ఫలితాలు రాకముందే ప్రవేశాలా? | Inter Admissions in Model Schools Kurnool | Sakshi
Sakshi News home page

ఫలితాలు రాకముందే ప్రవేశాలా?

Published Fri, Apr 19 2019 1:28 PM | Last Updated on Fri, Apr 19 2019 1:28 PM

Inter Admissions in Model Schools Kurnool - Sakshi

 కర్నూలు సిటీ: పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కాకముందే మోడల్‌ స్కూళ్లలో 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ప్రవేశాలకు షెడ్యూల్‌ వెలువడింది. అలాగే మే రెండో వారంలో పది ఫలితాలు రావచ్చని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈనెల 30వ తేదీ లోగా దరఖాస్తులకు ఆఖరు ప్రకటించడం విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. అసలు ఫలితాలు రాకముందే ఎలా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు తేదీని ఎలా ముగిస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల రెండో వారంలో పది మూల్యాంకనం ప్రారంభం కావాల్సి ఉండగా ఎన్నికల కారణంగా ఆలస్యం కావడంతో ఈనెల 15వ తేదీనుంచి మొదలైంది. ఇలా పది రిజల్ట్‌ ప్రకటించక ముందే దరఖాస్తు తేదీని ముగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఆరో తరగతి ప్రవేశాలకు గత నెల 31వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించి ఇటీవల ఫలితాలను విడుదల చేశారు. 7,8,9 తరగతుల్లో మిగిలిపోయిన సీట్లను సైతం భర్తీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్‌ ప్రవేశాలకు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఫలితాలు రాకముందే ఈనెల 15న షెడ్యుల్‌ జారీ చేయడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

7,8,9 తరగతుల ప్రవేశాలపై స్పష్టత కరువు..
జిల్లాలో ఉన్న 36 ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకునేందుకు మొదట ప్రకటించిన ప్రకారం నేడు ఆఖరి రోజు. అయితే  ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లు జూన్‌లో మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్ష పెడితే బాగుంటుందని విన్నవించడంతో డీఈఓతో చర్చించి ప్రవేశ పరీక్షపై నిర్ణయం తీసుకోవాలని కమిషనర్‌ ఇటీవల సూచించారు. ప్రవేశ పరీక్షను ముందు తరగతిలోని అన్ని సబ్జెక్టుల్లో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఐచ్ఛిక విధానంలో తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలలో పరీక్ష ఉంటుంది. ముందుగా అనుకున్నట్లు అయితే ఈ నెల 20న పరీక్ష నిర్వహించాల్సి ఉండగా, ఆరోజు సమ్మెటివ్‌–2 పరీక్షలు ఉండడంతో 21వ తేదీ జరపాలని నిశ్చయించినా కుదరకపోవడంతోనే ప్రవేశ పరీక్ష ఏర్పాటుపై నేటికీ స్పష్టత రాలేదు.  

దరఖాస్తు ప్రక్రియ ఇలా..  
ఆన్‌లైన్‌లో దరఖాస్తూలు చేసుకోవాలి. ఓసీ విద్యార్థులు రూ.100, బీసీలు రూ.60, ఇతరులు అయితే రూ.30 చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఈ నెల 30వ తేదీలోగా ఏపీ ఆన్‌లైన్‌లో కానీ, మీ సేవ ద్వారా దరఖాస్తు పంపించాలి. మే 25న ఎంపిక జాబితా ప్రదర్శించి, 26వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు.

‘మోడల్‌’లో అందుబాటులో ఉండే కోర్సులివే..  
ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూప్‌ల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఒక్కో విభాగానికి 20 సీట్ల చొప్పున ఒక ఆదర్శ పాఠశాలలో నాలుగు విభాగాలకు మొత్తం 80 సీట్లు ఉంటాయి. వీటి ప్రవేశాలకు విద్యార్హత, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement