బందిపోటు దొంగలపై నిఘా !
సూర్యాపేట కాల్పులపై అప్రమత్తమైన పోలీసులు
మావోయిస్టుల కదలికలపై ఆరా
అనుమానిత ప్రాంతాల్లో సోదాలు
విజయవాడ సిటీ : నల్గొండ జిల్లా సూర్యాపేట పోలీసులపై జరిగిన కాల్పులతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్ధు జిల్లా కావడంతో కాల్పులు జరిపిన దుండగులు నగరం మీదుగా ఉత్తరాది రాష్ట్రాలకు తరలివెళ్లే అవకాశం ఉందనే సమాచారంపై పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. పోలీసులపై కాల్పులు జరిపిన వారు బందిపోటు ముఠాలకు చెందిన వారా? లేక మావోయిస్టులా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తొలుత ఉత్తరాదికి చెందిన బందిపోటు ముఠాలే పోలీసులపై కాల్పులు జరిపినట్లు పోలీసు అధికారులు భావించారు. ఇదే జరిగితే హైదరాబాద్ మీదుగా కంటే విజయవాడ మీదుగానే ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లేందుకు ముఠాల సభ్యులు ప్రయత్నిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రైల్వేస్టేషన్, బస్టాండ్ సహా పలు ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెట్టారు.
అనుమానిత ప్రాంతాల్లో అవసరమైన సోదాలు జరుపుతున్నారు. బుధవారం అర్థరాత్రి సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్, హోంగార్డు అక్కడికక్కడే చనిపోగా..ఇన్‌స్పెక్టర్, గన్‌మ్యాన్‌తీవ్రంగా గాయపడ్డారు. గన్‌మ్యాన్ నుంచి కార్బన్(తుపాకీ) గుంజుకొని పరారయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గన్‌మ్యాన్ వద్ద కార్బన్ గుంజుకునే సమయంలో ఓ వ్యక్తికి చెందిన గుర్తింపు కార్డు(ఐడెంటిటీ) కార్డు కిందపడిపోగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుర్తింపు కార్డులోని వ్యక్తి ఒడిశాకు చెందిన వాడిగా గుర్తించారు. దీంతో ఆముఠా కూడా ఒడిశా ప్రాంతానిదేనని పోలీసులు భావిస్తున్నారు. ఒడిశా దొంగల ముఠాలు ఆయుధాలు వినియోగించవని, బీహార్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని దొంగలే ఉపయోగిస్తారని పోలీసులు చెబుతున్నారు. పోలీసులను ఏమార్చేందుకు నకిలీ గుర్తింపు కార్డును ఘటనా స్థలంలో వదిలేసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది..
దోపిడీ ముఠాలేనా?
కాల్పుల్లో గాయపడిన ఇన్‌స్పెక్టర్ మొగిలయ్య బస్సు దోపిడీ ముఠాలను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందట మీరట్‌కు చెందిన ఆరుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరిని వెంట తీసుకొని సొత్తు రికవరీకి ప్రయత్నిస్తున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. ఈ క్రమంలోనే దోపిడీ ముఠాలు కాల్పులు జరిపి ఉండొచ్చని భావిస్తున్నారు. మీరట్‌కు చెందిన పండాలు దోపిడీలు మాత్రమే చేస్తుంటారు. ప్రయాణికుల మాదిరి బస్సుల్లో ప్రయాణిస్తూ అందరూ ఆదమరిచి ఉన్న సమయంలో సూట్‌కేసులు, బ్యాగులు తీసుకొని ఉడాయిస్తుంటారు. ఇప్పటివరకూ పండాలు ఆయుధాలు వినియోగించిన దాఖలాలు లేవని నగర నేర పరిశోధన విభాగం పోలీసులు చెబుతున్నారు. ఒకవేళ తప్పించుకునే క్రమంలో కాల్పులు జరిపినా, పోలీసుల ఆయుధాలు తీసుకెళ్లేంత సాహసం చేయరనేది పోలీసుల బలమైన అభిప్రాయం. వీరు బీహార్‌లో చౌకగా లభ్యమయ్యే తపంచాలను వాడుతుంటారని చెబుతున్నారు.
మావోయిస్టుల ప్రమేయంపై ఆరా!
పోలీసులపై జరిగిన కాల్పుల్లో మావోయిస్టుల ప్రమేయం కాదనలేమని పోలీసులు అంటున్నారు. సాధారణంగా పోలీసులు తారసపడినప్పుడు మావోయిస్టులు కాల్పులకు తెగబడుతుంటారు. ఆ కాల్పుల్లో పైచేయి సాధించినప్పుడు సంబంధిత పోలీసుల నుంచి ఆయుధాలు తీసుకొని పరారవుతుంటారు. ఇక్కడ గన్‌మ్యాన్ కార్బన్ తీసుకెళ్లడాన్ని బట్టి ఇది మావోయిస్టుల పనే అయి ఉంటుందని సీనియర్ పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు ఒడిశాలో మావోయిస్టుల కదలికలున్నాయంటున్నారు. ఘటనా స్థలంలో దొరికిన గుర్తింపు కార్డులోని వ్యక్తి వివరాలు తెలిస్తే తప్ప సూర్యాపేట కాల్పుల కేసు కొలిక్కిరాదనేది పోలీసుల నిశ్చితాభిప్రాయం.