కక్షల కుంపటి ఆరు జీవితాలను కటకటాల్లోకి నెట్టింది. టి.గోకులపాడులో సర్పంచ్ పదవి దక్కకపోవడం ఓటమి వర్గాన్ని హత్యకు ఉసిగొల్పింది. సంతకు వెళ్తుండగా దారికాచి అత్యంత దారుణంగా హతమార్చారు. ఆరేళ్ల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనపై క్రిష్టగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం తుది తీర్పు వెలువడుతున్న విషయం తెలిసి నిందితుల కుటుంబ సభ్యులు, బంధువులతో జిల్లా కోర్టు ప్రాంగణం కిక్కిరిసింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వీరిలో ఎడతెగని ఉత్కంఠ. ఆరుగురికి జీవితఖైదు విధిస్తూ జడ్జి తీర్పునివ్వడంతో వారి కళ్లలో కన్నీరు కట్టలు తెంచుకుంది.
కర్నూలు(లీగల్), న్యూస్‌లైన్: పంచాయతీ ఎన్నికలు రేపిన చిచ్చు రెండు కుటుంబాలకు దహించి వేసింది. రాజుకున్న వివాదం మరింత రగిలడంతో కాంగ్రెస్ వర్గానికి చెందిన వ్యక్తిని ప్రత్యర్థులు పొట్టనపెట్టుకోగా ప్రస్తుతం నిందితులకు యావజ్జీవ శిక్ష పడింది. ఫలితంగా రెండు కుటుంబాలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. గోకులపాడుకు సంబంధించిన ఈఘటనపై నమోదైన కేసులో ఆరవ అదనపు జిల్లా జడ్జి పి.వి. జోతిర్మయి ఆరుగురికి జీవితఖైదు విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించారు. వివరాలు.. క్రిష్ణగిరి మండలం టి.గోకులపాడుకు చెందినతెలుగు రంగన్న కుమారుడు వెంకటేశ్వర్లు 2006 పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగి విజయం సాధించా డు. టీడీపీ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయిన పింజరి మౌలాలి రంగన్న, అతని కుమారుడిపై కక్ష పెంచుకున్నాడు. వారి హత్యకు పథకం పన్ని 2008 మే నెల 11వ తేదీన అమలు చేశాడు. కుమారుడి తో కలిసి ఆటోలో వెల్దుర్తికి వెళ్తున్న తెలు గు రంగన్నను అదే గ్రామానికి చెందిన బోయబోగం పెద్ద మద్దిలేటి, బోయబో గం చిన్నమద్దిలేటి, పెద్దయ్య, రామాం జినేయులు, హనుమన్న, చిన్నహనుమంతు, చంద్ర, పెద్ద హనుమంతు, నాగన్న, లక్ష్మన్న, కొండాపురం మద్దిలేటి, రామాంజనేయులుతో కలిసి హత్య చేసినట్లు తెలుగు మల్లేసు ఫిర్యాదు చేయడంతో క్రిష్ణగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
విచారణలో 1వ నిందితుడు బోయబోగం పెద్దమద్దిలేటి, 5వ నిం దితుడు బోయ హనుమన్న, 6వ నిం దితుడు బోయ చిన్నహనుమంతు, 9వ నిందితుడు బోయబోగం నాగన్న, 10వ నిందితుడు బోయబోగం లక్ష్మన్న, 11వ నిందితుడు బోయ కొండాపురం మద్దిలేటిపై నేరం రుజువు కావడంతో వారికి జీవితఖైదు, రూ. వెయ్యి ప్రకారం జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిం ది. 2, 3, 4, 7, 8, 12వ నిందితులపై నేరం రుజువు కాకపోవడంతో కేసు కొట్టేసింది. సాయంత్రం 4 గంటలకు తీర్పు రావడంతో నిందితుల కుటుంబీకులు, బంధువుల రోదనతో కోర్టు ప్రాంగణం దద్దరిల్లింది. శిక్ష పడిన వారిని సాయంత్రం 5 గంటలకు పోలీసు వ్యాన్‌లో కర్నూలు సబ్ జైలుకు తరలించారు.
గోకులపాడులో నిశ్శబ్దం
క్రిష్ణగిరి, న్యూస్‌లైన్: మండల పరిధిలోని టి.గోకులపాడు గ్రామం సుమారు యాభై ఏళ్లుగా ఆధిపత్య గొడవల్లో రగిలిపోతోంది. ఇరువర్గాల నాయకులు ఆధిపత్యపోరులో అమాయకులు బలై పోతున్నారు. 2008లో జరిగిన హత్య కేసులో నేరం రుజువు కావడంతో ఓ వర్గానికి చెందిన వారికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. కేసులో ఒక వర్గం ఎప్పుడో ఇంటి పెద్ద దిక్కును కోల్పోగా ప్రస్తుతం మరో వర్గం జైలుపాలు కావడంతో వారి మీద ఆధారపడిన కుటుంబాల జీవనం ప్రశ్నార్థకమైంది.
యాభై ఏళ్లుగా సాగుతున్న కోట్ల, కేఈ వర్గాల ఆధిపత్య గొడవల్లో ఇప్పటికి ఇరువర్గాలకు చెందిన పది మంది బలైపోయారు. వీరి కుటుంబాలు దాదాపు రోడ్డున పడ్డాయి. 30ఏళ్ల క్రితం అధికార పార్టీకి చెందిన వారికి మొదటిసారి ఐదేళ్ల జైలుశిక్ష పడడంతో అనుభవించారు. ప్రస్తుతం రెండోసారి గ్రామానికి చెందిన వారికి కోర్టు శిక్ష విధించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక ఎస్‌ఐలు శ్రీహరి, తిరుపతిబాబు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు.
కక్షల కుంపటి.. బతుకు చీకటి
Published Sat, Mar 8 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement