సోమవారం నిండుకుండలా తొణికిసలాడుతున్న కర్ణాటకలోని ఆల్మట్టి రిజర్వాయర్
సాక్షి, అమరావతి: పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో రోజురోజుకు గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. ప్రాణహిత, పెన్‌గంగ, ఇంద్రావతి, శబరి, తాలిపేరు వంటి ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. దాంతో గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. సోమవారం ధవళేశ్వరం బ్యారేజీకి 3,69,677 క్యూసెక్కుల వరద రాగా.. 2,200 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేసి మిగతా 3,67,477 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేశారు. దాంతో 24 గంటల్లోనే 31.752 టీఎంసీలు కడలిపాలయ్యాయి.
ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 174.634 టీఎంసీల గోదావరి జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయంలోకి సోమవారం 1,11,467 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 103.13 టీఎంసీలకు చేరుకుంది. వరద ఇదే రీతిలో కొనసాగితే మరో రెండు రోజుల్లో 129.72 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఆల్మట్టి జలాశయం గేట్లు ఎత్తి దిగువకు వరద ప్రవాహాన్ని విడుదల చేస్తారు.
పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు..
గడచిన 24 గంటల్లో పశ్చిమ కనుమల్లో 30 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని, కృష్ణా నదికి వరద మరింత పెరుగుతుందని కేంద్ర జల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 22 దాకా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం కూడా ప్రకటించింది. ఆల్మట్టి ప్రాజెక్టులో 115 టీఎంసీలకు చేరగానే, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని నారాయణపూర్‌కు నీటిని వదలాలని కేంద్ర జలసంఘం కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం వస్తున్న వరద ప్రవాహం కొనసాగితే బుధవారం మధాŠయ్‌హ్నానికి ఆల్మట్టిలో నీరు దాదాపు 120 టీఎంసీలకు చేరుతుంది. వరద దాదాపు 15 రోజుల పాటు ఉంటుందని, వరద ప్రవాహం 1.50 లక్షల క్యూసెక్కుల నుంచి 2 లక్షల క్యూసెక్కులు ఉండొచ్చని పేర్కొంటున్నారు.
అయితే ఆల్మట్టికి దిగువన వర్షాభావం వల్ల కృష్ణా నదిలో వరద ప్రవాహం తక్కువగా ఉంది. నారాయణపూర్ జలాశయంలోకి కేవలం 608 క్యూసెక్కులు చేరుతోంది. ప్రస్తుతం నారాయణపూర్‌లో 23.85 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఆ జలాశయం నిండాలంటే మరో 14 టీఎంసీలు అవసరం. జూరాల జలాశయంలోకి వరద ప్రవాహం చేరడం లేదు. ప్రస్తుతం జూరాలలో 5.67 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. జూరాల నిండాలంటే మరో నాలుగు టీఎంసీలు అవసరం. ఆల్మట్టి జలాశయం గేట్లు ఎత్తివేసి.. దిగువకు వరద ప్రవాహం విడుదల చేస్తే ఏడెనిమిది రోజుల్లోనే నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండుతాయి. వరద ఇదే రీతిలో కొనసాగితే నెలాఖరుకు శ్రీశైలం జలాశయానికి కృష్ణమ్మ చేరే అవకాశం ఉంది.
తుంగభద్రకు జలకళ..
కృష్ణా ఉప నది అయిన తుంగభద్రలో వరద ఉధృతి పెరిగింది. తుంగభద్ర జలాశయంలోకి 69,717 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 77.99 టీఎంసీలకు చేరుకుంది. మరో 23 టీఎంసీలు వస్తే జలాశయం నిండుతుంది. వరద ఇదే రీతిలో కొనసాగితే నాలుగైదు రోజుల్లోనే జలాశయం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. తుంగభద్ర జలాశయం నుంచి విడుదల చేసే వరద ప్రవాహం సుంకేసుల బ్యారేజీ మీదుగా శ్రీశైలం జలాశయానికి చేరుతాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది కృష్ణా నదిలో నీటి లభ్యత పెరిగే అవకాశం ఉందనే అంచనాలు తెలుగు రాష్ట్రాల్లోని ఆయకట్టు రైతుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు..
పులిచింతలకు దిగువన మున్నేరు, పాలేరు ఉపనదుల నుంచి వరద వస్తోండటంతో కృష్ణా నదిలో ప్రవాహం కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 4,078 క్యూసెక్కులు చేరుతోంది. వీటికి పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా తరలిస్తోన్న 7,700 క్యూసెక్కుల గోదావరి జలాలు జతకలవడంతో ప్రకాశం బ్యారేజీలోకి మొత్తం 11,778 క్యూసెక్కులు చేరుతున్నాయి. కాలువలకు 10,971 క్యూసెక్కులు విడుదల చేసి.. మిగులుగా ఉన్న 807 క్యూసెక్కులను రెండు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. కృష్ణా నదిలో వరద ప్రవాహాన్ని బట్టి పట్టిసీమ ఎత్తిపోతల మోటార్లను నడపాల్సిన సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వంశధార, నాగావళిల్లో వరద ఉధృతి..
ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తోండటంతో వంశధార, నాగావళి నదులు జోరుగా ప్రవహిస్తున్నాయి. వంశధార నదిలో వరద ఉధృతి గంటకూ గంటకూ పెరుగుతోంది. గొట్టా బ్యారేజీకి 24,029 క్యూసెక్కులు రాగా.. 1,165 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేసి మిగతా 22,864 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి ఉరకలెత్తుతోంది. ఆదివారం నాటికే తోటపల్లి జలాశయం నిండిపోవడంతో అప్పటి నుంచి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగావళి బేసిన్‌లోని మడ్డువలస జలాశయం, వెంగళరాయసాగర్‌లు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఇక పెన్నా పరివాహక ప్రాంతంలో వర్షాభావం కొనసాగుతోంది. దాంతో పెన్నా నదికి జలకళ చేకూరలేదు.
Comments
Please login to add a commentAdd a comment