రికవరీ.. రిస్కే! | Crores sanctioned for 'Indira Jala Prabha' | Sakshi
Sakshi News home page

రికవరీ.. రిస్కే!

Published Wed, Feb 4 2015 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

Crores sanctioned for 'Indira Jala Prabha'

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పైన చెప్పిదంతా చదువుతుంటే సాధ్యమేనా అనిపిస్తోందా? కచ్చితంగా కాదు..అందుకే ఇందిర జలప్రభలో పక్కదారి పట్టిన రూ.కోట్ల సొమ్మును రికవరీ చేయడం అసాధ్యమనే భావన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ప్రాథమిక విచారణలో తేలిన 2.4 కోట్ల రూపాయలను ఎలా రికవరీ చేయాలన్న దానిపై అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను చూస్తేనే ఇది అర్థమవుతోంది. నెలకు రూ.5వేల నుంచి రూ.20వేల వరకు జీతాలున్న చిన్న ఉద్యోగుల నుంచి ఏకంగా పదుల లక్షల రూపాయలు రికవరీ చేయాలన్న ఉత్తర్వులు చూస్తే అసలు ఈ కేసులు ఎప్పటికీ సమాప్తం కావేమో అని అనిపించకమానదు.
 
 వారికి వచ్చింది కమీషన్లే..
 వాస్తవానికి జలప్రభ పథకంలో భాగంగా మిర్యాలగూడ క్లస్టర్‌లో జరిగిన అవినీతి సొమ్మంతా చేరింది ఒకరికైతే... రికవరీ మరొకరి నుంచి చేయాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతల్లో ఉన్నారు కనుక.. ప్రజాధనం దుర్వినియోగం అయింది కనుక వారే కట్టాలని అధికారులంటున్నారు.. నిబంధనలు కూడా అదే చెబుతున్నాయి.. కానీ నిజంగా రికవరీ చేయాల్సిన మొత్తాన్ని ఉద్యోగులకు పంచిన మొత్తం వారికి చేరి ఉంటే అది సాధ్యమవుతుంది. కానీ ఒక్కో ఉద్యోగి నుంచి రికవరీకి పెట్టిన మొత్తంలో కనీసం 10శాతం కూడా వారికి లంచంగా అందలేదు. కోట్లు కొల్లగొట్టేందుకు కమీషన్లను ఎరవేసి.. సంతకం పెట్టినప్పుడల్లా వెయ్యో, రెండు వేలో జేబుల్లో పెట్టి వెళ్లిపోయాయి పెద్ద చేపలు. కానీ తప్పు జరిగింది కనుక అందరి మీద బాధ్యత ఉంటుందంటూ చిన్న ఉద్యోగుల నుంచి రికవరీ పెట్టారు అధికారులు. నిజంగా పక్కదారి పట్టిన సొమ్మును రికవరీ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే..ఎవరి బ్యాంకు ఖాతాల్లోకి.. ఎవరి జేబుల్లోకి డబ్బులు వెళ్లాయో... వారి నుంచి రికవరీకి ఉత్తర్వులు ఇచ్చి, ఇందుకు గతంలో వారికి ఏదో రూపంలో సహకరించిన కింది స్థాయి ఉద్యోగులను ఉపయోగించుకోవాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో జిల్లా అధికారులు కూడా ఏమీ చేయలేరని, నిబంధనలకు అనుగుణంగా ఫైళ్లు రాసి పంపారని అంటున్నారు.
 
 పర్సంటేజీలేసి పంచారు..
 ఈ అవినీతి వ్యవహారంలో జిల్లా అధికారులు పంపిన నివేదికలు, రిపోర్టులు, హైదరాబాద్ నుంచి వచ్చిన తనిఖీ అధికారుల నివేదికలు ఎలా ఉన్నాయో కానీ.. పక్కదారి పట్టిన సొమ్మును రికవరీ చేసేందుకు గాను రాష్ట్రస్థాయి అధికారులు పర్సంటేజీలు పంచారు. ఈ సొమ్ములో (ఒక్కో పని వారీగా) 100 రూపాయలు దుర్వినియోగం అయితే, అందులో 10 శాతం ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి, 20 శాతం జియాలజిస్టు నుంచి, 20 శాతం టెక్నికల్ అసిస్టెంట్ నుంచి, 20శాతం ఇంజినీరింగ్ కన్సల్టెంట్ నుంచి, 10శాతం క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్ నుంచి, 20శాతం అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ (ఏపీడీ) నుంచి రికవరీ చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయి. అయితే, చివరి రెండు స్థాయిల ఉద్యోగులు మినహా మిగిలిన ఎవరినుంచీ ఆ మేరకు రికవరీ సాధ్యం కాదని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి.
 
 దుర్వినియోగం అయిన సొమ్ము రికవరీలో పర్సంటేజీలు పంచినట్టుగా అందరికీ అవినీతి సొమ్ము ముట్టలేదు. కొందరికి పెద్ద మొత్తంలో ముడితే ఇంజినీరింగ్ కన్సల్టెంట్ వరకు ముట్టింది కమీషన్లే. అంటే మొత్తం సొమ్ములో 10 శాతం కూడా ముట్టలేదు. కానీ, ఈ రికవరీ ఉత్తర్వులు రావడంలో రాజకీయ ప్రమేయం ఉందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. మిర్యాలగూడ క్లస్టర్ పరిధిలోకి వచ్చే ఓ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే తన పార్టీకి చెందిన నాయకుల మీదకు ఈ కేసు మళ్లకుండా చొరవ తీసుకున్నారని, తన పలుకుబడిని ఉపయోగించి తన మనుషులను తప్పించేందుకు ఆయన ప్రయత్నించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏదిఏమైనా... ఎవరి ప్రమేయం ఏ స్థాయిలో ఉన్నా... దుర్వినియోగం అయిన ప్రతి రూపాయిని రాబట్టాల్సిందేనని, ఇందుకు అవసరమైతే నిబంధనలు మార్చాలని, కింది స్థాయి ఉద్యోగులు తిన్న సొమ్మును కూడా కక్కించాల్సిందేనని, అయితే, పెద్ద చేపలను మాత్రం ఉదాసీనంగా వదిలిపెట్టవద్దనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement