ఇదేమి గ్రామస్వరాజ్యం ?
► పేరుకే పదవి ... పెత్తనం టీడీపీ నేతదే
► గిరిజన సర్పంచ్‌కు అన్యాయం
► నేటికీ కొనసాగుతున్న వివక్ష
నిమ్నజాతికి ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వావలంబన కోసం రూపొందించిన చట్టాన్ని కూడా పెత్తందారు చుట్టంగా మార్చుకున్నారు. అతడిని ఎదిరించే సాహసం చేయలేక దీనస్థితిలో ఉన్న ఓ గిరిజన మహిళా ప్రజాప్రతినిధి దయనీయ గాథ అందుకు నిదర్శనమవుతోంది.
రేణిగుంట: గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యంలో ఓ సర్పంచ్ అధికారాన్ని మరో నాయకుడు చెలాయిస్తున్నారు. రిజర్వేషన్ కేటగిరిలో గెలిచిన గిరిజన మహిళ పేరుకు సర్పంచ్ అయినా పెత్తనం మాత్రం ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేత చెలాయిస్తున్నాడు. రేణిగుంట మండలంలోని గురవరాజుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన శ్రీను భార్య లక్ష్మమ్మ 2013 లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలు పొందారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆమె ఆ నాయకుని కన్నుసన్నల్లోనే రబ్బ రు స్టాంపు పాత్రను పోషిస్తోంది. లక్ష్మమ్మ సర్పంచ్ అయిన ఏడాదికే భర్త శ్రీను మృతి చెందడంతో రాజం పేట సమీపంలో ఉన్న బంధువుల ఇంటికి చేరుకుని అక్కడే జీవనం సాగిస్తున్నారు.
గ్రామంలో, మండల కార్యాలయంలో ఏవైనా సమావేశాలుంటే వచ్చి వెళుతున్నారు. గ్రామంలో పంచాయతీకి నిధులు ఎంత వస్తున్నాయో ఆమెకు సమాచారం ఉండదు... ఏయే అభివృద్ధి పనులు చేస్తున్నారో తెలపరు. సర్పంచ్ గౌరవ వేతనం కూడా ఆ నాయకుడే తీసుకుంటూ ఆమె కుటుం బ అవసరాలకు అన్నట్లు నెలనెలా రూ.5 వేలు ఇస్తున్నా డు. సర్పంచ్ ఎవరని గ్రామంలో ఎవరైనా అడిగితే అత ని వైపు వేలు చూపుతున్న పరిస్థితి. సర్పంచ్ లక్ష్మమ్మ కదా అంటే ... ఆశ్చర్యంగా చూస్తారు. గ్రామంలో నిధులు ఏ మేరకు సద్వినియోగమవుతున్నాయో ఆమెకు తెలియదు.
సొంత గూడులేని దౌర్భాగ్యం
సొంత ఇల్లు కూడా లేని దయనీయ స్థితి లక్ష్మమ్మది. ఆమె కు కాలనీలో పక్కాగృహం కట్టించేందుకు టీడీపీ నేత హా మీ ఇచ్చినా, అది ఇప్పటికీ పునాదులకే పరిమితమైంది. సొంత ఇల్లు ఉంటే అంత దూరం వెళ్లి బతకాల్సిన ఖర్మ ఏ మిటని ఆమె దీనంగా ప్రశ్నిస్తున్నారు. అనధికారిక సర్పంచ్‌గా గ్రామపాలన సాగిస్తున్న టీడీపీ నేత నిధులు కాజేసే అ వకాశం ఉంది. ముందుగానే సర్పంచ్ వద్ద చెక్ పుస్తకాలపై సంతకాలు తీసుకుని బిల్లలు మంజూరైనప్పుడు డ్రా చేసుకుంటారనే ఆరోపణ ఉంది. భవిష్యత్తులో ఏవైనా అవకతవకలు జరిగితే మాత్రం సర్పంచ్ లక్ష్మమ్మపైనే చర్యలు తీసుకునే అధికార యంత్రాంగం మాత్రం ప్రస్తుతంఆమెకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదు.