పెరుగుతున్న మార్కెట్ షేర్ | Increasing Market Share | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న మార్కెట్ షేర్

Published Mon, Jan 27 2014 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

Increasing Market Share

ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్: స్టాక్ మార్కెట్ ఇటీవలి కాలంలో అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. సెన్సెక్స్ తదితర మార్కెట్ సూచీలు ఒకరోజు తారాజువ్వలా దూసుకుపోతే.. మరో రోజు పాతాళానికి దిగజారిపోతున్నాయి. ఇటువంటి ఒడుదొడుకుల పరిస్థితుల్లో షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించడం చిన్న విషయం కాదు. కానీ ఆర్థికంగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో ఇలా పెట్టుబడులు పెరుగుతున్నాయంటే విశేషమే. గత కొన్నేళ్లుగా ఏటా సగటున రూ.200 కోట్ల లావాదేవీలు జిల్లాలో జరుగుతున్నాయి. రోజూ వేల కోట్ల టర్నోవర్ సాధించే స్టాక్ మార్కెట్‌లో ఇది చాలా చిన్న మొత్తమే కావచ్చు కానీ.. శ్రీకాకుళం లాంటి జిల్లా నుంచి ఈ మాత్రం లావాదేవీలు జరగడం  కచ్చితంగా చిన్న విషయం మాత్రం కాదు. అంతేకాకుండా గతంలో ఇంజినీరు, డాక్టర్లు వంటి వృత్తి నిపుణులకే పరిమితమైన షేర్ వ్యాపారంలో ఇప్పుడు దాదాపు అన్ని రంగాల వారు.. చివరికి గృహిణులు సైతం పెట్టుబడులు పెడుతున్నట్లు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వర్సిటీ కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విద్యార్థులు జిల్లాలో షేర్ మార్కెట్ విస్తరణపై జరిపిన సర్వేలో వెల్లడైంది. మరికొన్ని విశేషాలు చూస్తే..
 
  గత మూడేళ్లుగా స్టాక్ మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితులే ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి సమయాల్లో పెట్టుబడు లు పెట్టడానికి మదుపరులు ముందుకురారు. కానీ ఈ కాలంలోనే జిల్లా నుంచి పెట్టుబడులు భారీగా పెరిగాయి.
 
  ప్రస్తుతం జిల్లాలో ఏటా సుమారు రూ.200 కోట్ల వరకు షేర్ మార్కెట్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం వాటా రూ.60 కోట్లు. షేర్ వ్యాపారం చేస్తున్న వారిని రంగాలవారీగా పరిశీలిస్తే.. ఉపాధ్యాయులు మొదటి స్థానంలో నిలుస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో వరుసగా బ్యాంకు ఉద్యోగులు, వ్యాపారులు, వృత్తి నిపుణులు, గృహిణులు, ఇతరులు ఉన్నారు.  ఇంతకుముందు వరకు వృత్తి నిపుణులకే పరిమితమైన ఈ వ్యాపారంలో వారిని బాగా వెనక్కి నెట్టి ఉపాధ్యాయులు ముందు స్థానంలోకి రాగా.. గృహిణులు కూడా ఈ రంగంలోకి పెద్ద సంఖ్యలో ప్రవేశించడం ఆసక్తికరమైన విషయం.
 
  జిల్లాలో 12 స్టాక్ బ్రోకింగ్ ఏజెన్సీలు పని చేస్తున్నాయి. జేఆర్‌జీ సెక్యూరిటీస్, రెలిగేర్, స్టీల్ సిటీ, కార్వీ, బొనంజా పోర్టుఫోలియోస్, ఏంజెల్ బ్రోకింగ్, నార్త్ ఈస్ట్ బ్రోకరేజ్ సర్వీసెస్ తదితర సంస్థలు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల అనుమతితో సేవలందిస్తున్నాయి.
  లావాదేవీలు చట్టబద్దంగా జరగడం, అధిక శాతం ఆన్‌లైన్ వ్యాపారం కావడం, పెట్టుబడులకు సెబీ(సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ ఆఫ్ ఇండియా) వంటి ప్రభుత్వ సంస్థల భద్రత ఉండటం, అవగాహన పెరగడం, ఎక్కడి నుంచైనా నెట్ సౌకర్యంతో ఈ లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యం ఉండటం వంటి కారణాలు షేర్ మార్కెట్ విస్తరించడానికి దోహదం చేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది.
 
 అప్రమత్తత అవసరం
 ఎంత చట్టబద్దత ఉన్నప్పటికీ ఏమరుపాటు వహిస్తే మోసపోయే ప్రమాదం కూడా ఉందని నివేదికలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ వ్యాపారంలో ఎటువంటి అవగాహన లేకుండా స్టాక్ బ్రోకింగ్ సంస్థల మీద ఆధారపడి పెట్టుబడులు పెడితే మునిగిపోయే ప్రమాదం ఉంది. కంపెనీల పనితీరును పట్టించుకోకుండా పెట్టుబడులు పెడితే నష్టపోవడం తప్ప ఫలితం ఉండదు. పైగా లావాదేవీలన్నింటికీ పనుల రూపంలో అదనపు భారం పడుతుంది. అత్యంత రిస్క్‌తో కూడిన ఇంట్రాడే ట్రేడింగ్ జోలికి వెళ్లకుండా కంపెనీల ఆర్థిక ఫలితాలు, పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాత పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో మంచి లాభాలే ఆర్జించే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. నిరంతరం స్టాక్ మార్కెట్ కదలికలను అధ్యయనం చేయడం, చెక్కుల రూపంలోనే లావాదేవీలు నిర్వహించడం ద్వారా మోసాలు, నష్టాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని సూచించారు. అలాగే మార్కెట్ తరచూ హెచ్చుతగ్గులకు గురవుతుంటుంది. పతన దశలో ఉన్నప్పుడు కంగారు పడి షేర్లను అమ్మేసుకోకుండా ధైర్యం, సహనంతో ఎదురు చూసి, మళ్లీ మర్కెట్ పుంజుకున్నప్పుడు విక్రయిస్తే లాభాలు వస్తాయని సూచించారు.
 
 అవగాహన తప్పనిసరి
 స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారికి ఈ రం గంపై అవగాహన తప్పనిసరి. రోజూ వార్తా పత్రికల్లో వస్తున్న బిజినెస్ వార్తలు పరిశీలించాలి. వర్తమాన రాజకీయ, ఆర్థిక పరిస్థితులపైనే సెన్సెక్స్ గమనంఆధారపడి ఉంటుంది.అందువల్ల  ఆయా రంగాలను నిత్యం పరిశీలనలోకి తీసుకోవాలి.
 -ప్రొఫెసర్ బిడ్డిక అడ్డయ్య, 
 ఎకనమిక్స్ విభాగాధిపతి
 
 పెట్టుబడి పెట్టవచ్చు
 ఇది జూదం కాదు. అందువల్ల స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ప్రస్తుతం జిల్లాలో గృహిణులు సైతం ఈ వ్యాపారంలో  పెట్టుబడులు పెడుతున్నారు. వందల నుంచి లక్షల్లో ఆర్థిక స్తోమత బట్టి బెట్టుబడులు పెట్టవచ్చు.
 -డాక్టర్ ఎన్.సంతోష్ రంగనాథ్, 
 బోధకులు
 
 మోసాలు తగ్గాయి
 స్టాక్ బ్రోకింగ్ సంస్థల మోసాలు ఇటీవలి కాలంలో బాగా తగ్గాయి. ఏదైనా సంస్థ మోసానికి పాల్పడితే.. ఆ విషయం సెబీకి పిర్యాదధు చేయవచ్చు.  అటువంటి సంస్థల లెసైన్సును సెబీ రద్దు చేస్తుంది. ప్రస్తుతం ఇది చట్టబద్ధ వ్యాపారం. ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. స్టాక్ మార్కెట్ నిలకడగా లేకున్నా జిల్లాలో పెట్టుబడులు మాత్రం మెరుగ్గానే ఉన్నాయి.
 -ప్రొఫెసర్ గుంట తులసీరావు, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ హెడ్ 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement