ఇందిర జలప్రభకు మంగళం?
సీతంపేట:ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ఉద్దేశించిన పలు పథకాలకు తెలుగుదేశం ప్రభుత్వం చాప కింద నీరులా కోత పెడుతోంది. ఫలితంగా గిరిజనాభివృద్ధి నేతిబీరకాయ చందంగా తయారైంది. తాజాగా ఇందిర జలప్రభ పథకానికి క్రమంగా మంగళం పాడేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ,ఎస్టీ భూములను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం 2011లో ఇందిర జలప్రభ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న బంజరు భూములను అభివృద్ధి చేసి సాగులోకి తేవడం ద్వారా ఆయా వర్గాల లబ్ధిదారులకు ఉపాధి కల్పించాలన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అయితే ప్రవేశపెట్టిన నాటి నుంచీ ఈ పథకం నత్తనడకనే సాగుతోంది. సీతంపేట ఐటీడీఏ పరిధిలో సీతంపేట, కొత్తూరు, భామిని, మెళియాపుట్టి, మందస,
హిరమండలం, పాతపట్నం మండలాల్లోని 5180 బ్లాకులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా 4,147 బ్లాకుల్లోని బీడు భూముల అభివృద్ధికే నిర్ణయం తీసుకున్నారు. ఎంపిక చేసిన బ్లాకుల్లో రైతులకు చెందిన భూములను అభివృద్ధి చేసి అవసరమైన చోట చేతి పంపులు, విద్యుత్ బోర్లు వేయడానికి చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు 3,372 బ్లాకుల్లో 157 బోర్లకు మాత్రమే డ్రిల్లింగ్ చేశారు. వీటిలో 56 బోర్ల ఏర్పాటు పూర్తి అయ్యింది. మిగతా వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాలు వీటిపై ఆశలు వదిలేసుకునే పరిస్థితి కల్పించాయి. ఇప్పటివరకు ప్రారంభించని వాటికి ఎటువంటి డ్రిల్లింగ్ చేయవద్దని, బోర్లు వేయవద్దని, డ్రిల్లింగ్ పూర్తి అయిన వాటికి మాత్రమే కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో డ్రిల్లింగ్ ప్రక్రియ నిలిచిపోయింది.
మూడు మండలాల్లోనే అధికం...
సీతంపేట, భామిని, కొత్తూరు మండలాల్లోనే అధిక శాతం బీడు భూములను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోగా వీటి పరిధిలో 553 బ్లాకుల ను ఎంపిక చేశారు. భామిని మండలంలో 87 బ్లాకుల్లో 1537 ఎకరాలు, సీతంపేట మండలంలో 438 బ్లాకుల పరిధిలో 6,431 ఎకరాలు, కొత్తూరులో 28 బ్లాకుల పరిధిలో 280 ఎకరాల భూమిని వినియోగంలోకి తేవాలని ప్రణాళికలు రూపొందించారు. పలు చోట్ల బోర్లు తవ్వినా మోటారు బిగించకపోవడం, విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడం వంటి కారణాలతో గోతులు మాత్రమే మిగిలాయి. కొత్తగా డ్రిల్లింగ్ చేపట్టవద్దని ప్రభుత్వం ఆదేశించడంతో ఈ పథకం కంచికి చేరినట్లేనని తెలుస్తోంది. ఈ విషయమై ఇందిర జలప్రభ కన్సల్టెంట్ శ్రీహరి వద్ద ప్రస్తావించగా పాత వాటి కి డ్రిల్లింగ్ చేయవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. మిగతా వాటి ప్రక్రియ కొనసాగుతుందన్నారు.