బాపట్లటౌన్: ఇంటర్మీడియట్ విద్యార్థినిని హత్య చేసి, మృతదేహాన్ని దొరువు(ఎండిపోయిన నీటి గుంత)లో పడేసి చెత్తతో కప్పేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు వెనుక దొరువు నుంచి రెండురోజులుగా దుర్వాసన వస్తుండటంతో స్థానికులు వెళ్ళి చూడగా అక్కడ ఓ మృతదేహం కుళ్ళిపోయి కనిపించింది. చెట్టు కొమ్మలు, ఆకులతో కప్పేసి ఉండటంతో మృతదేహం అస్పష్టంగా కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పట్టణ పోలీసులు వచ్చి పరిశీలించి క్లూస్‌టీంను రప్పించారు. క్లూస్‌టీం వచ్చి చెత్తను తొలగించి మృతదేహన్ని బయటికి తీసింది. మృతురాలి పైజమా ఆమె మెడకు చుట్టి ఉంది. నాలుక బయటకు వచ్చింది. మొహంపై చున్నీ కప్పి ఉంది. దీని ఆధారంగా తొలుత లైంగిక దాడికి పాల్పడి, ఆపై హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. తమ కుమార్తె మండ్రు ప్రత్యూష ఈనెల 6వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విజయలక్ష్మీపురం వాసి మండ్రు సుబ్బమ్మను పోలీసులు సంఘటన స్థలానికి పిలిచి చూపించగా తన కుమార్తేనని గుర్తించారు.
ప్రత్యూష పట్టణంలోని భారతీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని. ఆమెకు మండలంలోని మరుప్రోలువారిపాలెం గ్రామానికి చెందిన మరుప్రోలు గోపిరెడ్డితో ఇటీవల ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం ఇంట్లో తెలిసి కుటుంబసభ్యులు మందలించడంతో గత ఏడాది అక్టోబర్ 15న ప్రత్యూష, గోపిరెడ్డి మరుప్రోలువారిపాలెం సమీపంలోని పంటపొల్లాల్లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు.
ఏరియావైద్యశాలలో చికిత్స చేయించిన కుటుంబసభ్యులు ఆమెను వారం రోజుల తర్వాత తిరిగి కళాశాలకు పంపించారు. అప్పటి నుంచి కళాశాలకు వెళ్తున్న ప్రత్యూష ఈనెల 6న కళాశాలకు అని చెప్పి ఇంటి నుంచి వెళ్ళి తిరిగిరాలేదు. దీంతో ఆమె కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ప్రియుడే హత్యచేశాడా? లేక కుటుంబ సభ్యులే హత్యచేసి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఇన్‌ఛార్జి సీఐ మల్లికార్జునరావు తెలిపారు.
ఇంటర్ విద్యార్థిని హత్య
Published Tue, Jan 20 2015 1:16 AM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM
Advertisement
Advertisement