కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ ఐదు జిల్లాల పరిధిలో మద్యం అమ్మకాలు పెంచాలని ఎక్సైజ్ కమిషనర్ అహ్మద్ నదీం అధికారులకు సూచించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ఐదు జిల్లాల ఎక్సైజ్ అధికారుల సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు నకిలీ మద్యం అరికట్టడంతోపాటు అమ్మకాలు పెంచాలని, లెసైన్స్‌దారులకు అవసరమైన సేవలందించాలని సూచించారు.
ఐదు జిల్లాల అధికారులు, సిబ్బంది ఇచ్చిన ఒక రోజు మూల వేతనం రూ.1.07 లక్షల చెక్కును మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ బాలరాజ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ సూపరింటెండెంట్లు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. అనంతరం టీఎన్‌జీవో ఎక్సైజ్ రాష్ట్ర అధ్యక్షుడు సుద్దాల రాజయ్య, నాలుగు సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శలు, కె ప్రభువినయ్, లక్ష్మణ్‌గౌడ్, రాజేందర్, కరుణాకర్, కిషన్‌రావు, విజయకుమార్, సిద్ధికీ, నగేశ్ కమిషనర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
సమస్యలు పరిష్కరించాలి..
అపరిష్కతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల జేఏసీ నాయకులు ఎక్సైజ్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జిల్లాలో ఎక్సైజ్‌శాఖ నిర్లక్ష్యం మూలంగా 15 సొసైటీలు మూత పడ్డాయని, ఎక్కడా లేని విధంగా వత్తి పన్ను వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలాకాలంగా నిలిచిపోయిన నష్టపరిహారం బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల జేఏసీ గౌరవ అధ్యక్షుడు కొక్కిస రవీందర్‌గౌడ్, చైర్మన్ గోపగాని సారయ్యగౌడ్, కన్వీనర్ సింగం సత్తయ్య గౌడ్ పలువురు కమిషనర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.