మూడేళ్లు పూర్తి ప్రయోజలం నాస్తి
పార్వతీపురం : వివిధ శాఖలకు చెందిన అధికారుల మధ్య నెలకొన్న సమన్వయ లోపం, నిర్లక్ష్యం వెరశి ‘ఇందిర జల ప్రభ’ పథకం నత్తనడకన సాగుతోంది. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను సాగుకు అనువుగా అభివృద్ధి చేసి, వాటికి పూర్తి స్థాయిలో సాగునీటిని అందించి తద్వారా ఆయా కుటుంబాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలన్న ఉద్దేశంతో 2011లో ప్రారంభించిన ‘ఇందిర జలప్రభ’ జిల్లాలో కునుకుపాట్లు పడుతోంది. జిల్లాలో 378 బ్లాకులను గుర్తించి, 6,629 ఎకరాలను సాగులోకి తెచ్చి 3,592 మందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
అయితే మూడేళ్లు పూర్తి కావస్తున్నా అధికారుల గణంకాలు కాగితాలకే పరిమితం అయ్యాయి తప్ప, నిర్లక్ష్యంతో నీరుగారుతున్న పథకంఇందిర జలప్రభను విజయవంతం చేసేందుకు గాను డ్వామా, విద్యుత్, వ్యవసాయ, ఇరిగేషన్ తదితర శాఖాధికారులు పనిచేయాల్సి ఉంది. అయితే ఆయా శాఖాధికారుల మధ్య సమన్వయం లోపించడంతో ఈ పథకం లబ్ధిదారులకు ఇప్పటికీ ఫలాలు అందివ్వలేకపోయింది. ఎస్సీ, ఎస్టీల వద్ద ఉన్న భూములు గుర్తించడం, వాటిలో బోర్ వెల్‌లు వేయడం, ఆ భూమికి 100 శాతం నీటి వసతి కల్పించి వినియోగంలోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం.
అయితే ఆ లక్ష్యం పార్వతీపురం సబ్-ప్లాన్‌లోని ఎనిమిది మండలాలలో ఎక్కడా నెరవేరలేదు.
100 శాతం సబ్సిడీతో బోరు వెల్‌కు మోటారు బిగించాలి, అయితే దాదాపు 249 బోర్లు తవ్వినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 51 మోటార్లు మాత్రమే ఏర్పాటు చేశారు. లబ్ధిదారుల ఎంపిక నుంచి పథకం అమలు వరకు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నీటి వసతి లేని చోట్ల పెద్ద పెద్ద మోటార్లు బిగించడం, అవసరమైన చోట రిగ్ బోరు వేయకపోవడం తదితర లోపాలు అధికంగా ఉన్నట్లు, బోర్లు తవ్వకాలలో, మోటార్లు కొనుగోళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి ఏర్పాటు చేసిన ఏడు సోలార్ పంపుసెట్లలో దాదాపు ఆరు మూలకు చేరాయి.
పీఓ ఆదేశించినా..
ఐటీడీఏ పరిధిలో వ్యవసాయ వినియోగానికి పనికొచ్చే భూములు దాదాపు 20వేల ఎకరాల వరకు ఉన్నట్లు అంచనా. వీటిలో భాగంగానే 16 వేల ఎకరాలలో ఐటీడీఏ పీఓ రజిత్ కుమార్ సైనీ జీడి మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టారు. గత నెల 20న జరిగిన సమావేశంలో ఇందిర జలప్రభపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను పీఓ ఆదేశించినా ఇప్పటికీ ఇందిర జలప్రభ అడుగు ముందుకు పడలేదని సబ్-ప్లాన్‌లోని ప్రజలంటున్నారు. తమ మధ్య ఉన్న సమన్వయ లో పం, నిర్లక్ష్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు, ఆయా శాఖ లకు చెందిన అధికారులు ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా ఇందిర జలప్రభను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు నిజనిర్ధారణ ద్వారా మాత్రమే మళ్లీ దీనికి జీవం రాగలదని ప్రజలంటున్నారు.