- 20 రోజుల్లో 25 దోపిడీలు చేసిన యువకులు
హనుమాన్‌జంక్షన్ రూరల్(కృష్ణా జిల్లా): జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించేందుకు దోపిడీలకు పాల్పడుతున్న నలుగురు యువకుల ముఠాను శుక్రవారం కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్ చదివిన వీరు తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల్లో 25కి పైగా దోపిడీలు చేసి ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి 27 సెల్‌ఫోన్లు, రెండు బంగారు ఉంగరాలు, కారు, దాడికి ఉపయోగించిన వంటపాత్ర, కట్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం వీరిని నూజివీడు డీఎస్పీ వి.శ్రీనివాసరావు మీడియా ఎదుట ప్రవేశపెట్టి వారి వివరాలు తెలిపారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కేపీహెచ్‌బీ ఆల్విన్ కాలనీకి చెందిన చేబత్తిన అఖిల్, షేక్ ఫయాజ్, కల్యాణం వికాస్, చాగంటి శ్రీకాంత్ ఇంటర్‌లో క్లాస్‌మేట్స్. మద్యం, హుక్కా వంటి వ్యసనాలకు, జల్సాలకు అలవాటుపడిన వీరు ముఠాగా ఏర్పడి తొలుత చిన్నచిన్న నేరాలు చేశారు. క్రమంగా దోపిడీ దొంగలుగా మారారు.
ఈ నెల మూడో తేదీన హైదరాబాద్‌లో ఓ క్యాబ్ మాట్లాడుకుని ఎక్కిన ఈ నలుగురు డ్రైవర్‌ను దారిలో చితకబాది అదే కారులో ఉడాయించారు. తర్వాత వీళ్లు అద్దెకు తీసుకున్న ఫ్లాట్ యాజమాని అమెరికా వెళ్లడంతో ఆయన కారు నంబరును వీరు దొంగిలించిన కారుకు పెట్టుకుని తిరిగారు. హైదరాబాద్ నుంచి కారులో ప్రయాణం మొదలుపెట్టిన వీరు ఏలూరు వరకు దారిపొడవునా పలుచోట్ల దోపిడీలకు పాల్పడ్డారు. లిఫ్ట్ ఇస్తామని కారు ఎక్కించుకుని తర్వాత వారిని చితకబాది నగదు, నగలు, సెల్‌ఫోన్లు దోచుకునేవారు. వీరిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. జాతీయ రహదారిపై వీరవల్లి వద్ద నిర్వహించిన తనిఖీల్లో నలుగురు యువకులు అనుమానాస్పదంగా ఉండడం, కారులో గుట్టగా సెల్‌ఫోన్లు ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నేరచరిత్ర బయటపడింది. ఈ ముఠాను పట్టుకున్న హనుమాన్‌జంక్షన్ సి.ఐ. జయకుమార్, ఎస్.ఐ. తులసీధర్, వీరవల్లి ఎస్.ఐ. మురళీకృష్ణలను డీఎస్పీ అభినందించారు.