
సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మరోసారి చిక్కుల్లో పడ్డారు. బ్యాంకు రుణఎగవేత కేసులో ఆయన ఆస్తులను వేలం వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యుష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ఫ్రై లిమిటెడ్ పేరు మీద ఇండియన్ బ్యాంక్ నుంచి భారీగా రుణం తీసుకుని ఎగవేశారని అధికారులు చెబుతున్నారు. రుణాన్ని తిరిగి చెల్లించాలని గంటాకు అక్టోబర్ 4న బ్యాంకు అధికారులు డిమాండ్ నోటీసు కూడా పంపారు. కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో డిసెంబర్ 20న ఆయన వ్యక్తిగత ఆస్తులను వేలం వేయాలని అధికారులు నిర్ణయించారు.
మొత్తం రుణ బకాయిలు రూ.200 కోట్లు కాగా తనాఖా పెట్టిన ఆస్తుల విలువ కేవలం రూ.35 కోట్ల 35 లక్షల 61 వేలు ఉన్నట్లు తెలిసింది. దీంతో మిగతా బకాయిల కోసం గంటా వ్యక్తిగత ఆస్తిని వేలం వేసే అధికారం తమకు ఉందని ఇండియన్ బ్యాంకు అధికారులు చెబుతున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని 444 గజాల్లో నిర్మించిన ప్లాట్‌ను వేలం వేయనున్నట్లు సమాచారం. గంటా ఆస్తుల వేలం పాటు అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏంటని గంటాపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వ భూములను తనఖా పెట్టి భారీగా రుణాలు తీసుకున్నారని గతంలో కూడా ఆయనపై అనేక ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment