Revanth Reddy Said Two Lakh Loan Waiver for Farmers on December 9 - Sakshi

డిసెంబర్‌ 9న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ

Aug 14 2023 5:29 AM | Updated on Aug 15 2023 9:46 AM

Two lakh loan waiver for farmers on December 9 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతులెవ్వరూ బ్యాంకులకు ఒక్క రూపాయి కట్టవద్దని, ఈ ఏడాది డిసెంబర్‌ 9న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తెలంగాణలో ఏర్పడే ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయంలో కొల్లాపూర్, మహేశ్వరం నియోజకవర్గాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ, పార్లమెంటులో నోరు తెరవకపోయినా కేసీఆర్‌ను పాలమూరు జిల్లా భుజాలపై మోసిందని, అయినా పాలమూరు ప్రజలను కేసీఆర్‌ వంచించారని విమర్శించారు. పాలమూరు ప్రజానీకం ఈసారి జెండాలు, ఎజెండాలను పక్కనపెట్టి కాంగ్రెస్‌ను గెలిపించే బాధ్యత తీసుకోవాలని, పాలమూరులో 14కు 14 స్థానాలు గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 100 స్థానాలు ఖాయమని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు గ్రామగ్రామాన తిరిగి ప్రతి తలుపు తట్టాలని, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెచ్చేందుకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5 లక్షల వరకు వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రూ.500కే మహిళలకు వంటగ్యాస్‌ సిలెండర్‌ అందిస్తామని రేవంత్‌ హామీ ఇచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement