చిలకలూరిపేట, న్యూస్‌లైన్ :పలు దొంగతనాలతో ప్రమేయం ఉన్న అంతర్ జిల్లా నేరస్తుడ్ని పట్టణ పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. 10 లక్షల విలువ చేసే బంగారు అభరాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. అర్బన్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. పొన్నూరు మండలం కసుకర్రు గ్రామానికి చెందిన కంచర్ల మోహనరావు పలు దొంగతనాలు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడు. 2013 జూన్‌లో జైలు నుంచి బయటకు వచ్చిన మోహనరావు గుంటూరు నగరం, జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన దొంగతనాల్లో ప్రధాన నిండితుడు. తలుపులు వేయకుండా నిద్రిస్తున్న ఇళ్లలోకి చాకచక్యంగా చొరబడి దొంగతనాలు చేయడంతో సిద్ధహస్తుడు. 11 దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్న మోహనరావును మంగళవారం ఏఎంజీ ఎదురు డొంక ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సమయంలో పోలీసులు వలపన్ని పట్టుకున్నట్లు ఎస్పీ వివరించారు.
నిందితుడి వద్ద 34 సవర్ల బంగారు అభరణాలు, 10 తులాల వెండి, రూ.20 వేల నగదు, వాచి, ఐ-ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిండితుడి అరెస్టులో సమర్థంగా వ్యవహరించిన అర్బన్ సీఐ గొట్టిపాటి చెంచుబాబు, ఎస్‌ఐలు రాధాకృష్ణ, అసన్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వీరికి రివార్డులు ప్రక టించారు. స్థానికంగా దొంగ బంగారం కొనుగోలు చేసిన నగల వ్యాపారి రాచుమల్లు బద్రీనాథ్‌పై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ ఇళ్లలో విలువైన వస్తువులు ఉంచుకొని తలుపులు తెరచి పడుకోవడం సరికాదని, అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల బదిలీలు పూర్తికావచ్చాయని, రెండురోజుల్లో జిల్లాలో పూర్తిస్థాయిలో పోలీసుల బదిలీలు ఉంటాయన్నారు. సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ డి.ప్రసాద్, అర్బన్ సీఐ జి.చెంచుబాబు తదితరులు ఉన్నారు.