సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఐహెచ్‌హెచ్‌ఎల్‌లో భాగంగా 26,769 మరుగుదొడ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం రూ.9,100 చెల్లిస్తుండగా మిగిలిన రూ.900లను లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. అయితే జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులను ఎంపిక చేసిన గ్రామీణ నీటి సరఫరా యాజమాన్యం.. వారితో నిర్మాణాలు ప్రారంభించేందుకు చర్యలకు ఉపక్రమించింది. అయితే ఇప్పటివరకు జిల్లాలో 8,172 నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మరో 6,530 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా 12,067 పనులు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. జిల్లాలోని 33 గ్రామీణ మండలాలకు ఈ మరుగుదొడ్లు మంజూరు చేయగా.. శామీర్‌పేట, ఘట్‌కేసర్, పరిగి, కీసర, యాలాల, గండేడ్ మండలాల్లో కనీసం 20శాతం లక్ష్యాలు కూడా సాధించకపోవడం గమనార్హం.
పాతవారికి రద్దు.. కొత్త వారికి మంజూరు
స్థల సమస్య కారణంగా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టలేని వారికిచ్చిన మంజూరును రద్దు చేయాలని జిల్లా యంత్రాంగం తాజాగా నిర్ణయించింది. స్థలం ఉండి నిర్మించుకునేందుకు ముందుకు వచ్చే వారికి వెంటనే మంజూరు చేయనుంది. ఈ మేరకు ఇటీవల జిల్లా యంత్రాంగం మండల పరిషత్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సారైనా అసలైన లబ్ధిదారులను ఎంపికచేస్తే నిర్మాణ పనులు పుంజుకునే అవకాశముంది .
ఎంపిక.. లోపభూయిష్టం..
మరుగుదొడ్ల నిర్మాణం పనులు ప్రారంభం కాకపోవడంపై జిల్లా యంత్రాంగం ఇటీవల ప్రత్యేకంగా సర్వే చేపట్టింది.అధికారులు స్వయంగా లబ్ధిదారులను కలిసి నిర్మాణాలు ప్రారంభించకపోవడంపై ఆరా తీశారు. దీంతో అసలు వాస్తవాలు వెలుగు చూశాయి. ఎంపిక ప్రక్రియే లోపభూయిష్టంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నిర్మాణ స్థలం సరిపడాలేని వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారని, దీంతో చాలావరకు నిర్మాణాలు మొదలు కాలేదని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. లబ్ధిదారులకు అవగాహన కల్పించడంలో, నిర్మాణ ప్రక్రియలో గుంతలు తీయడంలో జరిగిన తప్పిదాల వల్ల కూడా కొన్ని నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయినట్లు పేర్కొన్నారు.
నత్తనడకన వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు
Published Sat, Aug 31 2013 1:08 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
Advertisement
Advertisement