అనంతపురం టౌన్ : అనంతపురం మునిసిపాలిటీకీ కార్పొరేషన్ హోదా లభించి తొమ్మిదేళ్లు దాటినా, శివారు పంచాయతీల పరిధిలోని కాలనీలను విలీనం చేయాల్సిన ప్రక్రియకు నేటికీ మొక్షం లభించలేదు. ఈ విషయంలో అనంతపురం కార్పొరేషన్‌పై గత ప్రభుత్వమే కాదు ఇప్పటి ప్రభుత్వం కూడా చిన్న చూపు చూస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మొదలు రాష్ట్రంలోని చిన్నా, పెద్ద మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు కొత్తగా ఏర్పాటైన పురపాలకాలలో పరిసర పంచాయతీలను గత ప్రభుత్వ హయాంలోనే విలీనం చేసే ప్రక్రియ చేపట్టారు.
అనంత కార్పొరేషన్‌లో మాత్రం ఆ పని చేపట్టలేదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈ ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తోంది. జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఉన్నారు. వీరు కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ, పాలకవర్గం కానీ పంచాయతీల విలీనం గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించం లేదు. పంచాయతీలను విలీనం చేయడం ద్వారా కార్పొరేషన్‌కు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సర్ చార్జీ రూపంలో ఏటా రూ.5 కోట్లకు పైగానే ఆదాయం సమకూరుతుంది.
నగర శివారులోని పంచాయతీలకు చెందిన పలు కాలనీలు ఇప్పటికే నగర పాలక సంస్థ స్థాయిలో సౌకర్యాలు పొందుతున్నాయి. పంచాయతీలు విలీనం చేయడం ద్వారా అవన్నీ పూర్తి స్థాయిలో కార్పొరేషన్ ఆధినంలోకి వస్తాయి. తద్వారా సంస్థకు ఆస్తిపన్ను రూపంలో అదనపు ఆదాయం చేరుతుంది. ఆ నిధులతో విలీన కాలనీలకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించేందుకు అవకాశం లభిస్తుంది. ప్రధానంగా తాగునీటి సమస్యను పరిష్కరించవచ్చు.
నీటి యుద్ధాలు తప్పుతాయి
నగరంలోకి పంచాయతీలను విలీనం చేస్తే తాగు నీటి సమస్యలు ఓ కొలిక్కి వస్తారుు. అనంతపురం నగరానికి పీఏబీఆర్ ప్రాజెక్టు ద్వారా నీరు సంపూర్ణ స్థాయిలో అందుతోంది. చుట్టుపక్కల ఉన్న నారాయణపురం, రుద్రంపేట, కక్కలపల్లి, కక్కలపల్లి కాలనీ, రాజీవ్ కాలనీ, అనంతపురం రూరల్ పంచాయతీల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది.
కొద్ది రోజుల క్రితం కార్పొరేషన్ నీటిని అనధికారికంగా మళ్లించుకునేందుకు నారాయణపురం గ్రామస్తులు సిద్ధపడ్డారు. ఆ క్రమంలో పెద్ద ఎత్తున్న గొడవలు చోటు చేసుకున్నాయి. ఆ క్రమంలో రాళ్లు రువ్వడంతో పోలీసు వాహనం అద్దం పగలడంతో పాటు మహిళ హోంగార్డ్‌కు గాయాలయ్యాయి. దాదాపు పది మందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. పంచాయతీలను విలీనం చేస్తే ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ఏటా రూ.5 కోట్లు ఆదాయం
కార్పొరేషన్ పరిధిలో భూములు, ఇళ్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి జరిగే అన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించి 2 శాతం సర్‌చార్జిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నగర పాలక సంస్థ తరఫున ప్రభుత్వ ఖాతాలో జమ చేస్తుంది. ఏటా కోటి రూపాయల వరకు ప్రభుత్వానికి ఇలా జమవుతోంది. ప్రస్తుతం పంచాయతీల పరిధిలోనే అధికంగా భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వీటిని కార్పొరేషన్‌లో విలీనం చేస్తే ఆయా పంచాయతీల పరిధిలో జరిగే అన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించి 2 శాతం సర్‌చార్జి రూపంలో ఏటా రూ.5 కోట్లకు పైగానే సంస్థ నుంచి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.
విలీనమయ్యే పంచాయితిలు ఇవే...
నగర పాలక సంస్థలోకి బుక్కరాయసముద్రం, రాప్తాడు, కక్కలపల్లి, పాపంపేట, నారాయణపురం, అనంతపురం రూరల్ (ఉత్తర, దక్షిణ పంచాయతీల పరిధిలోని కొంత భాగం విలీనం చేసేలా అధికారులు ఏడేళ్ల క్రితమే ప్రతిపాదనలు తయారు చేసి నివేదికను ప్రభుత్వానికి పంపించారు.)
రాజీవ్ పంచాయతీ
కేంద్రీయ ఉద్యానవం, తడకలేరు, మహదేవనగర్, రాజీవ్ కాలనీ, భగత్‌సింగ్ కాలనీ, పొట్టిశ్రీరాములు కాలనీ, ముత్యాలమ్మకాలనీ, రిక్షాకాలనీ, ప్రియాంక నగర్, గుత్తిరోడ్డులోని పరిశ్రమలు.
అనంతపురం రూరల్ పంచాయతీ
లెనిన్‌నగర్, ఎన్టీఆర్ నగర్, రామకృష్ణనగర్, ఎల్‌ఐసీ కాలనీ, పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలోని ప్రొఫెసర్ కాలనీ, భైరవనగర్, సంఘమిత్ర నగర్ ఎక్స్‌టెన్షన్, అయ్యప్ప స్వామి గుడి, బైపాస్ రోడ్డు వద్ద ఉన్న మెటల్ క్రషర్, జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాల, దాని సమీపంలోని మెడికల్ కళాశాలలు.
నారాయణపురం పంచాయతి
ఎ.నారాయణపురం, సుఖదేవనగర్, అల్లూరి సీతారామరాజు నగర్, రాయల్‌నగర్, స్టాలిన్ నగర్, తపోవనం, సోమనాథ్‌నగర్ ఎక్స్‌టెన్షన్, బళ్లారి రోడ్డులోని ఎపి లై టింగ్ వరకు. పాంపపేట, విద్యారణ్యనగర్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, బసవతారక నగర్, జొన్నావీరయ్య కాలనీ, కంబైండ్ ఆటో సర్వీస్.
కక్కలపల్లి కాలనీ పంచాయతి
నారాయణరెడ్డికాలనీ, సీపీఐ కొట్టాలు, సియాన్‌నగర్, నందమూరినగర్, పిల్లిగుండ్లకాలనీ.
కక్కలపల్లి పంచాయతి
సంగమేశ్వర పిక్నిక్ సెంటర్, సహార టౌన్‌షిప్‌లోని కొంత భాగం, బైపాస్‌రోడ్డు.
రుద్రంపేట పంచాయతి
రుద్రంపేట గ్రామం, శ్రీనగర్‌కాలనీ ఎక్స్‌టెన్షన్.
రాప్తాడు పంచాయతి : సహార టౌన్‌షిప్‌లో కొంత భాగం, బైపాస్‌రోడ్డు, ప్రభాకర్ చౌదరి కాలనీ, ఈనాడు ఎడిషన్ కార్యాలయం, వాటర్ వర్క్స్, ఆర్‌డీటీ స్టేడియం, బెంగుళూరు బైపాస్ రోడ్డు, ఆర్‌డీటీ బ్రెయిలీ రెసిడెన్సియల్ పాఠశాల, సెయింట్ విన్సెంట్ డీ పాల్ పాఠశాల.
ఉప్పరపల్లి పంచాయతి
ఆర్‌డీటీ స్టేడియం, రైస్‌మిల్, ఆటవీ శాఖకు చెందిన నర్సరీ.
బుక్కరాయసముద్రం పంచాయతి సమ్మర్ స్టోరేజి ట్యాంక్, విరూపాక్షనగర్, గుత్తిరోడ్డులో తడకలేరు వరకు. ప్రసన్నాయపల్లిగ్రామం, ఎల్‌ఆర్‌జీ స్కూల్, చిన్మయనగర్, కళాకారుల కాలనీ, పోస్టల్ కాలనీ.
ఇంకెన్నాళ్లో..
Published Wed, Jan 14 2015 2:13 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement