సీటు రాకుంటే అమ్మేసుకున్నట్టా?
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీటు వస్తే ఎమ్మెల్యే అయిపోతామనే నమ్మకంతో ఉండి.. తీరా సీటు రాకపోయేసరికి అమ్మేసుకుంటున్నారని విమర్శలు చేయడం వారి ఆవివేకాన్ని తెలియజేస్తోందని పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ మంత్రి ఇందుకూరి రామకృష్ణంరాజు విమర్శించారు. సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం నార్కెడమిల్లిలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి, దివంగత మాజీ ఎమ్మెల్యే చిర్ల సోమసుందరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తనను కలసిన విలేకర్లతో ఇందుకూరి మాట్లాడుతూ, జగన్‌మోహన్‌రెడ్డి సీటు ఇస్తే ఎమ్మెల్యే అయిపోదామనే భావనలో ఉన్నవారికి అవకాశాలు రాకపోవడంతో చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడైన బుచ్చిమహేశ్వరరావు సీట్లు బేరం పెడుతున్నారనడాన్ని రామకృష్ణంరాజు తీవ్రంగా ఖండించారు. బుచ్చిమహేశ్వరరావు అమలాపురం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఆశించగా, జగన్‌మోహన్‌రెడ్డి అతనికి టిక్కెట్టు ఇస్తామని ఏ నాడూ చెప్పని విషయం ఆయనకు తెలియంది కాదని చెప్పారు.
తాను చైర్మన్‌గా ఉన్న క్రమశిక్షణ కమిటీలో సభ్యుడైన బుచ్చిమహేశ్వరరావు ఎంపీ టిక్కెట్టు ఇవ్వకపోవడం, ఎమ్మెల్యే సీటు బాబూరావుకు ఇస్తున్నారని తెలియజేయగా, సమర్థత, స్థానిక పరిస్థితుల ఆధారంగా కేటాయిస్తున్న విషయం తెలియచేసి భవిష్యత్‌లో జగన్‌మోహన్‌రెడ్డి సముచితస్థానం కల్పిస్తారని చెప్పానన్నారు. సరేనన్న బుచ్చిమహేశ్వరరావు ఇంతలోనే అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. ఆయన వెనుక జగన్‌మోహన్‌రెడ్డి అంటే గిట్టని పార్టీల నాయకులు ఉండి అలా మాట్లాడించినట్టుగా ఉందన్నారు.
ఒక్కో నియోజకవర్గంలో నలుగురైదుగురు ఆశావహులు టిక్కెట్లు ఆశిస్తుండగా, అందరికీ సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండదనే విషయం రాజకీయాలతో సంబంధం ఉన్నవారికి తెలియంది కాదన్నారు. ఆ నలుగురైదుగురిలో ఒకరికి కేటాయిస్తే మిగిలినవారు తమ భవిష్యత్ కోల్పోతామనే బాధతో పార్టీపైనా, జగన్‌మోహన్‌రెడ్డిపైనా అవాకులు, చవాకులు పేలడం వారి దిగజారుడుతనాన్ని చెప్పకనే చెపుతోం దని రామకృష్ణంరాజు విమర్శించారు. సమర్థులు, స్థానిక పరిస్థితులు, సామాజిక సమతూకాల ఆధారంగానే సీట్లపై జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పారు.