ఇంటర్‌ విద్యార్థులకు ట్రాఫిక్‌ పరీక్ష | Inter students going centres late with traffic on roads | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థులకు ట్రాఫిక్‌ పరీక్ష

Published Fri, Mar 2 2018 10:03 AM | Last Updated on Fri, Mar 2 2018 10:03 AM

Inter students going centres late with traffic on roads - Sakshi

నెల్లూరు (టౌన్‌): ఇంటర్మీడియట్‌ వి ద్యార్థులకు నెల్లూరు నగరంలో ‘ట్రాఫి క్‌ పరీక్ష’ తప్పడం లేదు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభవుతున్న నేపథ్యంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఉదయం 7.30 నుంచే పరీక్ష కేంద్రాలకు బయలు దేరుతున్నారు. గురువారం నగరంలో చాలా కల్యాణ మండపాల్లో పెళ్లిళ్లు జరుగుతుండటంతో కారులు, బస్సులు, ఇతర వాహనాలతో నగర రోడ్లు రద్దీగా మారాయి. దీంతో మినీబైపాస్‌ పూర్తిగా ట్రాఫిక్‌తో స్తంభించింది. స్థానిక మాగుంట లేవుట్‌ నుంచి ఆత్మకూరు బస్టాండ్‌ ఫ్‌లైఓవర్‌ బ్రిడ్జి వరకు పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ ట్రాఫిక్‌ దిగ్భంధనంలో వందలాది మంది విద్యార్థులు చిక్కుకున్నారు.

ఓ వైపు పరీక్ష సమయం దగ్గర పడుతుండటం, మరోవైపు ట్రాఫిక్‌ ఒక అడుగు ముందుకు కదలకపోవడంతో విద్యార్థులు తమ తమ పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆందోళన పడ్డారు. పరీక్ష కేంద్రాలకు నిమిషం ఆలస్యమైన విద్యార్థులను అనుమతించకపోవడంతో విద్యార్ధులతో తల్లిదండ్రులు గుండెలు గుప్పెట్లో పెట్టుకుని ప్రత్యామ్నాయం కోసం పాకులాడారు. దీనికి తోడు నగరంలోని ప్రతి రోడ్డులో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ పనులతో గుంతలు తవ్వేయడంతో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ముసుకుని పోవడంతో వారి వ్యథ వర్ణణాతీతంగా మా రింది. నగరంలో ట్రాఫిక్‌ పరిస్థితిని అంచనా వేసి క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు ఎక్కడా కనిపించలేదు. దీంతో రెండు కిలోమీటర్ల ప్రయాణానికి గంటల సమయం పట్టింది. దీనికి తోడు ట్రాఫిక్‌ కంట్రోల్‌ కోసమంటూ  నగరంతో పాటు మినీబైపాస్‌ పొడవునా సర్కిళ్లలో అడ్డంగా డివైడర్‌ రాళ్లు పెట్టి దూరంగా వచ్చి మలుపు తిరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. వాహనాలు అడ్డదిడ్డంగా వస్తుండటంతో ట్రాఫిక్‌ ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నడుచుకుంటూ చిన్న వీధుల్లో నుంచి పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. శుక్రవారం రోజు పరీక్ష సమయానికి ట్రాఫిక్‌ను సరిదిద్దుతారో లేక  గాలికి వదులుతారోనన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్‌ పరీక్షకు750 మంది విద్యార్థులు గైర్హాజరు
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా జనరల్‌కు సంబంధించి 26,894 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 26,177 మంది హాజరయ్యారు. 717 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌కు సంబంధించి 1,216 మందికి 1,183 మంది హాజరు కాగా 33 మంది గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓ 3 కేంద్రాలను పరిశీలించగా ఫ్లయింగ్, సిటింగ్‌ స్క్వాడ్‌ అధికారులు 53 కేంద్రాలను తనిఖీ చేశారు. 

ఉర్దూ, సంస్కృతం పేపర్లలోఅచ్చు తప్పులు
ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఉర్దూ ప్రశ్నపత్రంలో రెండు అచ్చు తప్పులు వచ్చాయి. సంస్కృతంలో ఒక అచ్చు తప్పు వచ్చింది. దీనిని వెంటనే సరిదిద్దిన   అధికారులు డిపార్ట్‌మెంట్‌ అధికారులను సంప్రదించి వాక్యాలను సరిచేశారు.

సరైన వెలుతురు లేక ఇబ్బందులు
కొన్ని ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లో వెలుతురు లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.  కార్పొరేట్‌ కళాశాలల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. భవనాలకు సరిపడా కిటికీలు లేకపోవడం  కారణంగా కనిపిస్తుంది. లైట్లను ఏర్పాటు చేయాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉంది. వెలుతురుతోపాటు చాలా పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు లేవు. అప్పుడే ఎండలు వేసవికాలాన్ని తలపిస్తున్నాయి. ఉష్ణోగ్రత పెరగడంతో సరైన గాలి రాక విద్యార్థులు నరకయాతన పడ్డారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement