ఇందిర జల‘భ్రమ’
ఏలూరు :పేరు గొప్ప.. తీరు దిబ్బ.. పథకాల జాబితాలోకి ఇందిర జలప్రభ కూడా చేరిపోయింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపంతో జిల్లాలో ఈ పథకం నీరుగారుతోంది. నీటి వనరులు లేనిచోట గొట్టపు బావులు.. లేకుంటే బోర్లు తవ్వి విద్యుత్ సౌకర్యం కల్పించి ఎస్సీ, ఎస్టీ రైతుల బీడు భూములను సాగులోకి తేవాలన్న ఈ పథకం లక్ష్యం డ్వామా, విద్యుత్ శాఖల నిర్వాకం వల్ల నెరవేరడం లేదు.
జిల్లా ఎస్సీ, ఎస్టీ రైతుల బీడు భూములను సాగు యోగ్యం చేసేందుకు ఉద్దేశించిన ఇందిర జలప్రభ పథకం ఆచరణలో ఓ భ్రమలాగా మారింది. 2012 నుంచి పథకం లక్ష్యాన్ని ప్రభుత్వాలు నీరుగారుస్తూ వచ్చాయి. గడచిన రెండేళ్ల పురోగతిని పరిశీలిస్తే ఈ పథకం ఎండమావిగా మారిందన్న విమర్శలున్నాయి. దీంతో రైతులు పూర్తిస్థాయి ప్రయోజనం పొందలేక భూములను సాగు చేయలేక అవస్థలు పడుతున్నారు. భూములకు చేరువలో ఎలాంటి నీటి వనరు లేకపోతే గొట్టపు బావులు లేదా బోర్లు తవ్వి.. వాటికి విద్యుత్ సౌకర్యం కల్పించి, మోటార్లు అమర్చాల్సి ఉంది. అయితే అధికారులు మాత్రం బోర్లు తవ్వి వదిలేస్తున్నారు. వ్యవసాయ భూములకు బోర్లు వేయడం జోరందుకున్న సమయంలో కరెంట్ కనెక్షన్ ఇవ్వడంలో విద్యుత్, డ్వామా శాఖల మధ్య సమన్వయ లోపం వల్ల పథకం అడుగడుగునా నీరు గారిపోతోందన్న విమర్శలున్నాయి. బోర్లకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించకపోవడంతో ఐజేపీ పథకం కోసం నిధులు ఖర్చు చేసినా ఫలితం కనిపించటం లేదు. విద్యుత్ అధికారులు మాత్రం కనెక్షన్ల ఏర్పాటుకు తమకు సొమ్ములు జమ పడితే గాని చేయలేమని చేతులెత్తేస్తున్నారు. దీంతో భూములు సాగు చేయడంలో జాప్యం చోటు చేసుకుంటోంది.
నాలుగు క్లస్టర్ల కింద 18 మండలాల్లో
జిల్లాలోని నాలుగు క్లస్టర్లలో బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, దేవరపల్లి, గోపాలపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడె ం, నల్లజర్ల, తాళ్లైపూడి, చింతలపూడి, ద్వారకాతిరువృుల, కామవరపుకోట, లింగపాలెం, పెదవేగి, టి. నర్సాపురం, భీమడోలు, దెందులూరు, ఉంగుటూరు మండలాల్లో 1572 బ్లాకుల కింద ఎస్సీలు 6,153 మందికి 9,167 ఎకరాలు, ఎస్టీలు 2377 మందికి 6676 ఎకరాల్లో మొత్తం 15,843 ఎకరాలు సాగు యోగ్యం చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 937 బ్లాకుల్లో 9,885 ఎకరాల్లో సాగుకు ఏర్పాట్లు చే శారు. 926 బోర్లును ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 683 బోర్లను మాత్రమే తవ్వారు. విద్యుత్ సౌకర్యం కల్పించడానికి 573 దరఖాస్తులను రైతుల నుంచి స్వీకరించిన అధికారులు విద్యుద్దీకరణను కేవలం 269 మందికే పూర్తిచేశారు. సగానికి పైగా విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. దీంతో బడుగు రైతుల భూములు పూర్తిస్థాయిలో సాగుయోగ్యం కావడం లేద న్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి వరకు రూ.17 కోట్ల మేర ఖర్చు చేశారు.
నీరందటం లేదని రైతులు గగ్గోలు
విద్యుత్ కనెక్షన్ల ఏర్పాటులో తీవ్ర అలసత్వం కారణంగా నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రతి పది ఎకరాలకు ఒక బోరు చొప్పున ఇందిర జలప్రభ పథకంలో అసైన్డ్ భూముల రైతులకు విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయూలి. ఉద్యానవన పంటలైన మామిడి, జీడిమామిడి, నిమ్మ, పామాయిల్ వంటి పంటలు మాత్రమే సాగుచేయాలి. అరుుతే చింతలపూడి, గోపాలపురం మండలాల్లో ఒక్క బోరు వల్ల పది ఎకరాలకు సాగునీరు అందక మొక్కలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిర జలప్రభ కింద 2, 3 ఎకరాలు ఉన్న లబ్ధిదారులకు కూడా బోరు వేయాలన్న డిమాండ్ ఉన్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. దీన్ని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా అమలు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. మంజూరైన 7.5 హార్స్‌పవర్ మోటారు వల్ల ఉపయోగం లేదని 12.5 హార్స్ పవర్ మోటారు అందజేయాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కామవరపుకోట మండలంలో ఇదీ పరిస్థితి...
కామవరపుకోట మండలానికి 160 బోర్లు మంజూరు కాగా 140 బోర్లకు డ్రిల్లింగ్ పూర్తయింది. వీటిలో 54 బోర్లకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లను ఇచ్చారు. ఇంకా 86 బోర్లకు విద్యుత్ కనెక్షన్‌లు ఇవ్వాల్సి ఉంది. విద్యుత్ లేకపోవడం వల్ల లబ్ధిదారులు పక్క రైతుల నుంచి నీటిని కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా సీజన్ కు ఇంతని నీటికి సొమ్ములు వసూలు చేయడం ఆనవాయితీ. అయితే కామవరపుకోట మండలంలోని కొన్ని ప్రాంతాలలో పంటపై వచ్చే ఆదాయానికి నూటికి మూడు రూపాయల చొప్పున నీటి పన్ను చెల్లించాల్సి వస్తోందని కొందరు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరెంట్ ఇవ్వలేదు
2013లో ఇందిర జలప్రభ పథకం కింద బోరు వేశారు. ఇప్పటివరకు కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. నాలుగు ఎకరాలలో మొక్కజొన్న చేను వేశాను. పక్క రైతు వద్ద నుంచి నీటిని వాడుకుంటున్నాను. ఇందుకుగాను రైతుకు పంట ఆదాయంపై నూటికి మూడు రూపాయలు చెల్లించాల్సి వుంది.
- వై.రఫాయేలు, లబ్ధిదారుడు, పాతూరు (కామవరపుకోట).