కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఈ నెల 12 నుంచి 28 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పరీక్షలకు సంబంధించి సామగ్రిని సంబంధిత డిపార్టుమెంటల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లకు అందజేసేందుకు ఆర్ ఐవో కార్యాలయంలో భద్రపరిచారు.
ఈ నెల 4న ప్రాక్టికల్ పరీక్షలు ముగిశాయి. థియరీ పరీక్షలకు గడువు దగ్గరపడుతుండడంతో ఏర్పాట్లు వేగవంతం చేశారు. విద్యార్థులకు హాల్‌టికెట్స్‌తో పాటు ఎస్‌ఆర్‌లు, సెంటర్‌ఎన్‌ఆర్‌లు, బార్‌కోడ్స్ సూచనలతో కూడిన బుక్‌లెట్లు పంపిణీ చేస్తున్నారు. గతంలో వలే కాకుండా ఈసారి పరీక్ష కేంద్రానికి నిర్ణీత సమయానికి మించి ఒక్క నిమిషం ఆలస్యం అయినా విద్యార్థులను అనుమతించేది లేదని ఇంటర్‌బోర్డు నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రం చేరుకోవాల్సి ఉంటుంది. 8.45 వరకు హాల్‌లోకి అనుమతిస్తారు. 9గంటల తర్వాత వచ్చే వారిని కేంద్రంలోకి అనుమతించరు.
పెరిగిన 28 కేంద్రాలు
ఇంటర్ పరీక్షల నిర్వహణకు గాను జిల్లా వ్యాప్తంగా 141 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈ సారి మరో 28 కేంద్రాలు కొత్తగా పెరిగాయి. ఇందులో జిల్లావ్యాప్తంగా 23 ఆదర్శ పాఠశాలల్లో సైతం కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 141 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 141 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించారు. ఆరు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, ప్రతి 25 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు.
మాస్ కాపీయింగ్‌కు అడ్డుకట్ట
మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఈ సారి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంను ప్రవేశపెట్టారు. ఆయా కేంద్రాల్లో విధులు నిర్వహించే అధికారులు, ఇన్విజిలేటర్లు పరీక్ష సమయంలో ఎవరితో ఏమేమీ మాట్లాడారనే విషయాలన్నీ రికార్డు అవుతాయి. అనుమానం వస్తే వెంటనే ఉన్నతాధికారులు జీపీఎస్ ద్వారా రికార్డయిన వాయిస్‌ను పరిశీలించనున్నారు. ఏమైనా అక్రమాలు జరిగినట్లు వెల్లడైతే వెంటనే చర్యలు చేపట్టనున్నారు.
1,02,157 మంది విద్యార్థులు
ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 42,916 మంది, వృత్తివిద్య కోర్సులో 3642 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 39,744 మంది విద్యార్ధులు, ప్రైవేట్ విద్యార్ధులు 10,010 మంది , వృత్తి విద్యకోర్సుల్లో 4,376 మంది, ప్రైవేట్‌గా 1,469 మంది మొత్తం 1,02,157 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కలెక్టర్, ఆర్‌ఐవో వారం రోజులుగా అన్ని విభాగాల అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
హాల్‌టికెట్లు ఇవ్వకుంటే కఠిన చర్యలు
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు విద్యార్థులకు హాల్‌టికెట్‌లివ్వకుండా వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య, తాగునీటి సౌకర్యాలతోపాటు సెంటర్ల వరకూ ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కేంద్రాల వద్ద ముందస్తుగా 144 సెక్షన్ విధించాం. పరీక్ష సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం.
-ఆర్‌ఐవో రమేశ్‌బాబు
సమస్యలుంటే సంప్రదించండి.
పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఎదురైనట్లయితే
0878-2241215,
9440593803, 9849500923
నంబర్లలో సంప్రదించవచ్చు.
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
Published Sun, Mar 9 2014 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
Advertisement
Advertisement