
రూ.175 కోట్లతో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
ఈ నెల 26లోగా ఏర్పాట్లన్నీ పూర్తి: సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, తిరుపతి/గుంటూరు (నగరంపాలెం): అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను తిరుపతిలో జనవరి 3 నుంచి 7 వరకు నిర్వహించనున్నామని సీఎం ఎన్.చంద్రబాబు తెలిపారు. ఇందుకోసం రూ.175 కోట్లు వెచ్చించనున్నామన్నారు. ఈ నెల 26లోగా ఏర్పాట్లన్నీ పూర్తి కానున్నాయన్నారు. తిరుపతిలో స్థానిక బర్డ్, స్విమ్స్ ఆస్పత్రుల్లో నూతనంగా నిర్మించిన అదనపు వైద్య భవనాలను ఆయన శుక్రవారం ఉదయం ప్రారంభించారు. అనంతరం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ పనుల పురోగతిపై అధికారులు, మంత్రులతో సమీక్షించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఎస్వీ యూనివర్సిటీ వీసీ సమావేశ మందిరంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు.
తిరుపతిలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నామన్నారు. జనవరి 3న ప్రధాని నరేంద్రమోదీ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ నెల 25 లేదా 26న ఢిల్లీ వెళ్లి ప్రధానిని ఆహ్వానిస్తానని చెప్పారు. సైన్స్ కాంగ్రెస్‌కు మొత్తం 10,500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. 9 మంది నోబెల్ బహుమతి గ్రహీతలైన ప్రఖ్యాత శాస్త్రవేత్తలు, విదేశాల నుంచి మరో 200 మంది సైంటిస్టులు హాజరవుతున్నారన్నారు. తిరుపతిలోని అలిపిరి దగ్గరున్న 140 ఎకరాల్లో రూ.1,500 కోట్ల అంచనా వ్యయంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సైంటిఫిక్ మ్యూజియం, సరికొత్త ప్లానిటోరియంల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం చెప్పారు. ఈ నెల 27 నుంచి తిరుపతిలో ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సదస్సులు జరుగుతాయన్నారు.
సీఎం బస్సులో పొగలు
తిరుపతి పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 11:10 నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయంలో దిగి అక్కడినుంచి ప్రత్యేక బస్సు ద్వారా తిరుపతికి బయలుదేరారు. అయితే అవిలాల సర్కిల్ సమీపాన ఆయన ప్రయాణిస్తున్న బస్సులో సాంకేతికలోపం ఏర్పడడంతోపాటు పొగలు వచ్చాయి. దీంతో కాన్వాయ్‌లో ఉన్న సఫారీ కారులోకి సీఎం మారారు.