పరిశ్రమల ఏర్పాటుకు వేచిచూస్తున్న పారిశ్రామికవేత్తలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై పారిశ్రామికవేత్తలు వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు. జూన్ 2న ఇరు ప్రాంతాల్లో కొత్త ప్రభుత్వాలు ప్రకటించే పారిశ్రామిక విధానాలు, రాయితీలను పరిశీలించిన తర్వాతే యూనిట్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. రాజకీయ సుస్థిరత కూడా ఉంటుందని, అప్పుడు పరిశ్రమలు సజావుగా సాగుతాయని పారిశ్రామికవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇప్పటికే పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసిన కొన్ని కంపెనీలు కూడా ఇదే ఉద్దేశంతో ముందడుగు వేయడంలేదు. సీమాంధ్రతో పాటు తెలంగాణలో కూడా వెనుకబడిన ప్రాంతాలకు పదేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే, రాయితీలు ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది. వీటితోపాటు కొత్త రాష్ట్రాల్లో నూతన తరహాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు, అదనపు రాయితీలు ప్రకటించే అవకాశం ఉందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ‘అనంతపురం జిల్లాలో పెయింట్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఒక కంపెనీ ముందుకొచ్చింది. భూమితో పాటు ఇతర రాయితీల సదుపాయాల కోసం మా వద్దకు వచ్చింది. అయితే, రాష్ర్ట విభజన అనంతరం వచ్చే కొత్త రాయితీల విధానాన్ని పరిశీలించిన తర్వాతే ముందుకు సాగాలని ఆ కంపెనీ నిర్ణయించుకుంది. ఇదొక్కటే కాదు.. అనేక ఇతర పరిశ్రమలు కూడా యూనిట్ల ఏర్పాటుపై వేచి చూసే ధోరణిలో ఉన్నాయి’ అని పరిశ్రమలశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
జూన్ 2 తర్వాతే చూద్దాం!
Published Thu, Apr 17 2014 2:38 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM
Advertisement
Advertisement