విశాఖపట్నం : విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు సబ్‌స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచాలని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ఎం.వి.శేషగిరిబాబు ఆదేశించారు. గురుద్వార వద్ద గల సంస్థ ప్రధాన కార్యాలయంలో ట్రాన్స్‌కో అధికారులతో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ లోడ్ పెరుగుతున్న దృష్ట్యా సబ్‌స్టేషన్ల సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
డెయిరీఫారం, పోర్టు 132 కేవీ సబ్‌స్టేషన్‌ల సామర్ధ్యం పెంచాలన్నారు. డెయిరీఫారం సబ్‌స్టేషన్‌లో గల 31.5 ఎంవీఏ సామర్థ్యాన్ని 50 ఎంవీఏకి పెంచాలన్నారు. పోర్టు సబ్‌స్టేషన్‌లోని 16 ఎంవీఏ సామర్థ్యాన్ని 31.5కి పెంచాలన్నారు. నక్కవానిపాలెం-సింహాచలం మధ్యగల విద్యుత్ లైన్ సామర్థ్యం తక్కువగా ఉన్నందున కండక్టర్ సైజ్ మార్చాలని ఆదేశించారు.
ఇక బొబ్బిలిలోని 222 కేవీ సబ్‌స్టేషన్ పనుల ఆలస్యం కారణంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు లోడ్ విడుదలలో జాప్యం కలుగుతోందన్నారు. ట్రాన్స్‌కో డెరైక్టర్ (ప్రాజెక్ట్స్) సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విజయనగరం జిల్లా గరివిడి మండలం మరడాం గ్రామంలో 400 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ మండలికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజినీర్ సీతారామాచార్యులు, ఈపీడీసీఎల్ డెరైక్టర్ (ఆపరేషన్స్) పి.రామ్మోహన్, చీఫ్ జనరల్ మేనేజర్ (ఓఎన్‌సిఎస్) కె.ఎస్.ఎన్.మూరి పాల్గొన్నారు.
విద్యుత్ సబ్‌స్టేషన్ల సామర్థ్యం పెంపు
Published Sat, Jun 14 2014 1:20 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement