గుచ్చుతున్న గులాబి ముళ్లు
ఉద్యమ పార్టీ నుంచి నూటికి నూరుశాతం రాజకీయ పార్టీగా మారిన టీఆర్ఎస్‌లో టిక్కెట్ల వివాదం ముదురుతోంది. నిన్నటి వరకు పార్టీలో ఉన్నవారిని కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేనివారికి ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇస్తామని కేసీఆర్ బంపర్ అఫర్ ఇస్తున్నారు.
తెలంగాణ సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు పార్టీలో టిక్కెట్ల అంశం తలనొప్పిగా మారుతోంది. మహబూబ్నగర్ టిక్కెట్‌ను శ్రీనివాస్గౌడ్‌కు కేటాయించడంపై స్థానిక టీఆర్ఎస్ నేత ఇబ్రహీం అగ్రహంతో ఉన్నారు. మరోవైపు వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ టిక్కెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు సీనియర్ నేత కడియం శ్రీహరి పోటిపడుతున్నారు. మహబుబ్నగర్ జిల్లా నారాయణపేట టిడీపీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డిని చేర్చుకోవడంతో పాటు మక్తల్ సీటును అయనకు కేటాయించడంతో అప్పటివరకు ఇంచార్జ్‌గా ఉన్నదేవరమల్లప్ప అసంతృప్తితో ఉన్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. పార్టీలో వివాదం పెద్దది కావడంతో టిక్కెట్టు రాని నేతలకు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని కేసీఆర్ ఆశలు కల్పిస్తున్నారు.
మరో వైపు అమరవీరుల కుటుంబాలకు టిక్కెట్లు కేటాయించడం లేదని కేసీఆర్‌పై విమర్శలు పెరుగుతున్నాయి. తెలంగాణ కోసం అత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తనకు పాలకుర్తి సీటు కేటాయించాలని కోరుతున్నారు. అయితే ఎమ్మెల్యే టికెట్టుపై ఆయన స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో అమె నిరసనకు దిగారు. తాను సైతం ఆత్మాహుతి చేసుకుంటానని కూడా అన్నారు. ఇలా గులాబి పార్టీలో ముళ్లు ఎక్కువవుతున్నాయి.