indira jala prabha
-
ఏసీబీ వలలో ఐజేపీ టీఏ
బాన్స్వాడ: నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ మండలంలో ఇందిరజలప్రభ పథకం(ఐజేపీ)లో టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ)గా పనిచేస్తున్న ఈశ్వర్ గౌడ్.. బోర్లు వేసే కాంట్రాక్టరు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు. ప్రభుత్వ భూముల్లో సాగు సౌకర్యంకోసం ఇందిర జలప్రభ పథకం ద్వారా బోర్లు వేయిస్తారు.బిచ్కుందకు చెందిన మహమ్మదు అనే కాంట్రాక్టర్ మండలంలో తొమ్మిది బోర్లు వేశాడు. ఐదు బోర్లకు సంబంధించిన బిల్లు ఇప్పటికే అందాయి. మిగిలిన నాలుగు బోర్లకు సంబంధించిన బిల్లులకు సంబంధించి రూ. 98 వేలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బిల్లు క్లియర్ చేయాలంటే రూ. 10 వేలు లంచం ఇవ్వాలని టీఏ ఈశ్వర్ గౌడ్ డిమాండ్ చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్.. నిజామాబాద్ డీఎస్పీ నరేందర్‌రెడ్డిని ఆశ్రయించాడు. బుధవారం ఉదయం ఓ హోటల్ లో కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా టీఏను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఏసీబీ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
రికవరీ.. రిస్కే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పైన చెప్పిదంతా చదువుతుంటే సాధ్యమేనా అనిపిస్తోందా? కచ్చితంగా కాదు..అందుకే ఇందిర జలప్రభలో పక్కదారి పట్టిన రూ.కోట్ల సొమ్మును రికవరీ చేయడం అసాధ్యమనే భావన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రాథమిక విచారణలో తేలిన 2.4 కోట్ల రూపాయలను ఎలా రికవరీ చేయాలన్న దానిపై అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను చూస్తేనే ఇది అర్థమవుతోంది. నెలకు రూ.5వేల నుంచి రూ.20వేల వరకు జీతాలున్న చిన్న ఉద్యోగుల నుంచి ఏకంగా పదుల లక్షల రూపాయలు రికవరీ చేయాలన్న ఉత్తర్వులు చూస్తే అసలు ఈ కేసులు ఎప్పటికీ సమాప్తం కావేమో అని అనిపించకమానదు. వారికి వచ్చింది కమీషన్లే.. వాస్తవానికి జలప్రభ పథకంలో భాగంగా మిర్యాలగూడ క్లస్టర్లో జరిగిన అవినీతి సొమ్మంతా చేరింది ఒకరికైతే... రికవరీ మరొకరి నుంచి చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతల్లో ఉన్నారు కనుక.. ప్రజాధనం దుర్వినియోగం అయింది కనుక వారే కట్టాలని అధికారులంటున్నారు.. నిబంధనలు కూడా అదే చెబుతున్నాయి.. కానీ నిజంగా రికవరీ చేయాల్సిన మొత్తాన్ని ఉద్యోగులకు పంచిన మొత్తం వారికి చేరి ఉంటే అది సాధ్యమవుతుంది. కానీ ఒక్కో ఉద్యోగి నుంచి రికవరీకి పెట్టిన మొత్తంలో కనీసం 10శాతం కూడా వారికి లంచంగా అందలేదు. కోట్లు కొల్లగొట్టేందుకు కమీషన్లను ఎరవేసి.. సంతకం పెట్టినప్పుడల్లా వెయ్యో, రెండు వేలో జేబుల్లో పెట్టి వెళ్లిపోయాయి పెద్ద చేపలు. కానీ తప్పు జరిగింది కనుక అందరి మీద బాధ్యత ఉంటుందంటూ చిన్న ఉద్యోగుల నుంచి రికవరీ పెట్టారు అధికారులు. నిజంగా పక్కదారి పట్టిన సొమ్మును రికవరీ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే..ఎవరి బ్యాంకు ఖాతాల్లోకి.. ఎవరి జేబుల్లోకి డబ్బులు వెళ్లాయో... వారి నుంచి రికవరీకి ఉత్తర్వులు ఇచ్చి, ఇందుకు గతంలో వారికి ఏదో రూపంలో సహకరించిన కింది స్థాయి ఉద్యోగులను ఉపయోగించుకోవాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో జిల్లా అధికారులు కూడా ఏమీ చేయలేరని, నిబంధనలకు అనుగుణంగా ఫైళ్లు రాసి పంపారని అంటున్నారు. పర్సంటేజీలేసి పంచారు.. ఈ అవినీతి వ్యవహారంలో జిల్లా అధికారులు పంపిన నివేదికలు, రిపోర్టులు, హైదరాబాద్ నుంచి వచ్చిన తనిఖీ అధికారుల నివేదికలు ఎలా ఉన్నాయో కానీ.. పక్కదారి పట్టిన సొమ్మును రికవరీ చేసేందుకు గాను రాష్ట్రస్థాయి అధికారులు పర్సంటేజీలు పంచారు. ఈ సొమ్ములో (ఒక్కో పని వారీగా) 100 రూపాయలు దుర్వినియోగం అయితే, అందులో 10 శాతం ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి, 20 శాతం జియాలజిస్టు నుంచి, 20 శాతం టెక్నికల్ అసిస్టెంట్ నుంచి, 20శాతం ఇంజినీరింగ్ కన్సల్టెంట్ నుంచి, 10శాతం క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్ నుంచి, 20శాతం అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ (ఏపీడీ) నుంచి రికవరీ చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే, చివరి రెండు స్థాయిల ఉద్యోగులు మినహా మిగిలిన ఎవరినుంచీ ఆ మేరకు రికవరీ సాధ్యం కాదని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. దుర్వినియోగం అయిన సొమ్ము రికవరీలో పర్సంటేజీలు పంచినట్టుగా అందరికీ అవినీతి సొమ్ము ముట్టలేదు. కొందరికి పెద్ద మొత్తంలో ముడితే ఇంజినీరింగ్ కన్సల్టెంట్ వరకు ముట్టింది కమీషన్లే. అంటే మొత్తం సొమ్ములో 10 శాతం కూడా ముట్టలేదు. కానీ, ఈ రికవరీ ఉత్తర్వులు రావడంలో రాజకీయ ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మిర్యాలగూడ క్లస్టర్ పరిధిలోకి వచ్చే ఓ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే తన పార్టీకి చెందిన నాయకుల మీదకు ఈ కేసు మళ్లకుండా చొరవ తీసుకున్నారని, తన పలుకుబడిని ఉపయోగించి తన మనుషులను తప్పించేందుకు ఆయన ప్రయత్నించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదిఏమైనా... ఎవరి ప్రమేయం ఏ స్థాయిలో ఉన్నా... దుర్వినియోగం అయిన ప్రతి రూపాయిని రాబట్టాల్సిందేనని, ఇందుకు అవసరమైతే నిబంధనలు మార్చాలని, కింది స్థాయి ఉద్యోగులు తిన్న సొమ్మును కూడా కక్కించాల్సిందేనని, అయితే, పెద్ద చేపలను మాత్రం ఉదాసీనంగా వదిలిపెట్టవద్దనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
ఇందిర జలప్రభకు మంగళం?
సీతంపేట:ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ఉద్దేశించిన పలు పథకాలకు తెలుగుదేశం ప్రభుత్వం చాప కింద నీరులా కోత పెడుతోంది. ఫలితంగా గిరిజనాభివృద్ధి నేతిబీరకాయ చందంగా తయారైంది. తాజాగా ఇందిర జలప్రభ పథకానికి క్రమంగా మంగళం పాడేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ,ఎస్టీ భూములను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం 2011లో ఇందిర జలప్రభ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న బంజరు భూములను అభివృద్ధి చేసి సాగులోకి తేవడం ద్వారా ఆయా వర్గాల లబ్ధిదారులకు ఉపాధి కల్పించాలన్నది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అయితే ప్రవేశపెట్టిన నాటి నుంచీ ఈ పథకం నత్తనడకనే సాగుతోంది. సీతంపేట ఐటీడీఏ పరిధిలో సీతంపేట, కొత్తూరు, భామిని, మెళియాపుట్టి, మందస, హిరమండలం, పాతపట్నం మండలాల్లోని 5180 బ్లాకులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా 4,147 బ్లాకుల్లోని బీడు భూముల అభివృద్ధికే నిర్ణయం తీసుకున్నారు. ఎంపిక చేసిన బ్లాకుల్లో రైతులకు చెందిన భూములను అభివృద్ధి చేసి అవసరమైన చోట చేతి పంపులు, విద్యుత్ బోర్లు వేయడానికి చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు 3,372 బ్లాకుల్లో 157 బోర్లకు మాత్రమే డ్రిల్లింగ్ చేశారు. వీటిలో 56 బోర్ల ఏర్పాటు పూర్తి అయ్యింది. మిగతా వాటి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాలు వీటిపై ఆశలు వదిలేసుకునే పరిస్థితి కల్పించాయి. ఇప్పటివరకు ప్రారంభించని వాటికి ఎటువంటి డ్రిల్లింగ్ చేయవద్దని, బోర్లు వేయవద్దని, డ్రిల్లింగ్ పూర్తి అయిన వాటికి మాత్రమే కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో డ్రిల్లింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. మూడు మండలాల్లోనే అధికం... సీతంపేట, భామిని, కొత్తూరు మండలాల్లోనే అధిక శాతం బీడు భూములను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోగా వీటి పరిధిలో 553 బ్లాకుల ను ఎంపిక చేశారు. భామిని మండలంలో 87 బ్లాకుల్లో 1537 ఎకరాలు, సీతంపేట మండలంలో 438 బ్లాకుల పరిధిలో 6,431 ఎకరాలు, కొత్తూరులో 28 బ్లాకుల పరిధిలో 280 ఎకరాల భూమిని వినియోగంలోకి తేవాలని ప్రణాళికలు రూపొందించారు. పలు చోట్ల బోర్లు తవ్వినా మోటారు బిగించకపోవడం, విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడం వంటి కారణాలతో గోతులు మాత్రమే మిగిలాయి. కొత్తగా డ్రిల్లింగ్ చేపట్టవద్దని ప్రభుత్వం ఆదేశించడంతో ఈ పథకం కంచికి చేరినట్లేనని తెలుస్తోంది. ఈ విషయమై ఇందిర జలప్రభ కన్సల్టెంట్ శ్రీహరి వద్ద ప్రస్తావించగా పాత వాటి కి డ్రిల్లింగ్ చేయవద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. మిగతా వాటి ప్రక్రియ కొనసాగుతుందన్నారు. -
ఇందిర జల‘భ్రమ’
ఏలూరు :పేరు గొప్ప.. తీరు దిబ్బ.. పథకాల జాబితాలోకి ఇందిర జలప్రభ కూడా చేరిపోయింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో జిల్లాలో ఈ పథకం నీరుగారుతోంది. నీటి వనరులు లేనిచోట గొట్టపు బావులు.. లేకుంటే బోర్లు తవ్వి విద్యుత్ సౌకర్యం కల్పించి ఎస్సీ, ఎస్టీ రైతుల బీడు భూములను సాగులోకి తేవాలన్న ఈ పథకం లక్ష్యం డ్వామా, విద్యుత్ శాఖల నిర్వాకం వల్ల నెరవేరడం లేదు. జిల్లా ఎస్సీ, ఎస్టీ రైతుల బీడు భూములను సాగు యోగ్యం చేసేందుకు ఉద్దేశించిన ఇందిర జలప్రభ పథకం ఆచరణలో ఓ భ్రమలాగా మారింది. 2012 నుంచి పథకం లక్ష్యాన్ని ప్రభుత్వాలు నీరుగారుస్తూ వచ్చాయి. గడచిన రెండేళ్ల పురోగతిని పరిశీలిస్తే ఈ పథకం ఎండమావిగా మారిందన్న విమర్శలున్నాయి. దీంతో రైతులు పూర్తిస్థాయి ప్రయోజనం పొందలేక భూములను సాగు చేయలేక అవస్థలు పడుతున్నారు. భూములకు చేరువలో ఎలాంటి నీటి వనరు లేకపోతే గొట్టపు బావులు లేదా బోర్లు తవ్వి.. వాటికి విద్యుత్ సౌకర్యం కల్పించి, మోటార్లు అమర్చాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం బోర్లు తవ్వి వదిలేస్తున్నారు. వ్యవసాయ భూములకు బోర్లు వేయడం జోరందుకున్న సమయంలో కరెంట్ కనెక్షన్ ఇవ్వడంలో విద్యుత్, డ్వామా శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల పథకం అడుగడుగునా నీరు గారిపోతోందన్న విమర్శలున్నాయి. బోర్లకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించకపోవడంతో ఐజేపీ పథకం కోసం నిధులు ఖర్చు చేసినా ఫలితం కనిపించటం లేదు. విద్యుత్ అధికారులు మాత్రం కనెక్షన్ల ఏర్పాటుకు తమకు సొమ్ములు జమ పడితే గాని చేయలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో భూములు సాగు చేయడంలో జాప్యం చోటు చేసుకుంటోంది. నాలుగు క్లస్టర్ల కింద 18 మండలాల్లో జిల్లాలోని నాలుగు క్లస్టర్లలో బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, దేవరపల్లి, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడె ం, నల్లజర్ల, తాళ్లైపూడి, చింతలపూడి, ద్వారకాతిరువృుల, కామవరపుకోట, లింగపాలెం, పెదవేగి, టి. నర్సాపురం, భీమడోలు, దెందులూరు, ఉంగుటూరు మండలాల్లో 1572 బ్లాకుల కింద ఎస్సీలు 6,153 మందికి 9,167 ఎకరాలు, ఎస్టీలు 2377 మందికి 6676 ఎకరాల్లో మొత్తం 15,843 ఎకరాలు సాగు యోగ్యం చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 937 బ్లాకుల్లో 9,885 ఎకరాల్లో సాగుకు ఏర్పాట్లు చే శారు. 926 బోర్లును ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 683 బోర్లను మాత్రమే తవ్వారు. విద్యుత్ సౌకర్యం కల్పించడానికి 573 దరఖాస్తులను రైతుల నుంచి స్వీకరించిన అధికారులు విద్యుద్దీకరణను కేవలం 269 మందికే పూర్తిచేశారు. సగానికి పైగా విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. దీంతో బడుగు రైతుల భూములు పూర్తిస్థాయిలో సాగుయోగ్యం కావడం లేద న్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.17 కోట్ల మేర ఖర్చు చేశారు. నీరందటం లేదని రైతులు గగ్గోలు విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటులో తీవ్ర అలసత్వం కారణంగా నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రతి పది ఎకరాలకు ఒక బోరు చొప్పున ఇందిర జలప్రభ పథకంలో అసైన్డ్ భూముల రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయూలి. ఉద్యానవన పంటలైన మామిడి, జీడిమామిడి, నిమ్మ, పామాయిల్ వంటి పంటలు మాత్రమే సాగుచేయాలి. అరుుతే చింతలపూడి, గోపాలపురం మండలాల్లో ఒక్క బోరు వల్ల పది ఎకరాలకు సాగునీరు అందక మొక్కలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిర జలప్రభ కింద 2, 3 ఎకరాలు ఉన్న లబ్ధిదారులకు కూడా బోరు వేయాలన్న డిమాండ్ ఉన్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీన్ని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా అమలు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. మంజూరైన 7.5 హార్స్పవర్ మోటారు వల్ల ఉపయోగం లేదని 12.5 హార్స్ పవర్ మోటారు అందజేయాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామవరపుకోట మండలంలో ఇదీ పరిస్థితి... కామవరపుకోట మండలానికి 160 బోర్లు మంజూరు కాగా 140 బోర్లకు డ్రిల్లింగ్ పూర్తయింది. వీటిలో 54 బోర్లకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లను ఇచ్చారు. ఇంకా 86 బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. విద్యుత్ లేకపోవడం వల్ల లబ్ధిదారులు పక్క రైతుల నుంచి నీటిని కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా సీజన్ కు ఇంతని నీటికి సొమ్ములు వసూలు చేయడం ఆనవాయితీ. అయితే కామవరపుకోట మండలంలోని కొన్ని ప్రాంతాలలో పంటపై వచ్చే ఆదాయానికి నూటికి మూడు రూపాయల చొప్పున నీటి పన్ను చెల్లించాల్సి వస్తోందని కొందరు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ ఇవ్వలేదు 2013లో ఇందిర జలప్రభ పథకం కింద బోరు వేశారు. ఇప్పటివరకు కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. నాలుగు ఎకరాలలో మొక్కజొన్న చేను వేశాను. పక్క రైతు వద్ద నుంచి నీటిని వాడుకుంటున్నాను. ఇందుకుగాను రైతుకు పంట ఆదాయంపై నూటికి మూడు రూపాయలు చెల్లించాల్సి వుంది. - వై.రఫాయేలు, లబ్ధిదారుడు, పాతూరు (కామవరపుకోట). -
మూడేళ్లు పూర్తి ప్రయోజలం నాస్తి
పార్వతీపురం : వివిధ శాఖలకు చెందిన అధికారుల మధ్య నెలకొన్న సమన్వయ లోపం, నిర్లక్ష్యం వెరశి ‘ఇందిర జల ప్రభ’ పథకం నత్తనడకన సాగుతోంది. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను సాగుకు అనువుగా అభివృద్ధి చేసి, వాటికి పూర్తి స్థాయిలో సాగునీటిని అందించి తద్వారా ఆయా కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్న ఉద్దేశంతో 2011లో ప్రారంభించిన ‘ఇందిర జలప్రభ’ జిల్లాలో కునుకుపాట్లు పడుతోంది. జిల్లాలో 378 బ్లాకులను గుర్తించి, 6,629 ఎకరాలను సాగులోకి తెచ్చి 3,592 మందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే మూడేళ్లు పూర్తి కావస్తున్నా అధికారుల గణంకాలు కాగితాలకే పరిమితం అయ్యాయి తప్ప, నిర్లక్ష్యంతో నీరుగారుతున్న పథకంఇందిర జలప్రభను విజయవంతం చేసేందుకు గాను డ్వామా, విద్యుత్, వ్యవసాయ, ఇరిగేషన్ తదితర శాఖాధికారులు పనిచేయాల్సి ఉంది. అయితే ఆయా శాఖాధికారుల మధ్య సమన్వయం లోపించడంతో ఈ పథకం లబ్ధిదారులకు ఇప్పటికీ ఫలాలు అందివ్వలేకపోయింది. ఎస్సీ, ఎస్టీల వద్ద ఉన్న భూములు గుర్తించడం, వాటిలో బోర్ వెల్లు వేయడం, ఆ భూమికి 100 శాతం నీటి వసతి కల్పించి వినియోగంలోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే ఆ లక్ష్యం పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని ఎనిమిది మండలాలలో ఎక్కడా నెరవేరలేదు. 100 శాతం సబ్సిడీతో బోరు వెల్‌కు మోటారు బిగించాలి, అయితే దాదాపు 249 బోర్లు తవ్వినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 51 మోటార్లు మాత్రమే ఏర్పాటు చేశారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి పథకం అమలు వరకు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నీటి వసతి లేని చోట్ల పెద్ద పెద్ద మోటార్లు బిగించడం, అవసరమైన చోట రిగ్ బోరు వేయకపోవడం తదితర లోపాలు అధికంగా ఉన్నట్లు, బోర్లు తవ్వకాలలో, మోటార్లు కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి ఏర్పాటు చేసిన ఏడు సోలార్ పంపుసెట్లలో దాదాపు ఆరు మూలకు చేరాయి. పీఓ ఆదేశించినా.. ఐటీడీఏ పరిధిలో వ్యవసాయ వినియోగానికి పనికొచ్చే భూములు దాదాపు 20వేల ఎకరాల వరకు ఉన్నట్లు అంచనా. వీటిలో భాగంగానే 16 వేల ఎకరాలలో ఐటీడీఏ పీఓ రజిత్ కుమార్ సైనీ జీడి మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టారు. గత నెల 20న జరిగిన సమావేశంలో ఇందిర జలప్రభపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను పీఓ ఆదేశించినా ఇప్పటికీ ఇందిర జలప్రభ అడుగు ముందుకు పడలేదని సబ్-ప్లాన్‌లోని ప్రజలంటున్నారు. తమ మధ్య ఉన్న సమన్వయ లో పం, నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు, ఆయా శాఖ లకు చెందిన అధికారులు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ఇందిర జలప్రభను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు నిజనిర్ధారణ ద్వారా మాత్రమే మళ్లీ దీనికి జీవం రాగలదని ప్రజలంటున్నారు. -
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం
గజ్వేల్/జగదేవ్‌పూర్, న్యూస్‌లైన్ : ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యంగా ‘ఇందిర జలప్రభ’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ స్మితాసబర్వాల్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం గజ్వేల్ మండలం ఆహ్మాదీపూర్ గ్రామంలోని 10 మంది ‘ఇందిర జలప్రభ’ లబ్ధిదారులకు చెందిన 20 ఎకరాల్లో డ్రిప్ పథకాన్ని వర్తింప జేసిన పథకాన్ని ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో సూక్ష్మనీటి సేద్యపు పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. కూరగాయలు, పండ్ల తోటల రైతులకు ఈ పథకంతో భారీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. జిల్లాలో వచ్చే మార్చి కల్లా 60 వేల ఎకరాల్లో పరికరాలను బిగిస్తామని, ఇప్పటివరకు 5 వేల ఎకరాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావస్తున్నదని వెల్లడించారు. ఈ సందర్భంలో సూక్ష్మ నీటి పథకం నిబంధనలు మార్చి స్పెసింగ్ పెంచడం, ప్రతి రైతుకు గ్రామసభ తీర్మానాన్ని కోరటం వంటి కొత్త నిబంధనల వల్ల ఎంతోమంది రైతులు దీనిపై ఆసక్తి చూపటం లేదని, ఫలితంగా లక్ష్యం నెరవేరడం లేదని ‘న్యూస్‌లైన్’ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. నిబంధనల విషయమై తామేమీ చేయలేమని వెల్లడించారు. నిబంధనలకు లోబడే రైతులు ఈ పథకాన్ని వినియోగించుకోవాలని తేల్చిచెప్పారు. అనంతరం కలెక్టర్ ఆహ్మాదీపూర్ గ్రా మంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నర్సారెడ్డితో పాటు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డెరైక్టర్ రవీందర్, జిల్లా సూక్ష్మ నీటి పథకం ప్రాజెక్ట్ డెరైక్టర్ రామలక్ష్మి, ఉపాధిహామీ పథకం గజ్వేల్ నియోజకవర్గ ఏపీడీ వసంత సుగుణ, ఎంపీడీఓ కౌసల్యాదేవి, మండల సహకార సంఘం చైర్మన్ వెంకట్‌నర్సింహ్మారెడ్డి, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులకు కలెక్టర్ శంకుస్థాపన ఎస్సీ, ఎస్టీల భీడు భూములను సాగులోకి తీసుకవచ్చి వారిని ఆర్థికంగా అభివృద్ధి చెందించడమే ఇందిర జలప్రభ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ స్మితా సబర్వాల్ అన్నారు. శుక్రవారం జగదేవ్‌పూర్ మండల తిమ్మాపూర్‌లో ఇందిర జలప్రభ బ్లాక్‌తో పాటు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సంధర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్మితా సభర్వాల్ మాట్లాడుతూ విద్యుత్ కోతల వల్ల రైతులు ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలన్నారు. జిల్లాలో 5 వేల ఎకరాల్లో ఇందిర జలప్రభ పథకం ద్వారా బోరు మోటార్లు అందించి బిందు సేద్యం ద్వారా ఆరుతడి పంటలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 9 మంది ఇందిర జలప్రభ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకాన్ని రైతులకు ఆధునాతన పద్ధతుల్లో అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో పీర్ ఈఈ కనకరత్నం, డిప్యూటీ ఈఈ చంద్రమౌళి, ఆర్ఎంఎస్ ఎఈ అనిల్ కుమార్, ఎంపీడీఓ సలోమి ప్రియదర్శిని, పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా చైర్మన్ జనార్దన్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కొండ పోచమ్మ చైర్మన్ మల్లేశ ం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ నవ్య, నాయకులు యాదగిరి, చల్లా బాలకిషన్, లకా్ష్మరెడ్డి, బంగా శ్రీనివాస్ రెడ్డి, బాలేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇందిర జలప్రభ బోర్ల పరిశీలన
తలమడుగు, న్యూస్‌లైన్ : మండలంలో ఇందిర జలప్రభ పథకం కింద రైతుల పొలాల్లో వేసిన బోర్లను ఇందిర జలప్రభ రాష్ట్ర అసిస్టెంట్ డెరైక్టర్ జి.నీలారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ భానుప్రసాద్ మంగళవారం పరిశీలించారు. మండల కేంద్రంలో సర్వే చేసి వెళ్లారు గానీ ఇప్పటివరకు సిబ్బంది రాలేదని రైతులు ఎలుగు ఆనంద్, రాజన్న అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై ఏపీడీ కృష్ణారావు, ఏపీవో జగ్దేరావులను ప్రశ్నించగా.. నీటి లభ్యత లేకపోవడంతో తిరస్కరించామని తెలిపారు. నీటి లభ్యత ఉన్నట్లు దరఖాస్తు చేస్తే తిరిగి సర్వే చేస్తామని పేర్కొన్నారు. నీలారెడ్డి, భానుప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గతంలో పదెకరాలకు ఒక బోరు వేశామని, ప్రస్తుతం ఐదెకరాలున్నా బోరు వేస్తామని తెలిపారు. మండలంలో ఎన్ని గ్రామాల్లో బోర్లు వేశారని ఏపీవోను అడిగి తెలుసుకున్నారు. కజ్జర్ల, లక్ష్మీపూర్, కుచులాపూర్, కప్పర్దేవి గ్రామాల్లో బోర్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. వారి వెంట టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మణ్, రవీందర్, పొచ్చన్న తదితరులు ఉన్నారు.