సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణం): ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విశాఖలో జరిగే అవకాశాలున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15న వేడుకలు ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖలో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆరా తీసినట్లు తెలిసింది.
2015లో గత టీడీపీ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవాన్ని విశాఖ బీచ్ రోడ్డులో నిర్వహించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సీఎంవో ఆరా తీయడంతో అధికార యంత్రాగం అప్రమత్తమైంది. స్వాతంత్య్ర వేడుకల నిర్వహణకు అనువైన ప్రాంతాల కోసం అన్వేషణ చేస్తున్నారు. ఆర్కే బీచ్ రోడ్డు లేదా ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కలెక్టర్ వినయ్‌చంద్ వివిధ శాఖల అధికారులతో చర్చించారు. ఈ ప్రాంతాలను కూడా కలెక్టర్ పరిశీలించారు. అయితే విశాఖలో ఎక్కడ నిర్వహించాలన్న దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment