ఇందిరమ్మకు యాక్షన్ ప్లాన్
- ఫిబ్రవరి నెలాఖరులోగా 13,606 పూర్తికి లక్ష్యం
- రచ్చబండలో మంజూరైన ఇళ్లను కూడా గ్రౌండింగ్‌కు చర్యలు
- త్వరలో హౌసింగ్, బ్యాంక్, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. శాఖల మధ్య సమన్వయలోపంతో లబ్ధిదారులను ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేల సంఖ్యలో ఇళ్లు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఏళ్ల క్రితం మంజూరైన గృహాలు ఇప్పటికీ పునాదులకు కూడా నోచుకోలేదు. దీంతో వచ్చే నెలాఖరులోగా నిర్మాణ దశలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ నిర్ణయించారు.
త్వరలోనే గృహ నిర్మాణ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ విషయంపై లక్ష్యాలను నిర్ధేశించనున్నారు. జిల్లాలో ఇందిరమ్మ పథకంలో భాగంగా 2006 నుంచి ఇప్పటి వరకు 3,78,440 గృహాలు మంజూరయ్యాయి. వీటిలో 3,11,870 ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. ఇంకా 66,570 గృహాల నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటి వరకు 2,73,966 నిర్మాణాలు పూర్తయ్యాయి.
సమన్వయ లోపమే సమస్య
శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ‘ఇందిరమ్మ’ లక్ష్యాలను సాధించలేకపోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇళ్లను గ్రౌండ్ చేయాలంటే తప్పని సరిగా రెవెన్యూ అధికారులు ల్యాండ్ పొజిషన్ సర్టిఫికేట్ (ఎల్‌పీసీ) ఇవ్వాల్సి ఉంది. అయితే ఎల్‌పీసీ మంజూరు విషయంలో తీవ్రజాప్యం జరుగుతున్న కారణంగా నిర్మాణాలను ప్రారంభించలేకపోతున్నామని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. అలాగే బ్యాంకు ఖాతాలకు సంబంధించి సమస్యలు కూడా ఉండడంతో మరింత జాప్యం జరుగుతోందని పేర్కొంటున్నారు.
ఈ విషయాన్ని గ్రహించిన కలెక్టర్ బ్యాంకర్లు, రెవెన్యూ, హౌసింగ్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ప్రధానంగా ఎల్‌పీసీల సమస్య పరిష్కారంపై చర్యలు తీసుకోనున్నారు. అలాగే హౌసింగ్ కార్యాలయంలో కూడా ఎల్‌పీసీల విషయంలో రెవెన్యూ అధికారులతో మంగళవారం చర్చించనున్నారు.
పూర్తయ్యేదెప్పుడు?
జిల్లాలో ప్రస్తుతం 37,904 గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో బేస్‌మెంట్ పూర్తయినవి 15,229, బేస్‌మెంట్ స్థాయిలో 3,647, లింటల్ స్థాయి పూర్తయినవి 5,422, రూఫ్ స్థాయిలో 13,606 ఉన్నాయి. ఫిబ్రవరి నెలాఖరులోగా ముందుగా రూఫ్ స్థాయిలో ఉన్న వాటినైనా పూర్తి చేసేందుకు కలెక్టర్ కార్యాచరణ రూపొందించనున్నారు. అలాగే ఏజెన్సీలో 8 వేల ఇళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాటికి ఆస్బెస్టాస్ రేకులు అందుబాటులో లేకపోవడంతో నిర్మాణాలలో జాప్యం జరుగుతోంది. ఆ విషయాన్ని కలెక్టర్ హౌసింగ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వీటితో పాటు రచ్చబండలో వచ్చిన దరఖాస్తుదారులకు మంజూరైన 34,523 గృహాలను కూడా వీలైనంత త్వరగా గ్రౌండింగ్ చేసేందుకు కలెక్టర్ హౌసింగ్ అధికారులకు లక్ష్యాలను నిర్ధేశించనున్నారు.