రాష్ట్రంలో వృద్ధి రేటు ఢమాల్! | Industrial, Agriculture growth very poor in Andhra pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో వృద్ధి రేటు ఢమాల్!

Published Sat, Jan 4 2014 2:20 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Industrial, Agriculture growth very poor in Andhra pradesh

 తిరోగమనంలో వ్యవసాయ, పారిశ్రామిక, మైనింగ్ రంగాలు  ఉద్యమాలు.. రాజకీయ అనిశ్చితి ప్రధాన కారణాలు


 సాక్షి, హైదరాబాద్: ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని, అభివృద్ధిలో దూసుకుపోతోందని, ఇందుకు అవార్డులు వస్తున్నాయంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుండగా, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి భారీగా పడిపోయినట్టు అర్థగణాంక శాఖ రూపొందించిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు ్లస్పష్టం చేస్తున్నాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్ధ సంవత్సరం (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రాష్ట్ర స్థూల ఉత్పత్తి లెక్కలను అర్థగణాంక విభాగం రూపొందించింది. గత ఆర్థిక సంవత్సరం ఆరునెలల వృద్ధి రేటు కన్నా ఈ ఆర్థిక సంవత్సరం  ఆరునెలల వృద్ధి రేటు బాగా తగ్గిపోయింది.

వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో వృద్ధి రేటు గత ఏడాదితో పోల్చి చూస్తే తక్కువగా నమోదైంది. మైనింగ్ రంగం అయితే పూర్తిగా తిరోగమనబాట పట్టింది. మైనింగ్ క్వారీయింగ్ రంగం వృద్ధి రేటు గత ఏడాది 8.93 శాతం ఉండగా ఈ ఏడాది అర్ధసంవత్సరంలో -15.31 శాతంతో తిరోగమనంలో ఉంది. కరువు ప్రభావం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయగా పారిశ్రామిక ప్రగతిపై రాష్ట్ర విభజన ప్రభావం పడిందని, దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరంగా  లేదని ఎప్పుడూ అనిశ్చితే కొనసాగుతోందని, ఇవన్నీ రాష్ర్ట అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది అర్ధ సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 6.50 శాతం ఉండగా, ఈ  ఏడాది అర్ధ సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి 5.56 శాతానికే పరిమితమైంది.

నిర్మాణ కార్యకలాపాలు తగ్గిపోవడంతో ఆ రంగం వృద్ధి రేటు కూడా గతేడాదితో పోల్చితే బాగా తగ్గిపోయింది. గతేడాది అర్ధ సంవత్సరంలో వ్యవసాయరంగం వృద్ధి రేటు 8.77 శాతం ఉండగా ఈ ఏడాది అర్ధ సంవత్సరం వృద్ధి రేటు 6.81 శాతానికి పడిపోయింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో  పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 2.57 శాతం ఉండగా, ఈ ఏడాది ఆరునెలల వృద్ధి రేటు 1.95 శాతానికి పడిపోయింది. సర్వీసు రంగం వృద్ధి రేటు కూడా గతేడాది కన్నా ఈ సంవత్సరంలో తగ్గిపోయింది. గతేడాది సర్వీసు రంగం వృద్ధి రేటు 7,79 శాతం ఉండగా ఈ ఏడాది వృద్ధి రేటు 6.85 శాతానికి పడిపోయింది. వాణిజ్యం, హోటల్స్ అండ్ రెస్టారెంట్, రవాణా, స్టోరేజ్, కమ్యూనికేషన్స్ రంగాల వృద్ధి రేటు గతేడాది 6.72 శాతం ఉండగా ఈ సంవత్సరం వృద్ధి రేటు 5.67 శాతానికి తగ్గిపోయింది. ఆర్థిక, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్, సర్వీసు రంగాల వృద్ధి రేటు గత ఆర్థిక సంవత్సరం 10.22 శాతం ఉండగా ఈ ఏడాది వృద్ధి రేటు 9.03 శాతానికి తగ్గిపోయింది. గత ఆర్థిక సంవత్సరంలో తిరోగమనంలో ఉన్న మాన్యుఫ్యాక్చరింగ్, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా రంగాలు ఈ ఏడాది కొద్దిగా వృద్ధిలోకి వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement