మండుటెండలకు 215 మంది బలి
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న వడగాడ్పులు
రామగుండం, నల్లగొండలో 45 డిగ్రీలు నమోదు
ఏపీలోనూ వడదెబ్బకు 395 మంది మృతి
మరో రెండు రోజులపాటు ఎండల తీవ్రత
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. గత వారం రోజులతో పోల్చి తే ఉష్ణోగ్రతలు కాస్త తగ్గినా వడగాలుల ప్రభా వం తీవ్రంగానే ఉంది. దీంతో పగలు జనం రోడ్లపైకి రాలేకపోతున్నారు. సోమవారం రాష్ర్టవ్యాప్తంగా వడదెబ్బకు 215 మంది చనిపోయారు. వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 43 మంది చొప్పున, నల్లగొండలో 37 మంది బలయ్యారు. కరీంనగర్‌లో 30, మెదక్‌లో 21 మంది, ఆదిలాబాద్‌లో 13 మంది, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో 8 మంది చొప్పున చనిపోయారు. రంగారెడ్డిలో ఏడుగురు, హైదరాబాద్‌లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలో తెలంగాణ సమరయోధుడు అడ్డగట్ల కిషన్‌రావు(96) వడగాలుల వల్ల అనారోగ్యానికి గురై చనిపోయారు. అలాగే మండుటెండలకు ఖమ్మం జిల్లాలోని గార్ల మండలంలో ఆరు నెలల పసిపాప బలైంది. బీఆర్‌ఎన్ తండాకు చెందిన భూక్యా రాజేశ్ కూతురు త్రివేణికి ఆదివారమే మర్రిగూడెం వెంకటేశ్వరస్వామి ఆలయంలో అన్నప్రాసన జరిగింది. అయితే ఎండతీవ్రత వల్ల పాపకు వడదెబ్బ తగిలింది.
సోమవారం చిన్నారి పరిస్థితి విషమించి ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చనిపోయింది. హైదరాబాద్ ఎల్బీనగర్‌లోనూ ఎనిమిదేళ్ల పాప ఎండలకు బలైంది. కాగా, రామగుండం, నల్లగొండల్లో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్‌లో 44.4, ఆదిలాబాద్‌లో 43.3, అశ్వారావుపేటలో 42.3, జగిత్యాలలో 42.6, వరంగల్‌లో 42.8, హైదరాబాద్‌లో 41.5, రుద్రూర్‌లో 41.2, సంగారెడ్డిలో 40.3, తాండూరులో 40.7 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత మరో రెండు రోజులపాటు ఇదే స్థాయిలో ఉంటుందని, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకునే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపిం ది. కాగా అటు ఏపీలోనూ ఎండలు దడ పుట్టిస్తున్నాయి. వడగాడ్పులతో సోమవారం రాష్ర్టవ్యాప్తంగా 395 మంది మృతి చెందారు. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. అయితే ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తాంధ్రకు ఆనుకుని బంగాళాఖాతం తీరంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో ఒకట్రెండు రోజుల్లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములతో కూడిన జల్లులు, ఈదురుగాలులు వీచే అవకాశముందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.