
కళంకం
వారంతా ఉన్నత విద్యావంతులు.. సమాజంలో ఆదర్శంగా నిలవాల్సిన మేధావులు.
కడప: వారంతా ఉన్నత విద్యావంతులు.. సమాజంలో ఆదర్శంగా నిలవాల్సిన మేధావులు. పవిత్రమైన వృత్తి చిన్నబుచ్చుకునేలా కొందరు వ్యవహరిస్తుంటే, మరికొందరు కళంకితులుగా మారుతోన్నారు.
బాధ్యతలు నిర్వర్తించడంలో ఎవరికి వారు విఫలమవుతూ రిమ్స్‌ను నిత్యం వివాదాల సుడిగుండంలో నెడుతున్నారు. ఇటు విద్యార్థులు, అటు వైద్యుల కారణంగా రిమ్స్ అభాసుపాలవుతోంది. పేదలకు మెరుగైన వైద్యసేవలు అందాలనే సంకల్పంతోబాటు, విద్యార్థులకు అత్యున్నత విద్య అందుబాటులో ఉండాలనే ఉద్ధేశంతో జిల్లా కేంద్రంలో రిమ్స్ మెడికల్, డెంటల్ కళాశాలలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నెలకొల్పారు. విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు, వైద్యపరికరాలను అందుబాటులో ఉంచారు.
అలాగే బడుగులకు మెరుగైన వైద్య సదుపాయం దక్కాలని ఆకాంక్షించారు. ఎవరి పరిధిలో వారు వారి వారి బాధ్యతలను నిర్వర్తిస్తే అటు వృత్తికి, ఇటు అత్యున్నత విద్యకు, మరోవైపు వైఎస్ సంకల్పం నెరవేరుతుంది. అయితే మేధావి వర్గంగా సమాజం భావించే వీరి చర్యల కారణంగా ఏకంగా నవ్వులు పాలవుతోంది. అందుకు ఇటీవల చోటుచేసుకున్న వరస ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అర్ధాంతర మృతి పరిష్కారమా....
రిమ్స్ డెంటల్ కళాశాల విద్యార్థి కృష్ణచైతన్య అర్ధాంతర మృతి బాధాకరపరిణామమే. దంత వైద్యవిద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలనే తల్లిదండ్రులు కన్న కలలకు అర్ధాంతరంగా ముగింపు పలికాడు. చేతికొచ్చిన కొడుకు అర్ధాంతరంగా మృతి చెందితే వారి కడుపు కోతను ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. అయితే మంగళవారం చోటుచేసుకున్న ఆత్మహత్యకు దారితీసిన కారణాలను విశ్లేషిస్తే విద్యార్థులు వారి పరిమితి దాటి ప్రవర్తించడమేనని స్పష్టమవుతోంది. సహచర విద్యార్థినులను సోదరిగా భావించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇవేవి పట్టించుకోకుండా బాధ్యతారహితంగా వ్యవహరించి కృష్ణచైతన్య ప్రాణాల మీదకు తెచ్చుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్వల్ప ఘటనలకే కలత చెంది ఆత్మహత్య వైపు మొగ్గడం ఎంతమాత్రం సరైంది కాదని పలువురు పేర్కొంటున్నారు. వైద్యకళాశాల విద్యార్థిని ఫొటోలు తీసి మరో విద్యార్థి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న ఉదంతం కూడా చోటు చేసుకుంది. భావోద్వేగంలో ఆందోళనలు చేపట్టినా అత్యున్నత వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అర్థవంతంగా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు.
కళంకితులుగా మారుతున్న
అధ్యాపకులు....
పవిత్రమైన వైద్యవిద్యను అభ్యసించి సేవాదృక్పధంతో వ్యవహరించాలని సూచించాల్సిన అధ్యాపకులు రిమ్స్‌లో కళంకితులుగా మారుతున్నారు. ఆదర్శంగా నిలవాల్సిన అధ్యాపకులైన వైద్యులు కొందరు మాయనిమచ్చను తెచ్చిపెడుతున్నారు.
ఇందుకు అక్రమంగా డబ్బులు సంపాదించాలనే కారణమే కనిపిస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న ఫైనల్ ఇయర్ ప్రాక్టీకల్ పరీక్షలు ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. పరీక్షల్లో పాస్ కావాలంటే అచార్యదేవోభవ అని పిలుచుకుంటున్న గురువుకు డబ్బులు చెల్లించుకోవాల్సి రావడం విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేసింది. విద్యలో చురుగ్గా ఉండే విద్యార్థులను డబ్బులు ఇవ్వలేదనే కారణంగా ఫెయిల్ చేయడం ఎంతవరకు సమంజసమో ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉంది. ఈతతంగం గైనిక్, మెడిసన్ విభాగాల్లో చోటుచేసుకుంది.
కేవలం బ్బులు ముట్టజెప్పని కారణంగా 22మందిని ఫెయిల్ చేసినట్లు తెలుస్తోంది, ఈ విషయాన్ని కొందరు విద్యార్థులు డెరైక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేవు. ఇకనైనా రిమ్స్‌ను ఆదర్శంగా నిలిపేందుకు ఎవరి ప్రయత్నం వారు చేయాలని పలువురు కోరుతున్నారు.