పోలీస్ వ్యవస్థపై గౌరవం పెంచారు | Increased respect for the police system | Sakshi
Sakshi News home page

పోలీస్ వ్యవస్థపై గౌరవం పెంచారు

Published Wed, Jul 30 2014 2:21 AM | Last Updated on Tue, Aug 21 2018 8:52 PM

Increased respect for the police system

  • ఎస్పీకి ఘన సన్మానం
  •  పాల్గొన్న అన్ని పార్టీల నేతలు
  • కోనేరుసెంటర్ : సమర్థవంతమైన అధికారిగా ప్రజల మన్ననలు పొందడంతో పాటు పోలీసు వ్యవస్థ పట్ల ప్రజలకు మరింత గౌరవం పెరిగేలా కృషి చేసిన ఎస్పీ ప్రభాకరరావు నిజంగా అభినందనీయుడని వక్తలు   కొనియాడారు. జిల్లా  ఎస్పీగా పనిచేస్తూ కాకినాడ ఏపీఎస్‌పీ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీపై వెళుతున్న జె.ప్రభాకరరావును మంగళవారం  మచిలీపట్నం పుర ప్రజలు, వర్తక, వాణిజ్య, సేవా సంస్థల ఆధ్వర్యంలో పట్టణంలోని  ప్రముఖులు  ఘనంగా సన్మానించారు.   

    టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా  సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన అధికారిగా ఎస్పీ  జిల్లా వాసుల  మన్ననలు  అందుకోగలిగారన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ బుల్లయ్య మాట్లాడుతూ జిల్లా  అధికారిగా ప్రభాకరరావు పోలీసుశాఖ తరఫున ప్రజలకు విశిష్ట సేవలందించారని చెప్పారు. మున్సిపల్ కమిషనర్   మారుతీదివాకర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎస్పీ నుంచి తెలియని ఎన్నో విషయాలను అవగతం చేసుకున్నానన్నారు. ప్రభాకరరావు లాంటి  అధికారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా   తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

    మున్సిపల్ మాజీ చైర్మన్ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పార్టీలకతీతంగా విధులు నిర్వర్తించిన అధికారి ప్రభాకరరావు అన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి మాదివాడ రాము, ఎంవీవీ కుమార్‌బాబు మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పాటుపడే వ్యవస్థపై ప్రజలంతా గౌరవం పెంచుకోవాలన్నారు.  సన్మాన గ్రహీత ఎస్పీ ప్రభాకరరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల కోసం నిరంతరం  పాటుపడాలన్నారు. అపుడే ప్రజల నుంచి మన్ననలు పొందగలుగుతామని చెప్పారు.  

    బదిలీపై వెళుతున్న తనకు ఇంతటి ఘన సన్మానం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికీ    కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కాంగ్రెస్ నేత చిలంకుర్తి పృధ్వీప్రసన్న, బీజేపీ నేత పంతం గజేంద్ర, వాలిశెట్టి మల్లి, లంకిశెట్టి బాలాజీ  ప్రసంగించారు. మామిడి మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. బూరగడ్డ   రమేష్‌నాయుడు, మున్సిపల్ వైస్‌చైర్మన్   కాశీవిశ్వనాథ్, జెడ్పీటీసీ లంకే నారాయణ  ప్రసాద్, ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement