ప్రకాశం జడ్పీ ఛైర్మన్ గా స్వతంత్ర అభ్యర్థి హరిబాబు
ప్రకాశం: జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈదర హరిబాబు ప్రకాశం జడ్పీ ఛైర్మన్ గా ఎంపికయ్యారు. టీడీపీ జడ్పీటీసీగా గెలుపొందిన హరిబాబు.. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి ఒక ఓటు తేడాతో టీడీపీ అభ్యర్థి మన్నె రవీంద్రపై గెలుపొందారు. చివరి నిమిషంలో స్వతంత్ర అభ్యర్థిగా తెరపైకి వచ్చిన హరిబాబుకు వైఎస్సార్ సీపీ సభ్యులు మద్దుతు తెలిపారు. దీంతో హరిబాబుకు 28 ఓట్లు రాగా, రవీంద్రకు 27 ఓట్లు వచ్చాయి. ఎన్నికల ప్రక్రియ కాసేపు నిలిచిపోయినా హరిబాబు వర్గం తీవ్రంగా పట్టుబట్టడంతో ఎన్నికల ప్రక్రియ అనివార్యమైంది. ఈదర హరిబాబు గెలుపులో వైఎస్సార్ సీపీ కీలక పాత్ర పోషించింది. హరిబాబుకు వైఎస్సార్ సీపీ తరపున గెలిచిన 27 మంది జడ్పీటీసీలు సహకరించారు. జిల్లా ఛైర్మన్ గా హరిబాబు గెలిచినట్లు కలెక్టర్ విజయ్ కుమార్ ప్రకటించారు. ఇదిలా ఉండగా జడ్పీ వైస్ ఛైర్మన్‌గా వైఎస్సార్ సీపీ అభ్యర్థి నూకసాని బాలాజీ ఎంపికయ్యారు.
అంతకముందు జడ్పీ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడే అవకాశాలు కన్పించాయి. టీడీపీ నేతలు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎలాగోలా ప్రలోభాలతో దక్కించుకోవాలని యత్నించారు. అనూహ్యంగా తెరపైకి వచ్చిన హరిబాబు నామినేషన్‌తో టీడీపీ రెండుగా చీలిపోయింది. చివరకు మంత్రి శిద్ధా రాఘవరావు రంగంలోకి దిగి హరిబాబును బుజ్జగించే యత్నం చేసినా ఫలితం దక్కలేదు.