అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ఇన్‌పుట్‌సబ్సిడీ (పెట్టుబడి రాయితీ) పరిహారం కోసం రైతుల కన్నా బ్యాంకర్లు తొందర పడుతున్నారు. పరిహారం కోసం వ్యవసాయశాఖ కార్యాలయం వద్ద రెండు మూడు రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం అయితే మరీ ఎక్కువగా హడావుడి చేశారు. వ్యవసాయశాఖ జేడీ ని కలిసేందుకు కార్యాలయం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూశారు. బ్యాంకర్లకు ఇంత తొందరెందుకని ఆరాతీస్తే... ఆర్థిక సంవత్సరం (2013-14) మూడో త్రైమాసికం మంగళవారంతో ముగియనుందని తెలిసింది.
2011, 2012 సంవత్సరాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నేపథ్యంలో పరిహారంను బ్యాంకుల్లో జమ చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వచ్చిన పరిహారాన్ని మంగళవారం సాయంత్రంలోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకుంటే బ్యాంకుల లక్ష్యాలు సులభంగా చేరుకుంటారని తెలిపారు. మూడో త్రైమాసికంలో మంచి ఫలితాలు సాధించారని పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా ఉంటాయన్నారు.
ట్రెజరీకి బిల్లులు సమర్పించాలంటే డ్రాయింగ్ ఆఫీసర్‌గా వ్యవసాయ శాఖ ఏఓ (అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్) సంతకం చేయాల్సి ఉంటుంది. ఆయన గత శనివారం నుంచి సెలవులో ఉండటంతో వ్యవసాయాధికారులు, బ్యాంకర్లు ఆయన కోసం ఎదురుచూస్తున్నారు. కీలకమైన ఈ అధికారికి సెల్‌ఫోన్ కూడా లేకపోవడంతో ఆయన్ను సంప్రదించలేకపోయారు. దీంతో ఇన్‌పుట్ సబ్సిడీ డబ్బుపై అధికారులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి.
ఇన్‌పుట్ సబ్సిడీ కోసం బ్యాంకర్ల హడావిడి
Published Wed, Jan 1 2014 4:43 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement