Vigyan University
-
విభిన్న రంగాల్లో పరిశోధనలకు పూనుకోవాలి
చేబ్రోలు: ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ అవకాశాలు కలిగిన దేశమేదైనా ఉందంటే అది భారతదేశమేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ వర్సిటీలో సోమవారం 11వ స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని అనంత్ టెక్నాలజీస్ ఫౌండర్ డాక్టర్ పావులూరి సుబ్బారావు, విమ్టా ల్యాబ్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ ఎస్పీ వాసిరెడ్డి, ఇండియన్ చెస్ ప్లేయర్ కోనేరు హంపిలకు గౌరవ డాక్టరేట్లను, 1,820 మందికి డిగ్రీలు, మరికొంతమందికి గోల్డ్ మెడల్స్, అవార్డులను అందజేశారు. నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు మాత్రమే కాకుండా కొత్త మెటీరియల్స్, రేర్ మినరల్స్, మెటీరియల్ సైన్స్, డ్రోన్ టెక్నాలజీ వంటి రంగాల్లో పరిశోధనలకు పూనుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇప్పటికే ఇస్రో చంద్రయాన్–3 ద్వారా దక్షిణ ధృవం మీదకు వెళ్లగలిగామని, 2040 నాటికి మానవ రహిత ప్రయోగానికి పూనుకోవాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. 2035 లోపు ‘భారత స్పేస్ స్టేషన్’ను పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాలని ఇస్రోకు ప్రధాని మోదీ సూచించారని తెలిపారు. చంద్రయాన్–3 విజయాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో 10 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు చంద్రయాన్ నమూనాను బహుమతిగా అందజేశారు. రాష్ట్ర మంత్రి బుగ్గన మాట్లాడుతూ విద్యార్థుల మేధోపరమైన, విద్యాపరమైన అన్వేషణను వారి వృత్తిపరమైన విజయాలను కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులతో జరుపుకోవడానికి ఇది చిరస్మరణీయ వేదిక అని అన్నారు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వీసీ నాగభూషణ్ పాల్గొన్నారు. -
విజ్ఞాన్ వర్సిటీ ఆన్లైన్ పరీక్ష ఫలితాలు విడుదల
చేబ్రోలు (పొన్నూరు): గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీ నిర్వహించిన బీటెక్ చివరి సంవత్సరం రెండో సెమిస్టర్ ఆన్లైన్ పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేసినట్లు వర్సిటీ వీసీ ఎంవైఎస్ ప్రసాద్ తెలిపారు. విద్యార్థులకు ఆన్లైన్లో రియల్ టైం వీడియో మానిటరింగ్ సిస్టంతో పరీక్షలు నిర్వహించామని, వారం రోజుల్లోనే ఫలితాలను వెల్లడించామని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య, రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్, డీన్ పీఎంవీ రావు తదితరులు పాల్గొన్నారు. -
‘సాక్షి’ జేఈఈకి భారీ స్పందన
సాక్షి, హైదరాబాద్: తెలుగు విద్యార్థుల కోసం ‘సాక్షి మీడియా గ్రూప్, నారాయణ విద్యా సంస్థలు’ సంయుక్తంగా నిర్వహించిన జేఈఈ మెయిన్ మాక్ టెస్ట్‌కు విశేష స్పందన లభించింది. ఆదివారం ఉదయం 9.30 నుంచి 12.30 వరకు 90(హైదరాబాద్‌లో 40, ఏపీలో 50) కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు తెలంగాణ నుంచి 10 వేల మంది, ఏపీ నుంచి మరో 10 వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. పోటీ పరీక్షల నిర్వహణ తీరు, ప్రశ్నపత్రం వంటి అంశాలపై విద్యార్థులు అవగాహన పొందారు. ప్రశ్నపత్రాన్ని సాక్షి విద్యా విభాగం తయారు చేసింది. పరీక్ష ‘కీ’ సోమవారం ఉదయం 11 గంటలకు ‘సాక్షి ఎడ్యుకేషన్.కామ్’ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 15న మాక్ ఎంసెట్(ఇంజనీరింగ్) ఆన్లైన్లో జరుగుతుంది. 22న మాక్ నీట్ ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలకు విజ్ఞాన్ యూనివర్సిటీ కో స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లపూడి గ్రామంలో విజ్ఞాన్ వర్సిటీ వద్ద శుక్రవారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని ఓ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుడు ప్రకాశం జిల్లా మార్టూరుకు చెందిన గొర్రెల వ్యాపారిగా పోలీసులు గుర్తించారు. -
దూళి పీల్చే డస్టర్..కొత్త ఆవిష్కరణ
బ్లాక్ బోర్డును తుడిచే సమయంలో తరగతి గదిలో వ్యాపించే సుద్దముక్కల ధూళితో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బంది పడటం చూస్తూనే ఉంటాం. సుద్దముక్కల తయారీలో వాడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కాల్షియం కార్బొనేట్ల వల్ల వీరు ఊపిరి తిత్తులు, కళ్లకు సంబంధించిన వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. దీన్ని నివారించడానికి విజ్ఞాన్ వర్సిటీ ఎంటెక్ విద్యార్థి ఆరాధ్యుల తిరుమల వాసు సరికొత్త డస్టర్‌ను రూపొందించారు. ఈ డస్టర్‌లో రోలర్, దూది వస్త్రం, మూసి ఉన్న సిలిండ్రికల్ చాంబర్, బ్రష్‌లు, బేరింగ్లు ఉంటాయి. సిలిండర్‌లో బ్రష్‌లను అమర్చి బేరింగ్ల సాయంతో దీనికి రోలర్‌ను బిగించారు. రోలర్ చుట్టూ దూది వస్త్రాన్ని చుట్టారు. దీనివల్ల బ్లాక్‌బోర్డుపై డస్టర్‌ను ఊడ్చే సమయంలో రోలర్ వృత్తాకారంలో తిరుగుతుంది. దీనికి సమాంతరంగా ఉన్న బ్రష్‌లు డస్ట్‌ను తొలగిస్తూ ఉంటాయి. దీనివల్ల డస్ట్ మొత్తం లోపలే ఉండిపోతుంది. డస్టర్ రూపొందించిన తిరుమల వాసుకు గురువారం విజ్ఞాన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ సి. తంగరాజ్ మాట్లాడుతూ ఈ డస్టర్‌ను రూపొందించడం చాలా తేలికని, ఖరీదు కూడా మామూలు డస్టర్ కంటే తక్కువగా ఉంటుందన్నారు. ఈ డస్టర్‌కు మేధో హక్కుల కోసం దరఖాస్తు చేసినట్లు వీసీ తెలిపారు. వర్సిటీ చైర్మన్ లావు రత్తయ్య, వైస్‌చైర్మన్ శ్రీకృష్ణదేవరాయలు, రెక్టార్ బి.రామ్మూర్తి, రిజిస్ట్రార్ ఎం.ఎస్.రఘునాథన్ తదితరులు వాసుకు అభినందనలు తెలిపారు. -
‘సాక్షి స్పెల్‌బీ’ తెలంగాణ విజేతలు వీరే
♦ నాలుగు కేటగిరీల్లో విజేతలకు బహుమతులు ♦ తెలంగాణ చాంప్ చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్ ♦ విజ్ఞాన్ వర్సిటీ సహకారంతో ‘సాక్షి ఇండియా స్పెల్‌బీ-2015’ సాక్షి, హైదరాబాద్: సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించిన ‘సాక్షి ఇండియా స్పెల్‌బీ-2015’ తెలంగాణ ఫైనల్ పోటీల విజేతలను ఆదివారం ప్రకటించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ సహకారంతో ఈ పోటీలను సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ చాంపియన్ స్కూల్‌గా కొండాపూర్ చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్ నిలిచింది. ఇక నాలుగు కేటగిరీల్లో నిర్వహించిన స్పెల్‌బీ ఫైనల్స్ విజేతలను నిర్వాహకులు ప్రకటించారు. స్వర్ణ పతకం విజేతకు రూ.25 వేలు, రజత పతక విజేతకు రూ.15 వేలు, కాంస్య పతక విజేతకు రూ.10 వేలు బహుమతిగా అందజేశారు. ప్రతి కేటగిరీ నుంచి 20 మంది పోటీ పడ్డారు. తొలి మూడు స్థానాలు దక్కించు కున్న వారికి వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు అందించారు. ‘సాక్షి’ మీడియా గ్రూప్ డెరైక్టర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) రాణిరెడ్డి, గుంటూరు విజ్ఞాన్ వర్సిటీ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యుడు కృష్ణా లావు, ‘సాక్షి’ దినపత్రిక జీఎం (అడ్వర్టైజ్మెంట్) రమణకుమార్ విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులందరికీ మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. కేటగిరీ 1 విజేతలు.. స్వర్ణ పతకం: శ్రేయస్‌రెడ్డి ముప్పన, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, బంజారాహిల్స్ హైదరాబాద్ రజత పతకం: ఆరిష్ యేలూరి, శ్రీఅరబిందో ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్ కాంస్య పతకం: మయుక్ జయసింహ, గీతాం జలి దేవ్‌శాల, బాలంరాయ్, హైదరాబాద్ కేటగిరీ 2 విజేతలు.. స్వర్ణ పతకం: డి.వెగా, అగాఖాన్ అకాడమీస్, హైదరాబాద్ రజత పతకం: పహి శ్రీవాస్తవ, చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్ కాంస్య పతకం: అరిత్రో రాయ్, చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్ కేటగిరీ 3 విజేతలు.. స్వర్ణ పతకం: ఇషా సంతోష్, చిరేక్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్ రజత పతకం: సిద్ధార్థ్ వీరపనేని, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్ కాంస్య పతకం: వందనా వారియర్, భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ కేటగిరీ 4 విజేతలు.. స్వర్ణ పతకం: సర్వజ్ఞ పొట్టూరి, చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్ రజత పతకం: మాథ్యూ పీటర్ థారప్పీల్, వికాస్ ద కాన్సెప్ట్ స్కూల్, బాచుపల్లి, హైదరాబాద్ కాంస్య పతకం: ఆకాశ్ సింగిరికొండ, చిరక్ ఇంటర్నేషనల్ స్కూల్, హైదరాబాద్ -
సెలవొస్తే పొలం.. చదువుల్లో సృజనం
అరచేయంత సెల్‌ఫోన్ అతని దగ్గర లేకపోవచ్చు.. ఆకాన్నంటే ఆలోచనలు.. అవధుల్లేని ఆత్మవిశ్వాసం ఉంది. లక్షలు విలువచేసే బైక్ అందనిదే కావచ్చు.. లక్ష్యం చేరుకోవాలనే సంకల్పం సొంతం.. అందుకు సృజన తోడయింది. ఇంకేముంది.. కొత్త ఆలోచనలు తలుపుతట్టాయి. నూతన ఆవిష్కరణలు వెలుగుచూశాయి. బీటెక్ చదివి.. మరోవైపు పొలం పనులకు వెళుతూనే మూడు నవ్య ఆవిష్క రణలకు శ్రీకారం చుట్టిన ఈ తిరుమల వాసు నేటి యువతరానికి స్ఫూర్తి.. - పొలం పనులకు వెళుతూనే బీటెక్‌లో రెండు డిగ్రీలు - నవ్య ఆవిష్కరణలకు శ్రీకారం - అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితం - పేటెంటుకు దర ఖాస్తు సన్నాహాల్లో యువపరిశోధకుడు తెనాలి : ఆ యువపరిశోధకుడి పేరు తిరుమలవాసు. ఊరు చేబ్రోలు మండలం సుద్దపల్లి. వ్యవసాయదారులైన ఆరాధ్యుల వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి కొడుకు. ఇద్దరు చెల్లెళ్లున్నారు. టెన్త్, ఇంటర్లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణుడై విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ చేరారు. సుద్దపల్లి నుంచి రైల్వే ట్రాకు వెంట, క్వారీగోతుల్లో రోజూ 3 కి.మీ నడిచి యూనివర్సిటీకి వెళ్లివస్తుండేవారు. మెకానికల్, ఈసీఈలో రెండు డిగ్రీలు గత నెలలో పూర్తిచేశారు. తన మేధస్సుతో మూడు నవకల్పనలను కనుగొన్నారు. ఆ పరిశోధనాంశాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. మన చదువుల్లో బ్లాక్‌బోర్డు, చాక్‌పీస్ స్థానం చెక్కుచెదరలేదు. ఫ్యాకల్టీలు పాఠ్యాంశాలను చాక్‌పీస్‌తో బోర్డుపై రాసి, డస్టర్‌తో తుడిచేస్తుంటారు. చుట్టుపక్కలకు వెద్దజల్లే చాక్‌పీస్ రేణువులు ఆరోగ్యసమస్యలను తెస్తాయని ఆలోచించం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కాల్షియం కార్బొనేట్‌తో మిశ్రమ చాక్‌పీస్‌ల రేణువులు గాలిద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ సమస్యలను తెస్తాయి. దీనిని గుర్తించిన వాసు, ‘కాంటెంపరరీ డస్టర్’ను రూపొందించారు. ఈ సరికొత్త డస్టర్‌తో చాక్‌పీస్ రేణువులు రోలింగ్ మెకానిజమ్‌తో ఇందులోని చాంబర్లోకి వెళతాయి. తర్వాత క్యాప్ తీసి బయట పారబోసే వెసులుబాటుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్’లో గత ఏప్రిల్‌లో దీనిని ప్రచురించారు. పరిశ్రమల్లో వినియోగించే సంప్రదాయ కంబూష్టన్ ఇంజిన్స్‌కు ప్రత్యామ్నాయంగా మాగ్నెటిక్ ఫ్లక్స్ బేస్డ్ మెకానికల్ పవర్ జనరేటర్, తిరుమలవాసు మరో ఆవిష్కరణ. మధ్యలో పర్మనెంట్ మాగ్నెట్. చుట్టూ ఎనిమిది ఫిస్టన్స్తో తిరిగే క్రాంక్ సాఫ్ట్స్తో రూపొందించిన మాగ్నెటిక్ జనరేటర్ అత్యధిక శక్తినిస్తుంది. ఇంధనం, నిర్వహణ వ్యయం, కాలుష్యం బాగా తగ్గుతుందని చెప్పారు. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ మెకానికల్’ ఈ పరిశోధనను ప్రచురించింది. వీటిపై తాను పేటెంటుకు దరఖాస్తు చేస్తున్నట్టు చెప్పారు. వ్యర్ధమైన కొబ్బరి చిప్పల పొడి, హైడెన్సిటి పాలిథిలిన్, కాపర్ నానో పార్టికిల్స్ కలిపి శక్తివంతమైన ‘కాంపోజిట్’లు చేశారు. ఎలక్ట్రికల్, ఆటోమొబైల్‌లో ఇంటీరియర్ పార్టులకు, కంప్యూటర్ మదర్బోర్డులకు వీటిని వాడొచ్చు. దీనిని ‘జర్నల్ ఆఫ్ మెటీరియల్ సైన్స్’లో ప్రచురించారు. పూణే, చెన్నై, బాపట్లలో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణ చేసిన వాసు, పూణేలో బంగారు పతకాన్ని గెల్చుకున్నారు. సెలవు రోజుల్లో పొలం పనులకు వెళుతుండే తిరుమలవాసు ఎంఎస్, పీహెచ్డీ చేసి పర్యావరణ అనుకూల పరిశోధనలు చేయాలనే కోరికను వెల్లడించారు. మధ్యతరగతికి చెందిన తనకు ‘విజ్ఞాన్’ యాజమాన్యం ప్రోత్సాహం, వైస్‌ఛాన్సలర్ తంగరాజన్, ప్రిన్సిపల్ మధుసూదనరావు, ఫ్యాకల్టీలు చావలి మూర్తియాదవ్, ఎం.రామకృష్ణ, టి.అనూప్‌కుమార్, బి.నాగేశ్వరరావు, రామ్ణారాయణ్ చౌహాన్‌ల సహకారం ఉందన్నారు. -
కేంబ్రిడ్జి నుంచి విజ్ఞాన్ వర్సిటీకి ఉత్తమ అవార్డు
చేబ్రోలు: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి ఉత్తమ అవార్డు దక్కిందని వర్సిటీ ఎస్ అండ్ ెహ చ్(సైన్స్ అండ్ హ్యుమనిటీస్) విభాగాధిపతి ఎన్.శ్రీనివాసులు తెలిపారు. సోమవారం యూనివర్సిటీలోని తన చాంబర్లో ఆయన మాట్లాడుతూ యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ తమ ‘ఉత్తమ భాగస్వామ్య విద్యాసంస్థ’గా విజ్ఞాన్ యూనివర్సిటీని ఎంపిక చేసిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థులు ఆంగ్ల భాషా నైపుణ్యం పెంపొందించుకోవడంలో విజ్ఞాన్ అత్యంత ప్రభావం చూపిందని, అందుకే ఈ అవార్డుకు ఎంపిక చేసిందని పేర్కొన్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ కో ఆర్డినేటర్లకు హైదరాబాద్‌లో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారని, తమకు అవార్డు ప్రదానం చేశారని పేర్కొన్నారు. ఆంగ్ల అధ్యాపకురాలు శారద, ఎస్ అండ్ హెచ్ విభాగ అధ్యాపకుడు కె.రవీంద్రబాబు ఈ అవార్డును స్వీకరించారని వివరించారు. అవార్డుకు ఎంపికయ్యేందుకు కృషి చేసిన సిబ్బందికి విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, యూనివర్సిటీ వీసీ సి.తంగరాజన్ తదితరులు అభినందనలు తెలిపారు. -
విజ్ఞాన్ వర్సిటీ వీసీగా తంగరాజ్
గుంటూరు: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్‌గా డాక్టర్ సి.తంగరాజ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా గుంటూరులోని ఓ హోటల్లో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య నూతన వీసీని పరిచయం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రత్తయ్య మాట్లాడుతూ ఉన్నత విద్యారంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ తంగరాజ్ సేవలు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమన్నారు. తమిళనాడులోని అన్నామలై విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్‌గా ఆరేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించిన తంగరాజ్ భారతదేశ శాస్త్ర, సాంకేతిక విభాగం(డీఎస్టీ)లోని టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్ కాస్టింగ్ అండ్ అసెస్మెంట్ కౌన్సిల్ కోర్ ప్రాజెక్టుకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారని వివరించారు. విద్యారంగంలో మూడు దశాబ్దాల విశేష అనుభవం గడించిన తంగరాజ్ నాలుగు అంతర్జాతీయ ఫెలోషిప్స్ సాధించారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలతో పాటు రెండు ప్రైవేటు, మూడు విదేశీ వర్సిటీలలో బోధనానుభవం కలిగి ఉన్నారని చెప్పారు.