సెలవొస్తే పొలం.. చదువుల్లో సృజనం
అరచేయంత సెల్‌ఫోన్ అతని దగ్గర లేకపోవచ్చు.. ఆకాన్నంటే ఆలోచనలు.. అవధుల్లేని ఆత్మవిశ్వాసం ఉంది. లక్షలు విలువచేసే బైక్ అందనిదే కావచ్చు.. లక్ష్యం చేరుకోవాలనే సంకల్పం సొంతం.. అందుకు సృజన తోడయింది. ఇంకేముంది.. కొత్త ఆలోచనలు తలుపుతట్టాయి. నూతన ఆవిష్కరణలు వెలుగుచూశాయి. బీటెక్ చదివి.. మరోవైపు పొలం పనులకు వెళుతూనే మూడు నవ్య ఆవిష్క రణలకు శ్రీకారం చుట్టిన ఈ తిరుమల వాసు నేటి యువతరానికి స్ఫూర్తి..
- పొలం పనులకు వెళుతూనే బీటెక్‌లో రెండు డిగ్రీలు
- నవ్య ఆవిష్కరణలకు శ్రీకారం
- అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితం
- పేటెంటుకు దర ఖాస్తు సన్నాహాల్లో యువపరిశోధకుడు
తెనాలి : ఆ యువపరిశోధకుడి పేరు తిరుమలవాసు. ఊరు చేబ్రోలు మండలం సుద్దపల్లి. వ్యవసాయదారులైన ఆరాధ్యుల వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి కొడుకు. ఇద్దరు చెల్లెళ్లున్నారు. టెన్త్, ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణుడై విజ్ఞాన్ యూనివర్సిటీలో బీటెక్ చేరారు. సుద్దపల్లి నుంచి రైల్వే ట్రాకు వెంట, క్వారీగోతుల్లో రోజూ 3 కి.మీ నడిచి యూనివర్సిటీకి వెళ్లివస్తుండేవారు. మెకానికల్, ఈసీఈలో రెండు డిగ్రీలు గత నెలలో పూర్తిచేశారు. తన మేధస్సుతో మూడు నవకల్పనలను కనుగొన్నారు. ఆ పరిశోధనాంశాలు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.
మన చదువుల్లో బ్లాక్‌బోర్డు, చాక్‌పీస్ స్థానం చెక్కుచెదరలేదు. ఫ్యాకల్టీలు పాఠ్యాంశాలను చాక్‌పీస్‌తో బోర్డుపై రాసి, డస్టర్‌తో తుడిచేస్తుంటారు. చుట్టుపక్కలకు వెద్దజల్లే చాక్‌పీస్ రేణువులు ఆరోగ్యసమస్యలను తెస్తాయని ఆలోచించం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కాల్షియం కార్బొనేట్‌తో మిశ్రమ చాక్‌పీస్‌ల రేణువులు గాలిద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి శ్వాసకోశ సమస్యలను తెస్తాయి. దీనిని గుర్తించిన వాసు, ‘కాంటెంపరరీ డస్టర్’ను రూపొందించారు. ఈ సరికొత్త డస్టర్‌తో చాక్‌పీస్ రేణువులు రోలింగ్ మెకానిజమ్‌తో ఇందులోని చాంబర్లోకి వెళతాయి. తర్వాత క్యాప్ తీసి బయట పారబోసే వెసులుబాటుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెటీరియల్ సైన్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్’లో గత ఏప్రిల్‌లో దీనిని ప్రచురించారు.
పరిశ్రమల్లో వినియోగించే సంప్రదాయ కంబూష్టన్ ఇంజిన్స్‌కు ప్రత్యామ్నాయంగా మాగ్నెటిక్ ఫ్లక్స్ బేస్డ్ మెకానికల్ పవర్ జనరేటర్, తిరుమలవాసు మరో ఆవిష్కరణ. మధ్యలో పర్మనెంట్ మాగ్నెట్. చుట్టూ ఎనిమిది ఫిస్టన్స్‌తో తిరిగే క్రాంక్ సాఫ్ట్స్‌తో రూపొందించిన మాగ్నెటిక్ జనరేటర్ అత్యధిక శక్తినిస్తుంది. ఇంధనం, నిర్వహణ వ్యయం, కాలుష్యం బాగా తగ్గుతుందని చెప్పారు. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ మెకానికల్’ ఈ పరిశోధనను ప్రచురించింది. వీటిపై తాను పేటెంటుకు దరఖాస్తు చేస్తున్నట్టు చెప్పారు. వ్యర్ధమైన కొబ్బరి చిప్పల పొడి, హైడెన్సిటి పాలిథిలిన్, కాపర్ నానో పార్టికిల్స్ కలిపి శక్తివంతమైన ‘కాంపోజిట్’లు చేశారు. ఎలక్ట్రికల్, ఆటోమొబైల్‌లో ఇంటీరియర్ పార్టులకు, కంప్యూటర్ మదర్‌బోర్డులకు వీటిని వాడొచ్చు. దీనిని ‘జర్నల్ ఆఫ్ మెటీరియల్ సైన్స్’లో ప్రచురించారు. పూణే, చెన్నై, బాపట్లలో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణ చేసిన వాసు, పూణేలో బంగారు పతకాన్ని గెల్చుకున్నారు.
సెలవు రోజుల్లో పొలం పనులకు వెళుతుండే తిరుమలవాసు ఎంఎస్, పీహెచ్‌డీ చేసి పర్యావరణ అనుకూల పరిశోధనలు చేయాలనే కోరికను వెల్లడించారు. మధ్యతరగతికి చెందిన తనకు ‘విజ్ఞాన్’ యాజమాన్యం ప్రోత్సాహం, వైస్‌ఛాన్సలర్ తంగరాజన్, ప్రిన్సిపల్ మధుసూదనరావు, ఫ్యాకల్టీలు చావలి మూర్తియాదవ్, ఎం.రామకృష్ణ, టి.అనూప్‌కుమార్, బి.నాగేశ్వరరావు, రామ్‌ణారాయణ్ చౌహాన్‌ల సహకారం ఉందన్నారు.