దూళి పీల్చే డస్టర్..కొత్త ఆవిష్కరణ
బ్లాక్ బోర్డును తుడిచే సమయంలో తరగతి గదిలో వ్యాపించే సుద్దముక్కల ధూళితో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బంది పడటం చూస్తూనే ఉంటాం. సుద్దముక్కల తయారీలో వాడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కాల్షియం కార్బొనేట్‌ల వల్ల వీరు ఊపిరి తిత్తులు, కళ్లకు సంబంధించిన వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. దీన్ని నివారించడానికి విజ్ఞాన్ వర్సిటీ ఎంటెక్ విద్యార్థి ఆరాధ్యుల తిరుమల వాసు సరికొత్త డస్టర్‌ను రూపొందించారు. ఈ డస్టర్‌లో రోలర్, దూది వస్త్రం, మూసి ఉన్న సిలిండ్రికల్ చాంబర్, బ్రష్‌లు, బేరింగ్‌లు ఉంటాయి. సిలిండర్‌లో బ్రష్‌లను అమర్చి బేరింగ్‌ల సాయంతో దీనికి రోలర్‌ను బిగించారు.
రోలర్ చుట్టూ దూది వస్త్రాన్ని చుట్టారు. దీనివల్ల బ్లాక్‌బోర్డుపై డస్టర్‌ను ఊడ్చే సమయంలో రోలర్ వృత్తాకారంలో తిరుగుతుంది. దీనికి సమాంతరంగా ఉన్న బ్రష్‌లు డస్ట్‌ను తొలగిస్తూ ఉంటాయి. దీనివల్ల డస్ట్ మొత్తం లోపలే ఉండిపోతుంది. డస్టర్ రూపొందించిన తిరుమల వాసుకు గురువారం విజ్ఞాన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ సి. తంగరాజ్ మాట్లాడుతూ ఈ డస్టర్‌ను రూపొందించడం చాలా తేలికని, ఖరీదు కూడా మామూలు డస్టర్ కంటే తక్కువగా ఉంటుందన్నారు. ఈ డస్టర్‌కు మేధో హక్కుల కోసం దరఖాస్తు చేసినట్లు వీసీ తెలిపారు. వర్సిటీ చైర్మన్ లావు రత్తయ్య, వైస్‌చైర్మన్ శ్రీకృష్ణదేవరాయలు, రెక్టార్ బి.రామ్మూర్తి, రిజిస్ట్రార్ ఎం.ఎస్.రఘునాథన్ తదితరులు వాసుకు అభినందనలు తెలిపారు.