కూరగాయలు విక్రయిస్తున్న ఈమె పేరు కూరపాటి సుంకులమ్మ. కృష్ణగిరి మండల పరిషత్ అధ్యక్షురాలు. వాస్తవానికి మండల పాలనా వ్యవహారాల్లో కీలకంగా ఉండాలి. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పాటుపడాలి. తనను ఎన్నుకున్న ప్రజల బాగోగులు చూడాలని ఈమెకూ ఉంది. కానీ అక్కడి అధికార పార్టీ నాయకుడు అవకాశం ఇవ్వడం లేదు. సోదరుడు డిప్యూటీ సీఎం కావడంతో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. సొంత పార్టీకే చెందిన దళిత మహిళా ఎంపీపీని అడుగడుగునా అవమానాలకు గురిచేస్తున్నాడు.
కర్నూలు టాస్క్‌ఫోర్స్ : డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఇలాకాలో దళిత మహిళా ప్రజాప్రతినిధి ఆత్మగౌరవాన్ని అధికార పార్టీ నాయకులు మంటగలిపారు. పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి ఎంపీపీ కూరపాటి సుంకులమ్మను సొంత పార్టీ వారే తీవ్ర అవమానాలకు గురిచేస్తున్నారు. కనీసం మండల పరిషత్ సమావేశాలకు కూడా ఆహ్వానించడం లేదు. మహిళా ప్రజాప్రతినిధి అనే మర్యాద కూడా ఇవ్వకుండా డిప్యూటీ సీఎం సోదరుడు కేఈ జయన్న రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. కృష్ణగిరి మండలం ఆలంకొండ ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికైన సుంకులమ్మను ఎంపీపీగానూ ఎన్నుకున్నారు. ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్క సమావేశానికీ అధికారులు ఆహ్వానించడంలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు చేసిన అప్పులు తీర్చేందుకు స్వగ్రామం ఆలంకొండలోనిఇల్లు, పొలం సైతం విక్రయించామని, ఇప్పుడు తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా కూలి పనులకు వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. సుంకులమ్మకు భర్త రంగస్వామితో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు దివ్యాంగుడు. అప్పులు కట్టేందుకు సొంతూరిలోని ఇంటిని సైతం అమ్మేయడంతో ప్రస్తుతం వీరు డోన్ పట్టణంలోని కొత్త బస్టాండు వెనుక చిన్న ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. రూ.700లకు అద్దెకు తీసుకున్న ఆ ఇంట్లో దుర్భర జీవితం గడుపుతున్నారు. రంగస్వామి డోన్ పాతబస్టాండ్‌లో హమాలీగా పనిచేస్తున్నాడు. ఎంపీపీ సుంకులమ్మ పట్టణంలో కూరగాయలు విక్రయిస్తున్నారు. ఈ నాలుగేళ్లలో ఎంపీపీగా కార్యాలయం ముఖం రెండుసార్లు మాత్రమే చూశానని, మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఏమిటనే విషయం కూడా తనకు తెలపడం లేదని ఆమె వాపోతున్నారు. ‘కేఈ జయన్న కనుసన్నల్లోనే అధికార యంత్రాంగమంతా నడుస్తోంది. నా సంతకాలు కూడా వారే ఫోర్జరీ చేస్తున్నారు. దళిత తేజం లాంటి కార్యక్రమాల్లో దళితుల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆయన ఇలాకాలో దళితులకు తన కుటుంబ సభ్యులు ఏ మాత్రం గౌరవం ఇస్తున్నారనే దానిపై ప్రజలకు స్పష్టం చేయాల’ని అన్నారు.
హక్కులనుకాలరాసే కుట్ర...
కృష్ణగిరి మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను దళితులకు కేటాయించినా.. వారు మాత్రం ఉత్సవ విగ్రహాలే. దళితులను అడ్డం పెట్టుకొని మండలంలో ప్రజాధనాన్ని కేఈ సోదరులు లూటీ చేస్తున్నారు. ఈ దుర్భర పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించేందుకే నోరు తెరవాల్సి వస్తోంది.– తొర్రి రంగన్న, కృష్ణగిరి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు
పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు...
‘ఎంపీపీగా ఎన్నికై నాలుగేళ్లు గడిచినా ఒక్క పేపర్ మీద కూడా నా సంతకాలు తీసుకోలేదు. మండల పరిషత్ సమావేశాలకు కూడా ఆహ్వానించడం లేదు. అధికార పార్టీ నాయకుల మాటలు నమ్మి ఉన్న ఆస్తిని ఎన్నికల్లో హారతి కర్పూరంలా ఖర్చుచేయాల్సి వచ్చింది. ఆత్మ గౌరవం కాపాడుకునేందుకే నేడు గళం విప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మమ్మల్ని పురుగుల కంటే హీనంగా చూస్తున్నార’ని ఎంపీపీ సుంకులమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment