పెంచిన చార్జీలు వెంటనే తగ్గించాలి
Published Thu, Nov 7 2013 3:22 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు చౌదరి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని డేఅండ్‌నైట్ కూడలి వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సందర్భంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచడం పుండుమీద కారం జల్లినట్లుందన్నారు.
పెంచిన ఛార్జీలను వెంటనే ఉపసంహరించుకోకపోతే ప్రజా ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. సీపీఎం సీనియర్ నాయకుడు వీజీకె మూర్తి మాట్లాడుతూ ఇది పెద్దల కోసం తప్ప పేదల కోసం పనిచేయని ప్రభుత్వమని ధ్వజమెత్తారు. పెంచిన ఛార్జీల మోత చర్యను ఖండించారు. ఈ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం.తిరుపతిరావు, డి.గణేష్, టి.తిరుపతిరావు, ఎం.ప్రభాకరరావు, వై.చలపతి, ఆర్.చిన్నమ్మడు, పి.ప్రభావతి, ఎస్.కృష్ణవేణి, బి.సత్యంనాయుడు, నర్సమ్మ, లక్ష్మి, సూరమ్మ, లలిత తదితరులు పాల్గొన్నారు.
Advertisement