంచి 10వేల మంది మాత్రమే రాకపోకలు సాగించేవారు. తాజాగా ఆ సంఖ్య 50వేలకు చేరింది. దీనికి తగ్గట్టుగానే ప్రయాణికుల ఆక్యుపెన్సీ రేషియో కూడా 45 నుంచి 95 శాతానికి ఎగబాకింది. దీంతో గన్నవరం విమానాశ్రయం నుంచి పలు నగరాలకు విమాన సర్వీసులు పెరిగాయి. అలాగే, కొత్త సర్వీసులు నడిపేందుకు మరిన్ని విమాన సంస్థలు ముందుకొస్తున్నాయి. పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయంలో ప్రయాణికులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన దిశగా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కూడా పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ అవసరాల నిమిత్తం నిర్మించిన ఈ ఎయిర్‌పోర్టు పదిహేనేళ్ల కిందటి వరకు అభివృద్ధికి నోచుకోలేదు. అనంతరం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు చొరవతో విమాన సర్వీసులు ప్రారంభమైనప్పటికీ ప్రయాణికుల ఆదరణ అంతంతమాత్రంగానే ఉండేది.
రాజధానితో మారిన పరిస్థితులు
రాష్ట్ర విభజన అనంతరం గన్నవరం విమానాశ్రయానికి ప్రాధాన్యత పెరిగింది. రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ ఎయిర్‌పోర్టుకు వీఐపీలు, ఉద్యోగ, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలతో పాటు దేశవిదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా పెరిగాయి. విమాన సంస్థల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో టికెట్ ధరలు కూడా తగ్గడంతో మధ్య తరగతి వర్గాలు కూడా విమాన ప్రయాణంపై ఆసక్తి చూపిస్తున్నాయి. దీంతో ఏడాది కిందట 300 నుంచి 400 మధ్య ఉన్న రోజువారీ ప్రయాణికుల సంఖ్య ప్రస్తుతం 1500 నుంచి 1,800 మందికి పెరిగింది. ఇందుకు తగ్గట్టుగా ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ను కూడా ఆధునికీకరించారు. గతంలో 50 మంది కూర్చునేందుకు వీలున్న సెక్యూరిటీ చెక్‌ఇన్‌ను 250కు పెంచారు. ఎరైవల్‌తో పాటు డిపార్చర్‌లో కూడా కన్వేయర్ బెల్టులను ఏర్పాటుచేశారు.
పెరిగిన విమాన సర్వీసులు
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా విమాన సర్వీసులు కూడా పెరిగాయి. ఏడాది కాలంలో విమాన సర్వీసుల సంఖ్య 12 నుంచి 24కు చేరుకుంది. ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఎయిర్‌కోస్తా విమాన సంస్థలు న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నుంచి ఇక్కడికి ఉదయం 7.15 నుంచి రాత్రి 12.30 గంటల వరకు సర్వీసులు నడుస్తున్నాయి. కొత్తగా ముంబయి, తిరుపతి, విశాఖపట్నం నగరాలకు కూడా సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఎయిర్‌పోర్టు కేంద్రంగా రీజినల్ సర్వీసులను నడిపేందుకు ఎయిరిండియా సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే సింగపూర్, మలేషియా, దుబాయ్, ఆస్ట్రేలియా తదితర ఇంటర్నేషనల్ సర్వీస్‌లతో పాటు మరిన్ని డొమెస్టిక్, కార్గో సర్వీసులు నడిపేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు ఓ ప్రైవేట్ సంస్థతో సర్వే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చేపడుతున్న విస్తరణ పనులు కూడా త్వరితగతిన పూర్తయితే త్వరలోనే ఈ విమానాశ్రయం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా మారనుంది.