అగ్రగామిగా విజయనగరం | Independence Day Celebrations In Vijayanagar District | Sakshi
Sakshi News home page

అగ్రగామిగా విజయనగరం

Published Fri, Aug 16 2019 10:31 AM | Last Updated on Fri, Aug 16 2019 10:57 AM

Independence Day Celebrations In Vijayanagar District - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, రాబోయే రోజు ల్లో జిల్లాను పూర్తి సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. విజయనగరం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో గురువారం నిర్వహించిన 73వ స్వాతంత్య్ర దినోత్సవంలో ఆమె ముఖ్యఅతిథిగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లాలోని వివిధ∙ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ పనితీరు కనబరచిన ఉద్యోగులు, అధికారులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. అనంతరం ఆమె జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ గ్రామాలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలనే గాంధీ ఆలోచనలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్య సాధన దిశగా ప్రభుత్వ సాలన సాగుతోందని చెప్పారు. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రోత్సాహం అందించేందుకు పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, ప్రస్తుతం ఉన్నవాటిని ఆధునికీకరిస్తామని తెలిపారు.

త్యాగధనుల ఆశయసాధనకు కృషి:
దేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది నిస్వార్ధ పోరాటం చేశారని, వారి త్యాగాలను మనం ఎన్నటికీ మరువలేమన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ మొదలుకొని మన ప్రాంతంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వరకు ఎందరో నేతలు దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలు అర్పించారనీ, అలాంటి సమర యోధులందరికీ శిరసు వంచి నివాళులర్పిస్తున్నట్లు  తెలిపా రు. వారి ఆశయాల సాధన కోసం పునరంకితం కావా లని కోరారు. రాష్ట్రంలో విజయనగరం జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని, ప్రజల్లో దేశభక్తి భావాలు పెంపొందించే రచనలు చేసిన మహాకవి గురజాడ అప్పారావు నడయాడిన నేల అని,  వ్యవహారిక భాషకు పట్టంకట్టిన గిడుగు రామమూర్తి, హరికథ ద్వారా జిల్లా పేరు ప్రతిష్టలను విశ్వవ్యాప్తం చేసిన  ఆదిభట్ల నారాయణ దాసు వంటి ఎందరో మహనీయులకు పురిటిగడ్డయిన ఈ జిల్లాలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.  

వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధి:
జిల్లా ఆర్థిక వ్యవస్థకు మూలమైన వ్యవసాయ, అనుబంధ రంగాల అభివద్ధికి తోడ్పాటు అందించి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేయడం, మరికొన్ని  ప్రాజెక్టులను ఆధునికీకరించి పూర్తి సామర్థ్యంతో నిర్దేశిత ఆయకట్టుకు సాగునీటిని అందించే పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. అదనపు ఆయకట్టుకు సాగునీటి వసతుల కల్పనలో భాగంగా 62 పెద్ద చెరువులను మరమ్మతు చేయనున్నట్టు చెప్పారు. దాదాపు రూ.210 కోట్లతో ఈ ఏడాది నుంచి వ్యవసాయరంగ అభివృద్ధితో పాటు ఉద్యాన పంటల విస్తరణకు ప్రోత్సాహం, మత్స్య పరిశ్రమ అభివద్ధికి తోడ్పాటు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు చేయూతనిస్తామన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ సమీకృత సాగునీరు– వ్యవసాయ పరివర్తన పథకం, నీటిపారుదల– జీవనోపాధుల అభివృద్ధి పథకం పేరుతో ఈ కార్యక్రమాలు ఈ ఏడాది నుండి అమలు కానున్నాయని చెప్పారు.

దివంగత నేత వైఎస్సార్‌ ఆశయ సాధనలో భాగంగా రైతులు గౌరవప్రదమైన స్థానంలో నిలిచేలా ప్రస్తుత ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని చెప్పారు. జిల్లాలో ప్రకృతివ్యవసాయంవైపు రైతులు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది 37 వేల మంది రైతుల ద్వారా 40వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు 61 వేల క్వింటాళ్ల వరి, వేరుశనగ, పచ్చిరొట్ట ఎరువులు, విత్తనాలు రాయితీపై సరఫరా చేశామని, బ్యాంకుల ద్వారా రూ.1446కోట్ల పంట రుణాలు అందజేయాలన్నది లక్ష్యమని ఇప్పటి వరకూ రూ. 571 కోట్లు అందజేశామని తెలిపారు. జిల్లాలో 15 వేల మంది కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలు మంజూరు చేసినట్లు వివరించారు.

గిరిజన సంక్షేమానికి పెద్దపీట:
జిల్లాలోని గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామనీ, విద్య, వైద్యంతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి చేయూతనిస్తున్నామని వివరించారు. గిరిజనులకోసం మంజూరైన విశ్వవిద్యాలయాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి మన జిల్లాలోనే ప్రారంభిస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గ్రామ సచివాలయాల్లోని ఉద్యోగాలన్నీ వంద శాతం గిరిజన యువతకే కేటాయించేలా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించటంతో పాటు జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా పోస్ట్‌ మెట్రిక్‌ విద్యార్థులకు భోజన, వసతి సదుపాయాల నిమిత్తం ఏడాదికి రూ.20 వేలు అందించనున్నట్లు చెప్పారు. మాతా శిశు మరణాల నిరోధానికి జిల్లాలో రెండు చోట్ల గర్భిణుల వసతి గృహాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు.

పాఠశాలల మెరుగుకు చర్యలు:
ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతులు మెరుగు పరచి విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతాయన్నారు. సంక్షేమ వసతి గృహాలలో పరిస్థితులు మెరుగు పరుస్తామని తెలిపారు. హాస్టళ్ల మరమ్మతుకోసం జిల్లాకు రూ.14 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేస్తూ బడ్జెట్‌లో రూ.66 కోట్లు కేటాయించారన్నారు. గరివిడిలో పశు వైద్య కళాశాలను త్వరలో ప్రారంభిస్తామన్నారు.

అక్టోబర్‌ నుంచి వైఎస్సార్‌ రైతు భరోసా:
రైతుల కోసం వైఎస్సార్‌ రైతు భరోసా పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి నాలుగేళ్ళకు పెట్టుబడి సహాయంగా రూ.50 వేలు అందించనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్‌ నెల నుంచే ఈ పథకం అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. రైతుల దరఫున ప్రభుత్వమే బీమా మొత్తాన్ని చెల్లిస్తుందని, రైతులకు వడ్డీలేని పంట రుణాలు అందించడంతో పాటు వారికి ప్రభుత్వమే ఉచితంగా బోర్లు కూడా వేయిస్తుందన్నారు. ఆరోగ్యపరిరక్షణలో భాగంగా కిడ్నీ, తలసేమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతినెలా రూ.10 వేలు పింఛన్‌ ఇస్తున్నామన్నారు. బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి పథకం ద్వారా అండగా నిలువనున్నట్లు తెలిపారు. జిల్లాలో 3 లక్షల 9 వేల మంది ప్రయోజనం పొందనున్నట్లు తెలిపారు. వైఎస్సార్‌ ఆసరా పథకం కింద 45 ఏళ్ల వయస్సు కలిగిన డ్వాక్రా సభ్యులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళకు ఏడాదికి రూ. 15 వేలు సహాయం అందించనున్నట్టు వెల్లడించారు. జిల్లాలో 3 లక్షల 5 వేల మందికి ప్రతి నెలా సామాజిక పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇల్లు లేని అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్ళ స్థలాలతో పాటు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు.

మద్యం నిషేధానికి అడుగులు:
మద్యం రక్కసిని తరిమి కొట్టాలని ప్రభుత్వం భావి స్తోందనీ, దీనిని దశలవారీగా అమలు చేసేందుకు బెల్ట్‌ షాపులు మూసివేయిస్తున్నట్టు తెలిపారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అక్టోబర్‌నుంచి ప్రజలదగ్గరికే పథకాలు వస్తాయన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామన్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీ నుండి రాష్ట్రంలో కొత్త ఇసుక విధానం అందుబాటులోకి వస్తోందన్నారు. విజయనగరాన్ని సుందర వనంగా, హరిత నగరంగా చేయాలనే కలెక్టర్‌ ఆలోచనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యమివ్వాలని కోరారు. కార్పొరేషన్‌ హోదా దక్కించుకున్న విజయనగరంలో రోడ్ల విస్తరణ, అభివృద్ధి, నీటి సరఫరా వంటి పనులను రూ.110 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణకు చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయమన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి  వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి తోడ్పాటు నందించా లని కోరారు.

  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement