ఏసీబీ వలలో ఐజేపీ టీఏ
బాన్స్‌వాడ: నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడ మండలంలో ఇందిరజలప్రభ పథకం(ఐజేపీ)లో టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ)గా పనిచేస్తున్న ఈశ్వర్ గౌడ్.. బోర్లు వేసే కాంట్రాక్టరు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు. ప్రభుత్వ భూముల్లో సాగు సౌకర్యంకోసం ఇందిర జలప్రభ పథకం ద్వారా బోర్లు వేయిస్తారు.బిచ్‌కుందకు చెందిన మహమ్మదు అనే కాంట్రాక్టర్ మండలంలో తొమ్మిది బోర్లు వేశాడు.
ఐదు బోర్లకు సంబంధించిన బిల్లు ఇప్పటికే అందాయి. మిగిలిన నాలుగు బోర్లకు సంబంధించిన బిల్లులకు సంబంధించి రూ. 98 వేలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బిల్లు క్లియర్ చేయాలంటే రూ. 10 వేలు లంచం ఇవ్వాలని టీఏ ఈశ్వర్ గౌడ్ డిమాండ్ చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్.. నిజామాబాద్ డీఎస్పీ నరేందర్‌రెడ్డిని ఆశ్రయించాడు. బుధవారం ఉదయం ఓ హోటల్ లో కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా టీఏను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఏసీబీ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.